Neem Tree: వెయ్యి జబ్బులను నయం చేసే.. వేప చెట్టుకు ఆపదొచ్చింది..

23 Dec, 2021 09:14 IST|Sakshi
ఎండిపోతున్న వేప చెట్టు  

ఆకులతో మొదలై వృక్షాన్నే కబళిస్తున్న వింత తెగులు 

డై బ్యాక్‌ డిసీజ్‌ అంటున్న కొందరు అగ్రికల్చర్‌ అధికారులు 

ఫోమోప్సిన్‌ అజాడిరిక్టేట్‌ అంటున్న మరికొందరు వృక్ష శాస్త్రవేత్తలు

వేప చెట్టులో వెయ్యి జబ్బులను నయం చేసే గుణాలున్నాయంటారు. ఆయుర్వేదంలో ఇది లేని మందు లేదు. ఇక వేప నూనె, వేప కషాయాలను చీడపీడల నివారణకూ ఉపయోగిస్తారు. నాలుగైదు లేత వేపాకులు తింటే రక్తం శుద్ధి అవుతుందంటారు. చిన్నారులకు చెంచాడు వేప కషాయం తాపితే దగ్గు తదితర సమస్యలు బలాదూర్‌ అనాల్సిందే.  అపర సంజీవినిగా పరిగణించే ఈ వేప చెట్లకే ఇప్పుడు ఆపదొచ్చింది. ఉన్నట్టుండి ఆకులన్నీ   ఎండిపోతున్నాయి. ఒకటి కాదు రెండు కాదు ఇప్పటికే వేలకొలది చెట్లు మోడు బారుతుండటతంతో పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాటిని కాపాడేందుకు అటు అటవీ శాఖ అధికారులు కానీ ఇటు అగ్రికల్చర్‌ అధికారులు కానీ ముందుకు రావడం లేదు.  – కర్నూలు అగ్రికల్చర్‌/ఆత్మకూరు రూరల్‌ 

చిగురుటాకు వద్ద మొదలై.. 
వేప చెట్టు చిగురుటాకులు ఎండిపోతున్నాయి. క్రమంగా చెట్టుకు ఉన్న మిగతా ఆకులన్నింటికీ ఈ తెగులు వ్యాపిస్తోంది. చివరికి చెట్టు మొత్తానికి పాకి మోడుగా కళావిహీనంగా తయారవుతుంది. ఈ తెగులు కర్ణాటకలో మొదలై తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్టాలకూ విస్తరించినట్లు సమాచారం. ప్రస్తుతం రాయలసీమ జిల్లాల్లో తీవ్రంగా ఉంది. ఎక్కడ చూసినా వేప చెట్టు ఎండిపోయి కనిపిస్తుండటంతో భవిష్యత్‌లో వేప ఉత్పత్తులు కనుమరుగై పోయే ప్రమాదముందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

చదవండి: (విటమిన్‌ ‘డి’ లోపిస్తే చాలా డేంజర్.. ఈ లక్షణాలుంటే జాగ్రత్త!)
 
తెగులుపై భిన్నాభిప్రాయం..  

వేపచెట్లు ఎండిపోతుండటంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. డై బ్యాక్‌ డిసీజ్‌ వల్లే వేప చెట్ల చిగుర్లు ఎండిపోయి చనిపోతున్నాయని కొందరు వృక్ష శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కాదుకాదు ఫోమోప్సిన్‌ అజాడిరిక్టేట్‌ అనే ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌ వల్లే చెట్లు ఎండిపోతున్నాయని మరికొందరు చెబుతున్నారు. గాలిలో తేమ అధికంగా ఉన్నప్పుడు ఈ ఇన్‌ఫెక్షన్‌ విజృంభిస్తుందంటున్నారు. గోరింటాకు రసాన్ని వేప చెట్లపై పిచికారీ చేయడం ద్వారా దీన్ని నివారించ వచ్చని చెబుతున్నారు. ఈ ఫంగస్‌ వ్యాప్తి చెందిన చెట్లపై ఎండిపోయిన ఆకులు, కొమ్మల్లో టీ మస్కిటో బగ్‌ అనే క్రిమి స్థిర నివాసం ఏర్పరుచుకుని వేప చెట్టు నిర్జీవమయ్యేలా చేస్తోందని  వృక్ష శాస్త్ర వేత్తలు అభిప్రాయపడుతున్నారు. తక్కువ వయస్సు ఉన్న వేప చెట్లు ఈ తెగులు నుంచి త్వరగా కోలుకుంటుండగా కాస్త వయసైన చెట్లు ఎండిపోతున్నాయంటున్నారు. కానీ అధికారికంగా ఎవరూ ఫలానా తెగులు వల్లే చెట్లు ఎండిపోతున్నాయని కానీ, వాటి రక్షణ చర్యలు తీసుకుంటున్నామని కానీ ప్రకటించకపోతుండటంతో  వేప చెట్టు మనుగడ ప్రశ్నార్థకమవుతోంది.   

మరిన్ని వార్తలు