కోవిడ్‌ తగ్గాక మధుమేహం?

30 Dec, 2021 04:18 IST|Sakshi

కరోనా నుంచి కోలుకున్న వారిలో 5–10 శాతం మందికి.. 

స్టెరాయిడ్స్‌ ద్వారా చికిత్స పొందిన వారు అధికం 

ముందుగా పసిగట్టి, చికిత్స తీసుకోవాలంటున్న వైద్యులు 

సాక్షి, అమరావతి:  గుంటూరుకు చెందిన ఉమేశ్‌ ప్రైవేట్‌ కంపెనీలో పనిచేస్తారు. గత మేలో కరోనా బారినపడ్డారు. తీవ్రమైన ఇన్‌ఫెక్షన్‌కు లోనుకావడంతో చికిత్సలో భాగంగా వైద్యులు స్టెరాయిడ్స్‌ వాడారు. కరోనా నుంచి కోలుకున్నాక రెండు నెలల్లో 10 కిలోల బరువు పెరిగాడు. దీనికి తోడు చర్మంపై దద్దుర్లు, అతిగా మూత్రం రావడం వంటి ఇతర సమస్యలు ఎదురవుతుండటంతో డాక్టర్‌ను సంప్రదించాడు. వైద్య పరీక్షల అనంతరం ప్రీ డయాబెటిక్‌ దశలో ఉమేశ్‌ ఉన్నట్లు నిర్ధారించారు.  

..ఇలా ఉమేశ్‌ తరహాలో కరోనా నుంచి కోలుకున్న వారిలో 5–10 శాతం మందిలో మధుమేహం బయటపడుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. మధుమేహం బారినపడుతున్న వారిలో ఎక్కువగా స్టెరాయిడ్స్‌ సాయంతో చికిత్స పొందిన వారు ఉన్నట్లుగా తెలుస్తోంది. సాధారణంగా స్టెరాయిడ్స్‌ వాడితే శరీరంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. అయితే.. కొందరిలో 2–3 వారాలకు తగ్గుతోంది.

మరికొందరిలో మాత్రం మానేసిన 2–3 నెలలకు కూడా చక్కెర స్థాయిలు నియంత్రణలోకి రావడంలేదు. సాధారణ చికిత్స ద్వారా కోలుకున్నప్పటికీ.. కరోనాకు ముందు ఉన్న ఆధునిక జీవనశైలి, శారీరక శ్రమ లేకపోవడం, ఊబకాయం, ఇతర లక్షణాలున్న వారు, వైరస్‌ సోకిన సమయంలో తీవ్ర ఒత్తిడికిలోనై మధుమేహం బారినపడినట్లు వెల్లడవుతోంది. ఈ నేపథ్యంలో.. పోస్ట్‌ కోవిడ్‌లో ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు తప్పనిసరిగా మధుమేహం పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. లేనిపక్షంలో నిశ్శబ్దంగా నష్టాన్ని చేకూరుస్తుందని హెచ్చరిస్తున్నారు.  

మధుమేహానికి కారణాలివీ.. 
► క్లోమ గ్రంధిలోని బీటా కణాలు సక్రమంగా ఇన్సులిన్‌ను  స్రవించకపోవడంవల్ల మధుమేహం సమస్య తలెత్తుతుంది. కరోనా సోకిన వారిలో ఊపిరితిత్తుల్లో వైరస్‌ అతుక్కునేందుకు కారణమయ్యే ఏసీఈ–2 రిసెప్టార్లు.. క్లోమ గ్రంధిపై కూడా ఉండి, ఇన్సులిన్‌ ఉత్పత్తిని నియంత్రిస్తాయి. దీంతో ఇన్సులిన్‌ ఉత్పత్తి తగ్గిపోయి శరీరంలో 
చక్కెరస్థాయి పెరుగుతుంది.  
► దీన్ని శరీర కణజాలం త్వరగా గ్రహించుకోలేకపోవడంతో 6 నెలల పాటు రక్తంలో గ్లూకోజ్‌ ఎక్కువ ఉండేందుకు అవకాశముంది.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. 
► స్టెరాయిడ్స్‌ ద్వారా కరోనా చికిత్స తీసుకున్న వారు పోస్ట్‌ కోవిడ్‌లో తప్పనిసరిగా మధుమేహం పరీక్షలు చేయించుకోవాలి.  
► మధుమేహం ఉన్నట్లు నిర్ధారణ అయితే వైద్యులు సూచించిన మందులు వాడాలి. 
► రక్తంలో గ్లూకోజు స్థాయి పరగడుపున 125 ఎంజీ/డీఎల్, ఆహారం తీసుకున్నాక 200 ఎంజీ/డీఎల్‌ కన్నా ఎక్కువుంటే మధుమేహం వచ్చినట్లే.  
► పొగతాగడం, మద్యం సేవించడం పూర్తిగా మానేయాలి.  
► తక్కువ కేలరీలున్న ఆహార పదార్థాలు తీసుకుంటూ, బరువు తగ్గించుకోవాలి.  
► వాకింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్‌ వంటి వ్యాయామాలు విధిగా చేయాలి. 
► క్రమం తప్పని వ్యాయామంవల్ల శరీర కణజాలంలోని ఇన్సులిన్‌ గ్రాహకాల సెన్సిటివిటీ పెరుగుతుంది. 
► శరీరంలో కొవ్వు నియంత్రణకు తోడ్పడే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.   

రోగ నిరోధక శక్తి తగ్గుతుంది 
శరీరంలో చక్కెర స్థాయి అధికంగా ఉంటే రోగ నిరోధకశక్తి తగ్గుతుంది. కరోనా చికిత్స పొందిన కొందరిలో స్టెరాయిడ్స్, ఇతర మందుల ప్రభావంవల్ల మధుమేహం బయటపడుతోంది. యువత, పెద్ద వయస్కులు ఇలా అన్ని వర్గాల్లో ఈ సమస్య ఉంటోంది. కరోనా బారినపడ్డ వారిలో అప్పటికే మధుమేహం ఉన్నా, కొత్తగా మధుమేహం బయటపడినా వైద్యుల సూచనల మేరకు విధిగా ఇన్సులిన్‌ వాడాలి.   
– డాక్టర్‌ రాంబాబు, విమ్స్‌ డైరెక్టర్‌ 

ప్రారంభంలోనే గుర్తించాలి 
ప్రారంభ దశలోనే మధుమేహాన్ని గుర్తిస్తే మంచిది. లేదంటే లోలోపల చాలా నష్టం చేకూరుతుంది. అతిగా మూత్రం రావడం, ఊబకాయం, చర్మంపై దద్దుర్లు, గాయాలైతే నెమ్మదిగా మానడం వంటి లక్షణాలున్న వారు వైద్యులను సంప్రదించాలి. మధుమేహం నిర్ధారణ అయిన వారు ఆహార అలవాట్లు మార్చుకోవాలి. క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలి. వైద్యులి చ్చిన మందులు వాడాలి. 
– డాక్టర్‌ పి. పద్మలత, జనరల్‌ మెడిసిన్‌ ప్రొఫెసర్‌ గుంటూరు మెడికల్‌ కళాశాల  

మరిన్ని వార్తలు