నిర్మాణ రంగంపై డీజిల్, బొగ్గు దెబ్బ

25 Oct, 2021 03:07 IST|Sakshi

సాక్షి, అమరామతి: పెద్ద నోట్ల రద్దు, ఆర్థిక సంక్షోభం, కోవిడ్‌ వంటి వరుస దెబ్బలను తట్టుకుని ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న నిర్మాణ రంగాన్ని డీజిల్‌ ధరలు, బొగ్గు కొరత మరోసారి తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. ఏడాదిన్నరలో లీటర్‌ డీజిల్‌ ధర ఏకంగా రూ.28 పెరగడంతో రవాణా వ్యయం భారీగా పెరిగింది. ఏడాదిన్నర కిందట లీటర్‌ డీజిల్‌ ధర రూ.78గా ఉండగా ఇప్పుడు అది రూ.106 దాటింది. అదే సమయంలో ప్రపంచ వ్యాప్తంగా బొగ్గు కొరత రావడంతో డిమాండ్‌ లేకున్నా ఉత్పత్తి తగ్గడం వల్ల స్టీల్, సిమెంట్, అల్యూమినియం, కాపర్, ప్లాస్టిక్‌ వంటి అన్ని రకాల ఉత్పత్తుల ధరలు 40 నుంచి 50 శాతం వరకూ పెరిగాయని బిల్డర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బొగ్గు కొరత ప్రభావం అధికంగా స్టీల్‌ రంగంపై పడింది.

కొరత లేకముందు టన్ను స్టీల్‌ ధర రూ.40–45 వేల మధ్య ఉంటే.. ఇప్పుడది ఏకంగా రూ.65,000 మార్కును అధిగమించింది. సిమెంట్‌ బస్తా రూ.260 నుంచి రూ.370కి చేరింది. డీజిల్‌ ధరలు పెరగడంతో ఇసుక, కంకర, ఇటుక వంటి వస్తువుల రవాణా వ్యయం ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయిందని ఏపీ క్రెడాయ్‌ ప్రెసిడెంట్‌ రాజాశ్రీనివాస్‌ చెప్పారు. ముడి సరుకుల వ్యయం భారీగా పెరగడంతో చదరపు అడుగు నిర్మాణ వ్యయం 20 శాతం వరకూ పెరుగుతోందన్నారు. దీంతో నూతన ప్రాజెక్టులు చేపట్టేందుకు బిల్డర్లు వెనుకాడుతున్నారు. ఇప్పటికే మొదలు పెట్టినవారు పని వేగాన్ని తగ్గించినట్టు క్రెడాయ్‌ వర్గాలు చెబుతున్నాయి.  

ఉన్నవాటిని వదిలించుకుందాం..
నిర్మాణ వ్యయం పెరిగినా ధరలు పెంచలేని పరిస్థితుల్లో రియల్‌ ఎస్టేట్‌ రంగం ఉందని ఏపీ క్రెడాయ్‌ ప్రెసిడెంట్‌ రాజా శ్రీనివాస్‌ చెప్పారు. వడ్డీరేట్లు తక్కువగా ఉండటంతో ఇప్పుడిప్పుడే అమ్మకాలు పుంజుకుంటున్నాయన్న తరుణంలో నిర్మాణ వ్యయం ఒక్కసారిగా పెరిగిపోయిందని, దీంతో నూతన ప్రాజెక్టుల కంటే.. ఇప్పటికే నిర్మించిన వాటిని అమ్ముకోవడం పైనే ప్రధానంగా దృష్టి సారిస్తున్నట్టు తెలిపారు. కొత్త వెంచర్లు వేసేందుకు కూడా బిల్డర్లు వెనుకాడుతున్నారని వైజాగ్‌ క్రెడాయ్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌ తెలిపారు. క్రెడాయ్‌ అంచనాల ప్రకారం ప్రస్తుతం రాష్ట్రంలో 1.4 లక్షల ఫ్లాట్స్‌ నిర్మాణంలో ఉండగా, వాటిలో 56,000 ఫ్లాట్స్‌ గృహ ప్రవేశాలకు సిద్ధంగా ఉన్నాయి. లక్షలాది మందికి ఉపాధి కల్పించే నిర్మాణ రంగాన్ని వరుస సంక్షోభాలు వెంటాడుతున్నాయని క్రెడాయ్‌ ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు