Jail Restaurant: ఖైదీ బిర్యానీ.. ఇది లేటేస్ట్‌ గురూ..

13 Feb, 2022 15:51 IST|Sakshi
ఖైదీ బిర్యానీ రెస్టారెంట్- ఖైదీ డ్రెస్సులలో ‘ఖైదీ బిర్యానీ’ సర్వర్లు

కాకినాడ/రాజమహేంద్రవరం సిటీ: లోకో భిన్న రుచి అంటారు. ఒక్కొక్కరికీ ఒక్కో అభిరుచి ఉంటుంది. ఏ విషయంలోనైనా కావచ్చు. ముఖ్యంగా ఆహారం విషయంలో ఇదెక్కువగా అందరిలో కనిపిస్తోంది. కొందరికి ఒక్క టిఫిన్‌ సెంటరే నచ్చుతుంది. మరొకరు తనకు నచ్చిన హోటల్‌లో తప్ప మరోచోట భోజనం చేయరు. ఏమైనప్పటికీ ఆహారాభిరుచికి ఇంచుమించు అందరూ అగ్రాసనం వేస్తారు. అందుకే వీరిని ఆకట్టుకోవడానికి కొన్ని సంస్థలూ ఇలానే వ్యవహరిస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఫుడ్‌ సెంటర్లు, హోటళ్ల విషయంలో ఈ పరిణామం స్పష్టంగా కనిపిస్తోంది.

చదవండి: రూ.10 వేలతో ప్రారంభించి.. రూ.10 కోట్లకు

కాకినాడలో ఆహార ప్రియులను ఆకర్షించేందుకు  ‘జైలు థీమ్‌’తో ఓ రెస్టారెంట్‌ ఏర్పాటైంది. భోజనం చేసే గది జైలులోని ఖైదీ సెల్‌లా ఉంటుంది. ఇక్కడ సర్వర్లు ఖైదీ డ్రెస్‌లు వేసుకుని మరీ వడ్డిస్తున్నారు. అంతేకాదు.. బిల్లును ‘బెయిల్‌’గా వ్యవహరిస్తున్నారిక్కడ. భానుగుడి సెంటర్‌లో కొత్త కాన్సెప్టుతో వచ్చిన ‘ఖైదీ బిర్యానీ’ రెస్టారెంట్‌ విశేషంగా ఆకట్టుకుంటోంది. లోపల పూర్తిగా జైలు వాతావరణాన్ని తలపించేలా దీనిని తీర్చిదిద్దారు. అడుగు పెట్టగానే చుట్టూ జైలు ఊసలతో కూడిన 16 క్యాబిన్లు దర్శనమిస్తాయి. 20 మందికి సరిపడా ఓ వీఐపీ సెల్‌ కూడా ఉంటుంది. జిల్లాలో చైనీస్, కాంటినెంటల్, చెట్టినాడు స్పెషల్‌ ఇలా వివిధ ప్రాంతాల ఫుడ్‌ కూడా వడ్డిస్తున్నారు. రావులపాలెం మార్గంలో కూడా రకరకాల ఐటెమ్స్‌తో ఫుడ్‌ బాగుంటుందని అటుగా దూర ప్రయాణాలు చేసేవారు లొట్టలేసు కుంటూ తింటూంటారు.

ఖైదీ బిర్యానీ రెస్టారెంట్‌  

పేరు వింటే ఫిదా 
ఫుడ్‌ మాట అటుంచితే కొన్ని రెస్టారెంట్లకు పెడుతున్న పేర్లు ఆసక్తి కలిగిస్తున్నాయి. ఈ పేర్లే భోజన ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా కుర్రకారు అడుగులు ఇటువైపే పడుతున్నాయి. మచ్చుకు రాజమహేంద్రవరంలో కొన్ని పేర్లు ఇవి.. ‘కడుపు నింపుతాం, పొట్ట పెంచుదాం, నా పొట్ట నా ఇష్టం, పాతాళ భైరవి, మాయాబజార్, మిఠాయి పొట్లం, చిక్‌పెట్‌ దొన్నె బిర్యానీ హౌస్, పల్లెవంట,గోదావరి రుచులు ఇలా పలు రకాల పేర్లతో ఆహారప్రియుల మనసులు గెలుచుకొనేందుకు ప్రయత్నం చేస్తున్నారు. తినే ఆహారం ఒకటే అయినప్పటికీ వైవిధ్యభరితమైన పేర్లతో కస్టమర్ల మనసులో స్థానానికి ప్రయత్నిస్తున్నారు.

రుచులకు బందీ కావల్సిందే..
ఆహార ప్రియులను మా హోటల్‌లో రుచులతో బందీ చేయాలన్నదే ‘జైల్‌ థీం’ ప్రధాన ఉద్దేశం. కాకినాడలో కొత్తదనంతో హోటల్‌ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ‘ఖైదీ బిర్యానీ’గా పేరు పెట్టాం. మేమిచ్చే ఆతిథ్యం, నాణ్యమైన ఆహారం, సరసమైన ధర చూసి ఆహార ప్రియులు మా ‘ఖైదీ బిర్యానీ’కి మళ్లీ మళ్లీ వచ్చేలా ఆకర్షించడమే ధ్యేయం. ప్రజలను బాగా ఆకట్టుకోగలమన్న నమ్మకం ఉంది.
– నల్లపాటి సాయివేణు, ఖైదీ బిర్యానీ రెస్టారెంట్‌ యజమాని 

మరిన్ని వార్తలు