ఆదాయంలేని గుళ్లకు ‘ధూప దీప నైవేద్యం’.. కొత్తగా 2,200 ఆలయాలకు ఈ నెలలోనే మంజూరు

17 Aug, 2022 04:03 IST|Sakshi

సంతృప్త స్థాయిలో అర్హత ఉన్న అన్ని ఆలయాలకు అమలు 

ఆక్రమణలో ఉన్న దేవుడి భూముల స్వాధీనానికి ప్రత్యేక చర్యలు 

8 మంది అమీన్లను కేటాయించాలని హైకోర్టును కోరుతాం

ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ వెల్లడి

సాక్షి, అమరావతి: గ్రామీణ ప్రాంతాల్లో అతి తక్కువ ఆదాయం ఉండే ఆలయాల్లో సైతం స్వామివారికి నిత్యం నైవేద్య కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా.. ఈ నెలలో కొత్తగా 2,200 ఆలయాలకు ధూప దీప నైవేద్య పథకాన్ని (డీడీఎన్‌ఎస్‌) మంజూరు చేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి, దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ వెల్లడించారు. సచివాలయంలో మంగళవారం ఆయన తన శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం కమిషనర్‌ హరిజవహర్‌లాల్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ పథకం కింద ఎంపిక చేసిన ఆలయాలకు నిత్య నైవేద్య ఖర్చులకుగాను నెలనెలా రూ.5 వేల చొప్పున దేవదాయ శాఖ నుంచి ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు తెలిపారు.

నిబంధనల ప్రకారం అర్హత ఉన్న దేవాలయాలకు పరిమితి లేకుండా సంతృప్త స్థాయిలో డీడీఎన్‌ఎస్‌ను అమలుచేయాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారని.. అందుకనుగుణంగా అర్హత ఉంటే ప్రతి గ్రామంలోను కనీసం ఒక దేవాలయాన్ని అయినా ఈ పథకం కిందకు తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి సత్యనారాయణ తెలిపారు. ఈ పథకం ద్వారా ఇప్పటికే దాదాపు 1,500 ఆలయాలకు ఆర్థిక సహాయం అందజేస్తున్నామని, మరో 3,500 దాకా వినతులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు.

పెండింగ్‌లో ఉన్న వాటికి సంబంధించిన వినతులను జిల్లా దేవదాయ శాఖ అధికారులు పరిశీలిస్తున్నారని.. ఇప్పటివరకు 2,346 దరఖాస్తుల పరిశీలన పూర్తయిందన్నారు. వీటిలో 2,200 ఆలయాలకు ఈ పథకం మంజూరు చేసేందుకు అర్హత ఉందన్నారు. ఇక డీడీఎన్‌ఎస్‌ పథకం ద్వారా ఆలయాలకు ప్రతినెలా ఇచ్చే ఆర్థిక సహాయాన్ని పెంచే దానిపై సీఎంతో సంప్రదించి నిర్ణయం తీసుకుంటామని విలేకరుల ప్రశ్నకు మంత్రి కొట్టు సత్యనారాయణ బదులిచ్చారు. 

అమీన్‌లు కేటాయించాలని హైకోర్టును కోరుతాం
ఇక దేవదాయ శాఖ భూముల ఆక్రమణలకు సంబంధించి ఎండోమెంట్‌ ట్రిబ్యునల్‌లో ప్రస్తుతం 4,708 కేసులు ఎప్పటినుంచో అపరిష్కృతంగా ఉన్నాయని.. అందులో 722 కేసులు పరిష్కారమయ్యాయని ఆయన చెప్పారు. కొన్నిచోట్ల దేవదాయ శాఖ సిబ్బంది ఆక్రమణలో ఉన్న భూములను స్వాధీనం చేసుకున్నప్పటికీ, మరికొన్నిచోట్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్పారు. ఇలాంటి చోట్ల ఆక్రమణలో ఉన్న భూములను స్వాధీనం చేసుకునేందుకు వీలుగా ఎనిమిది మంది అమీన్‌లను ప్రత్యేకంగా దేవదాయ శాఖకు కేటాయించేందుకు హైకోర్టును కోరాలని నిర్ణయించామని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. ఇక ఎండోమెంట్‌ ట్రిబ్యునల్‌లో పెండింగ్‌లో ఉన్న కేసులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను రూపొందిస్తామన్నారు.  

మాన్యం భూముల హక్కుదారు స్వామివారే..
దేవుడి మాన్యాలపై అసలు హక్కుదారుడు దేవుడేనని.. అందులో ఫలసాయం తీసుకోవడం వరకు మాత్రమే వాటిని పొందిన వారికి హక్కు ఉంటుందని మంత్రి కొట్టు సత్యనారాయణ స్పష్టంచేశారు. దేవదాయ శాఖ పరిధిలోని ఆలయాలు, సత్రాల పేరిట 4.09 లక్షల ఎకరాలు భూములున్నట్లు గుర్తించామని, వాటిలో ఆక్రమణలో ఉన్న వాటి వివరాలను సేకరిస్తున్నట్లు ఆయన చెప్పారు. అలాగే, టీటీడీ తరహాలో రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో ఆన్‌లైన్‌ ద్వారా అన్నిరకాల సేవలను అందించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఇప్పటికే ప్రయోగాత్మకంగా శ్రీశైలంలో అమలుచేస్తున్నామన్నారు. ఇక 21 మంది సభ్యులతో పూర్తిస్థాయిలో ధార్మిక పరిషత్‌ను ప్రభుత్వం ఏర్పాటుచేసిందని.. అవినీతికి, అక్రమాలకు పాల్పడే మఠాధిపతులపై చర్యలు తీసుకునే అధికారం, వారి స్థానంలో మరొకరిని నియమించే అధికారం ఈ ధార్మిక పరిషత్‌కు ఉందన్నారు. ఆస్తులను 11 సంవత్సరాలకు పైబడి లీజును విస్తరించే అధికారం కూడా ఈ పరిషత్‌కే ఉందని మంత్రి చెప్పారు. 

ప్రభుత్వంపై ప్రజల సంతృప్తికి ఆ సర్వేనే సాక్ష్యం
దేవుడిపై విపరీతమైన నమ్మకంతో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఉంటారని, సంక్షేమ పథకాలు అమలుచేయడంలో ఆయనకు దేవుడి ఆశీస్సులు కూడా ఉన్నాయన్నారు. ప్రభుత్వ పనితీరుపై ప్రజలు ఎంత సంతృప్తిగా ఉన్నారన్న దానికి ఇటీవల ఓ ఆంగ్ల చానల్‌ నిర్వహించిన సర్వే ఫలితాలే సాక్ష్యమని కొట్టు సత్యనారాయణ చెప్పారు.
చదవండి: పరిశ్రమలకు ప్రోత్సాహంలో  ముందెన్నడూ చూపనంత చొరవ 

మరిన్ని వార్తలు