ప్రతి సచివాలయం ఒక రిజిస్ట్రార్‌ ఆఫీస్‌ 

7 Jan, 2023 08:46 IST|Sakshi

రెవెన్యూ ప్రాంతీయ సదస్సులో మంత్రి ధర్మాన ప్రసాదరావు 

సాక్షి, అమరావతి:  రాష్ట్రంలో ప్రతి గ్రామ, వార్డు, సచివాలయం ఒక రిజిస్ట్రార్‌ కార్యాలయంగా మారబోతోందని, తద్వారా మరింత పారదర్శకంగా ఆస్తుల రిజిస్ట్రేషన్లు జరుగుతాయని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం రెవెన్యూ శాఖలో అనేక సంస్కరణలు చేపట్టి, సత్ఫలితాలను సాధిస్తోందని తెలిపారు. ఈ సంస్కరణల ద్వారా 70 ఏళ్లుగా ఏ ప్రభుత్వమూ చేయని సాహసం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం చేస్తోందన్నారు. వీటి ద్వారా ప్రజలకు మరింత పారదర్శకమైన, సమర్ధవంతమైన, వివాదరహితమైన సేవలు అందుతున్నాయని వివరించారు.

వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు భూ రక్ష పథకం (రీసర్వే) ద్వారా అనేక భూముల వివాదాలను ప్రభుత్వం పరిష్కరిస్తోందని తెలిపారు. శుక్రవారం విజయవాడలో జరిగిన కోస్తాంధ్ర జిల్లాల రెవెన్యూ అధికారుల ప్రాంతీయ సదస్సులో మంత్రి మాట్లాడుతూ.. పరిపాలన వికేంద్రీకరణ అంటే ఏమిటో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చేతల్లో చూపించారని అన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల  వ్యవస్థతో ప్రజల ముంగిటకే పారదర్శక పాలన తెచ్చారని, దీన్ని ప్రజలు ఎంతగానో స్వాగతిస్తున్నారని చెప్పారు. అసైన్డ్‌ భూములపై అధ్యయనానికి సీఎం వైఎస్‌ జగన్‌ ప్రత్యేక కమిటీని నియమించారని, ఈ కమిటీ ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేసి నివేదిక సమర్పించాక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. భూముల రీసర్వే ప్రక్రియ ఇప్పటివరకు ఏ ప్రభుత్వం చేయని సాహసోపేతమైన నిర్ణయమన్నారు. ఎన్నో ఏళ్లుగా ప్రజలు ఎదుర్కొంటున్న భూ సమస్యలను పరిష్కరించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. భూముల రీసర్వేలో జిల్లా కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు, రెవెన్యూ అధికారుల చొరవ అభినందనీయమని అన్నారు. భూ వివాదాలు పరిష్కారమవుతుండటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు.

పేద, బడుగు, బలహీన వర్గాలవారికి సొంతింటి కలను నెరవేరుస్తున్నామని 32 లక్షల మందికి ఇళ్ల పట్టాలు అందించామని వివరించారు. వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు భూ రక్ష పథకం (రీసర్వే), ఇళ్ల పట్టాల పంపిణీ, 22ఏ కేసులు, చుక్కల భూముల వివాదాలు, సాదా బైనమా, ఆర్వోఆర్, ఆర్వోఎస్‌ఆర్‌ పట్టా, నాలా, ఆక్రమణ భూముల క్రమబద్ధీకరణ, అనాధీన భూములు, ఈ–పంట తదితర అంశాలపై ఈ సదస్సులో చర్చించి, రెవెన్యూ సేవలను ప్రజలకు మరింత సమర్థవంతంగా అందించనున్నట్లు మంత్రి వివరించారు. రెవెన్యూ శాఖకు జవసత్వాలను తీసుకొచ్చి సంస్కరణలను సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ప్రజల అవసరాలను తీర్చాలనే ఏకైక లక్ష్యంగా పనిచేద్దామన్నారు.

వెబ్‌ల్యాండ్‌ ఎంట్రీలపై గతంలో కొన్ని విమర్శలు వచ్చేవని, రిజిస్ట్రేషన్‌ అయిన రోజే ఆటోమ్యుటేషన్‌ చేసి విమర్శలకు తావు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ధర్మాన స్పష్టం చేశారు. ఇప్పటికే తిరుపతి, విజయవాడల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించామని, తర్వాతి సదస్సు విశాఖలో ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ సదస్సులో సీసీఎల్‌ఏ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్, రెవెన్యూ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ రజత్‌ భార్గవ, సీసీఎల్‌ఏ అదనపు కార్యదర్శి ఏఎండీ ఇంతియాజ్, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్స్‌ కమిషనర్, ఐజీ రామకృష్ణ, కోస్తాంధ్ర జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు