డయేరియాకు చెక్‌

23 Nov, 2020 04:29 IST|Sakshi

టైఫాయిడ్‌కూ అడ్డుకట్ట 

2019లో 4.60 లక్షల డయేరియా కేసులు 

ఈ ఏడాది 1.58 లక్షల కేసులు 

గతేడాది 28 వేలకు పైగా టైఫాయిడ్‌ కేసులు 

ఈ ఏడాది 7,869 మాత్రమే 

రక్షిత తాగునీటితో అదుపు చేసిన ప్రభుత్వం 

సాక్షి, అమరావతి: గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది డయేరియా, టైఫాయిడ్‌ కేసులు భారీగా తగ్గాయి. వర్షాలు ఎక్కువగా కురిసినా కేసులకు అడ్డుకట్టపడింది. 2019తో పోలిస్తే.. డయేరియా కేసులు 50 శాతానికి పైగా తగ్గినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వాస్తవానికి 2019 కంటే ఈ ఏడాదే వర్షాలు ఎక్కువగా కురిశాయి. అయితే, సురక్షిత తాగునీరు అందించడం, పారిశుధ్య పనుల నిర్వహణలో ప్రభుత్వం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడంతో కేసులు తగ్గినట్టు నిపుణులు చెబుతున్నారు. టైఫాయిడ్‌ కేసులు సైతం భారీగా తగ్గడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.  

సర్కారు ఆదేశాలతో.. 
ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ ఏడాది వర్షాకాలంలో సాంక్రమిక వ్యాధుల విభాగం (ఎపిడెమిక్‌ సెల్‌) అప్రమత్తంగా వ్యవహరించింది. అన్ని స్థాయిల్లోని సిబ్బంది వర్షాకాలంలో 24/7 క్షేత్రస్థాయిలో తగిన చర్యలు చేపట్టారు. సాంక్రమిక వ్యాధుల నివారణ మందులతోపాటు పాముకాటు, కుక్క కాటు మందులనూ ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. వర్షాల బారిన పడిన ప్రాంతాల్లో పంచాయతీరాజ్, మున్సిపల్‌ శాఖలు ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టడంతోపాటు వైద్యారోగ్య శాఖతో కలిసి సురక్షిత తాగునీటిని ప్రజలకు అందేలా చూశారు.

ఈ చర్యలన్నీ సత్ఫలితాలివ్వడంతో డయేరియా, టైఫాయిడ్‌ కేసులు భారీగా తగ్గాయి. 2019లో 4,60,931 డయేరియా కేసులు నమోదు కాగా.. ఈ ఏడాది 1.58 లక్షల కేసులు మాత్రమే నమోదయ్యాయి. టైఫాయిడ్‌ కేసుల విషయానికి వస్తే 2019లో 28,551 నమోదు కాగా.. ఈ ఏడాది 7,869 మాత్రమే నమోదయ్యాయి. ఈ ఏడాది నెల్లూరు జిల్లాలో అతి తక్కువగా 117 టైఫాయిడ్‌ కేసులు రాగా.. అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 1,359 కేసులొచ్చాయి. ఈ ఏడాది చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 23,013 డయేరియా కేసులు నమోదు కాగా.. అత్యల్పంగా పశి్చమ గోదావరి జిల్లాలో 3,279 కేసులు మాత్రమే నమోదయ్యాయి. గతేడాది అత్యధికంగా 80,854 డయేరియా కేసులు తూర్పు గోదావరి జిల్లాలో నమోదు కాగా.. ఈ ఏడాది కేవలం 6,161 కేసులు మాత్రమే నమోదయ్యాయి.   

మరిన్ని వార్తలు