పదేళ్ల తర్వాత కొలువుదీరిన ధార్మిక పరిషత్‌

30 Aug, 2022 03:35 IST|Sakshi

బాధ్యతలు చేపట్టిన మఠాధిపతులు, ఆగమ పండితులు, ఇతరులు 

హిందూ ధర్మంపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇదే నిదర్శనం 

ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ   

సాక్షి, అమరావతి: ఆలయాలు, మఠాల నిర్వహణలో కీలకంగా వ్యవహరించే ధార్మిక పరిషత్‌ పదేళ్ల తర్వాత రాష్ట్రంలో మరోసారి కొలువుదీరింది. తొలి ధార్మిక పరిషత్‌ 2009 నుంచి మూడేళ్లపాటు బాధ్యతలు నిర్వర్తించింది. ఆ తర్వాతి ప్రభుత్వాలు పరిషత్‌ ఏర్పాటు చేయలేదు. మళ్లీ 21 మంది సభ్యులతో పరిషత్‌ ఏర్పాటు చేస్తూ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పరిషత్‌ సభ్యులు సోమవారం రాష్ట్ర సచివాలయంలో వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ప్రమాణ స్వీకారం చేసి పదవీ బాధ్యతలు చేపట్టారు.

వీరిలో అధికారులతో కలపి 14 మంది సభ్యులు సచివాలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఇద్దరు జూమ్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రమాణ స్వీకారంలో పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ చైర్మన్‌గా, దేవదాయ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ సభ్యులుగా, కమిషనర్‌  హరి జవహర్‌లాల్‌ మెంబర్‌ సెక్రటరీగా వ్యవహరిస్తారు.

సభ్యులుగా తిరుమల పెద జీయంగార్‌ మఠాధిపతి, రిటైర్డు ఐఏఎస్‌ అధికారి అజేయ కల్లాం, దేవదాయ శాఖ రిటైర్డు అడిషనల్‌ కమిషనర్‌ ఎ.బి.కృష్ణారెడ్డి, రిటైర్డు ప్రిన్సిపల్‌ స్పెషల్‌ జడ్జి  కె.సూర్యారావు, దాతలు సంగా నరసింహారావు, యు.కె.విశ్వనాథరాజు, ఆగమ పండితులు పీవీఎస్‌ఎస్‌ఆర్‌ జగన్నాథాచార్యులు, సీహెచ్‌ శ్రీరామ శర్మ, భీమవరానికి చెందిన దంతులూరి జగన్నాథరాజు చౌల్ట్రీ ఫౌండర్‌ ట్రస్టీ ఎం.రామకుమార్‌ రాజు, కడపకు చెందిన యదళ్ల పిచ్చియ్య చెట్టి చారిటీస్‌ అసోసియేషన్‌ ఫౌండర్‌ డా.జ్వాలా చైతన్య,  పాలకొల్లుకు చెందిన చాకా వారి చౌల్ట్రీ ఫౌండర్‌ చాకా ప్రభాకరరావు ప్రమాణస్వీకారం చేశారు.

టీటీడీ ఈవో ధర్మారెడ్డి, వైఎస్సార్‌ జిల్లా పుష్పగిరి మఠాధిపతి జూమ్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. హైకోర్టు రిటైర్డు జడ్జి మఠం వెంకట రమణ, చార్టెడ్‌ అకౌంటెంట్‌ శ్రీరామమూర్తితో పాటు ఇనుగంటి వెంకట రోహిత్, మాకా బాలాజీ, రాజన్‌ సుభాషిణి ప్రమాణ స్వీకారానికి హాజరు కాలేదు. 

మరింత విస్తృతంగా హిందూ ధార్మిక కార్యక్రమాలు 
హిందూ ధార్మిక కార్యక్రమాలను మరింత విస్తృతంగా అమలు చేయాలనే అత్యున్నత లక్ష్యంతో రాష్ట్ర సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ ధార్మిక పరిషత్తును ఏర్పాటు చేసినట్లు ఉప ముఖ్యమంత్రి, పరిషత్‌ చైర్మన్‌ కొట్టు సత్యనారాయణ చెప్పారు. ఎంతో నిష్టాతులైన వారితో ఏర్పాటు చేసిన ధార్మిక పరిషత్‌ సూచనలను, సలహాలను అన్నింటినీ చిత్తశుద్ధితో అమలు చేస్తామని తెలిపారు.

పరిషత్‌ సభ్యుల ప్రమాణస్వీకారం అనంతరం ఆయన సభ్యులనుద్దేశించి మాట్లాడారు. «హిందూ మత ధర్మంపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి దీని ఏర్పాటే నిదర్శనమన్నారు. భగవంతుని సహకారంతోనే  ఎన్నో పథకాలను, కార్యక్రమాలను అమలు చేయగలుగుతున్నామని సీఎం జగన్‌ ఎప్పుడూ చెపుతుంటారని, భగవంతునిపై ఆయనకు ఉన్న భక్తికి ఇది కూడా ఒక నిదర్శనమని అన్నారు.

ధార్మిక పరిషత్‌ ద్వారా రాష్ట్రంలో ఉన్న ఆలయాలన్నీ అభివృద్ధి పథంలో నడవాలని ఆకాంక్షించారు. హిందూ మత ప్రచారానికి పనిచేస్తున్న పీఠాలన్నీ సక్రమంగా సేవలందించాలని, ఎక్కడైనా అవకతవకలు జరిగినా ధార్మిక పరిషత్‌ ద్వారా వాటిని సరి చేసి ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉందని చెప్పారు.   

మరిన్ని వార్తలు