ఆంధ్ర–ఒడిశా ‘సరిహద్దు’పై చర్చలు జరపాలి

23 Sep, 2021 03:07 IST|Sakshi
ఆంధ్రా–ఒడిశా సరిహద్దులోని వివాదాస్పద ప్రాంతంలో ఉన్న కొటియా గ్రామం

ఏపీ సీఎం జగన్‌ను కోరిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌

సమస్య పరిష్కారానికి వ్యక్తిగతంగా జోక్యం చేసుకోవాలంటూ లేఖ 

శాంతియుత పరిష్కారానికి కేంద్రం మద్దతు ఉంటుందని ప్రకటన

సాక్షి, అమరావతి: ఆంధ్ర–ఒడిశా సరిహద్దు వివాదంపై ద్వైపాక్షిక చర్చలు జరపాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ బుధవారం ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కోరారు. కొటియా గ్రామాల సమస్య పరిష్కారానికి తక్షణం జోక్యం చేసుకోవాలని కోరుతూ ఏపీ సీఎంకు లేఖ రాశారు. ఒడిశా–ఏపీ రెండు రాష్ట్రాల నివాసితుల ప్రయోజనాల దృష్ట్యా వ్యక్తిగతంగా జోక్యం చేసుకోవాలని లేఖలో కోరారు. చీఫ్‌ సెక్రటరీలు, డెవలప్‌మెంట్‌ కమిషనర్ల స్థాయిలో ఉమ్మడి–వర్కింగ్‌ గ్రూప్‌ చర్చలతో పాటు, సమస్యల పరిష్కారానికి భవిష్యత్‌ రోడ్‌ మ్యాప్‌ రూపకల్పనకు రెండు రాష్ట్రాల సీఎంల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరగాలని సూచించారు.

వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించేందుకు తమ మద్దతు ఉంటుందని తెలిపారు. ఒడిశా రాష్ట్రం కోరాపుట్‌ జిల్లా పొట్టంగి బ్లాక్‌లోని కొటియా గ్రామ పంచాయతీల్లో కొన్ని నెలలుగా అనేక ఘర్షణలు జరిగాయని, అవి ఇప్పుడు గజపతిలోని ఇతర సరిహద్దు గ్రామాలకు విస్తరించాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ఇటీవల కొటియాలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించగా.. ఒడిశా ప్రభుత్వం పోలీసులను మోహరించిందని, కొటియా వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసిన విషయాన్ని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ఈ సందర్భంగా ప్రస్తావించారు.  

మరిన్ని వార్తలు