లక్ష్య సాధనకు అనుగుణంగా పనిచేస్తా

14 Apr, 2022 05:41 IST|Sakshi

రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన 

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి నిర్దేశించిన లక్ష్యసాధనకు అనుగుణంగా పనిచేస్తానని రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పారు. సచివాలయంలోని ఐదో బ్లాకులోని తన చాంబర్‌లో బుధవారం ఆయన మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. బ్రిటీషర్లు సర్వే చేశాక 75 సంవత్సరాల కాలంలో ఏ ప్రభుత్వం భూముల సమగ్ర సర్వే నిర్వహించలేకపోయిందన్నారు.

తమ ప్రభుత్వం అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పిస్తూ పెద్దఎత్తున భూ సర్వే నిర్వహించడం ద్వారా టైటిల్‌ ఫ్రీ చేయడం ద్వారా భూ యాజమాన్య హక్కులను అందరికీ బదిలీ చేయడం జరుగుతోందన్నారు. బాధ్యతలు స్వీకరించిన తర్వాత స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ–స్టాంపులకు అనుమతిచ్చే ఫైలుపై తొలి సంతకం చేశారు. కాగా, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ రజత్‌ భార్గవ్, సీసీఎల్‌ఏ జి.సాయిప్రసాద్, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్‌ అండ్‌ ఐజీ వి,రామకృష్ణ తదితరులు మంత్రికి పుష్పగుచ్ఛాలు ఇచ్చి అభినందనలు తెలిపారు. 

మరిన్ని వార్తలు