అమరావతిలో భూములు ఇచ్చిన రైతులను గౌరవిస్తాము: మంత్రి ధర్మాన

15 Oct, 2022 08:49 IST|Sakshi

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: రాష్ట్రంలో ప్రాంతీయ అసమానతలు లేకుండా ఉండేందుకు విశాఖను ఒక రాజధానిగా చేయాలని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. శుక్రవారం శ్రీకాకుళం జిల్లా బార్‌ అసోసియేషన్‌ నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బార్‌ ప్రతినిధులు ఆయన్ని సత్కరించారు. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అమరావతిలో భూములు ఇచ్చిన రైతులను తాము గౌరవిస్తామని, కానీ రైతులను అడ్డం పెట్టుకున్న రియల్‌ ఎస్టేట్‌ మాఫియాను మాత్రం సహించబోమని చెప్పారు. ఉత్తరాంధ్రవాసులు ఎప్పుడూ రాజధానికి దూరంగానే ఉన్నారని, ఇన్నాళ్లకు దగ్గరగా రాజధాని ఏర్పాటుకు అవకాశం వచ్చిందని, దాన్ని జారవిడుచుకోవద్దని చెప్పారు. ఉత్తరాంధ్రలో రాజధాని ఉంటే భావితరాలకు విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగు పడతాయన్నారు.  శివరామకృష్ణన్‌ కమిటీ నివేదిక ప్రకారం రాజధానిగా విశాఖకు అన్ని అర్హతలు ఉన్నాయని అన్నారు. అధికార వికేంద్రీకరణ అవసరాన్ని ఆ కమిటీ సూచించిందన్నారు. పెద్ద క్యాపిటల్‌ ఈ రాష్ట్రానికి పనికిరాదని చెప్పిందన్నారు. చంద్రబాబు అందుకు భిన్నంగా, రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించారని చెప్పారు.

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక పాత కమిటీ నివేదికల ప్రకారం మూడు రాజధానుల నిర్ణయం తీసుకుందని తెలిపారు. srikaరాజధాని ఏర్పాటుకు ముందు చంద్రబాబు దొనకొండ, నూజివీడు అంటూ రోజుకో పేరు చెప్పి రియల్‌ ఎస్టేట్‌ వర్గాలకు అనుగుణంగా రాజధాని ప్రకటన చేశారని తెలిపారు. ఆ రోజు జీ టు జీ ఒప్పందం జరిగిందని చెప్పారని, కానీ సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌ అది నిజం కాదని చెప్పారని అన్నారు. మన ప్రాంత ప్రజల ఆకాంక్షలు, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని న్యాయవాదులు ఉద్యమాల్లో కీలక పాత్రను పోషించాలని కోరారు.  జిల్లా బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు  ఫల్గుణరావు, రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ సభ్యుడు  వాసుదేవరావు, వైఎస్సార్‌సీపీ జిల్లా లీగల్‌ సెల్‌ నాయకులు ఎమ్మెస్‌ వినయ్‌ భూషణ్‌ రావు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు