అమరావతిలో వేరే వర్గం నివసించే పరిస్థితి లేదు: మంత్రి ధర్మాన

12 Oct, 2022 12:40 IST|Sakshi

సాక్షి, శ్రీకాకుళం: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి ధర్మాన ఫైరయ్యారు. రాజధానిపై కమిటీ సిఫార్సులను గత ప్రభుత్వం పట్టించుకోలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, మంత్రి ధర్మాన మీడియాతో మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర ప్రజలు బతుకు పోరాటం చేస్తున్నారు. విశాఖ పరిపాలన రాజధాని అయితే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుంది. ప్రాంతాల మధ్య అసమానతలు ఉండకూడదు. ఒక్కచోట అభివృద్ధి జరిగితే మిగిలిన ప్రాంతాలు వెనుకబడతాయి. అందుకే ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజల్లో ఆవేదన కనిపిస్తోంది. 

ఉత్తరాంధ్ర అనేక రంగాల్లో వెనుకబడి ఉంది. రాజధానిపై కమిటీ సిఫార్సులను గత ప్రభుత్వం పక్కన పెట్టింది. దీనిపై చంద్రబాబు ఇప్పటికైనా సమాధానం చెప్పాలి. కొన్ని వర్గాల అభివృద్ధి కోసమే అమరావతి రాజధాని ప్రతిపాదన. వనరులు అన్ని ప్రాంతాలకు సమానంగా అందించాలి. గత అనుభవాలతో ఇప్పటికైనా పాఠాలు నేర్చుకోవాలి. అందరికీ న్యాయం జరగాలనే మూడు రాజధానుల నిర్ణయం. ఉత్తరాంధ్రకు చంద్రబాబు ఏం చేశారో చెప్పాలి. కొంత మంది చేతుల్లో ఉండే రాజధాని మనకు అవసరమా?.  అన్ని ప్రాంతాల వారు నివసించే పరిస్థితి ఒక్క విశాఖలోనే ఉంది. అమరావతిలో వేరే వర్గం నివసించే పరిస్థితి లేదు. 

విశాఖకు పరిపాలన రాజధాని వస్తే మీకు వచ్చిన నష్టమేంటి?. ఉత్తరాంధ్రకు ఒక్కసంస్థనైనా చంద్రబాబు తీసుకువచ్చారా?. టీడీపీకి అండగా నిలిచిన ఉత్తరాంధ్రకు చంద్రబాబు అన్యాయం చేశారు. విశాఖలో సెంటిమెంట్‌ లేదని అంటారా.. అమరావతిలో సెంటిమెంట్‌ ఉంటే లోకేష్‌ ఎందుకు ఓడిపోయాడు. 

మరిన్ని వార్తలు