Poduru: ఇక్కడి మండువా లోగిళ్లలోనే ఆ సినిమా షూటింగులు! 

10 May, 2021 09:39 IST|Sakshi

అవి ఉమ్మడి కుటుంబాల ఆవాసాలు 

100 ఏళ్లు పైబడినా చెక్కుచెదరని గృహాలు 

ఆ ఇళ్లలోనే గతంలో పలు సినిమాల షూటింగ్‌లు  

ఒకప్పుడు కుటుంబ గౌరవానికి ప్రతీక మండువా లోగిలి. ఉమ్మడి కుటుంబాలకు నిలువెత్తు నిదర్శనాలు ఆ ఇళ్లు. ఆ ఇంటి యజమానికి సంఘంలో పెద్దరికం (గౌరవం) ఉండేది. ఆ తరువాత ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నం కావడంతో మండువాలోగిళ్ల అవసరం లేకపోయింది. డెల్టా ప్రాంతంలో ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో మండువాలోగిళ్లు మనకు దర్శనమిస్తాయి. గాలి, వెలుతురు ప్రసరించేలా ఉండే వాటి నిర్మాణాలు, విశాలమైన గదులు ఎంతో అబ్బురపరుస్తాయి. 

పోడూరు (పశ్చిమగోదావరి జిల్లా): దాదాపు 40 ఏళ్ల క్రితం వరకు గ్రామాల్లో మండువాలోగిళ్లు ఎక్కువగా ఉండేవి. పచ్చని పంటచేలు, కాలువలతో కళకళలాడే పల్లెలకు ఈ మండువాలోగిళ్లు ప్రత్యేక ఆకర్షణగా ఉండేవి. ఆ తరువాత పట్టణాలకు దీటుగా గ్రామాల్లో కూడా కాంక్రీటు భవనాల నిర్మాణం పెరిగింది. దీంతో పల్లెల్లో మండువాలోగిళ్లు కనుమరుగవుతున్నాయి. పోడూరు గ్రామంలో ఇప్పటికీ పలు మండువాలోగిళ్లు చెక్కుచెదరకుండా ఉన్నాయి. దాదాపు 50 పైగా  కుటుంబాలు ఇప్పటికీ వాటిలోనే నివాసం ఉంటున్నారు. ఈ మండువాలోగిళ్ల వల్లే ఒకప్పుడు పోడూరు గ్రామం సినిమా షూటింగ్‌లకు ప్రసిద్ధి గాంచింది. అందంగా హుందాతనంగా, సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే మండువాలోగిళ్లలో షూటింగ్‌లు తీసేందుకు దర్శకులు ఎంతో ప్రాధాన్యత ఇచ్చేవారు.

చిల్లర కొట్టు చిట్టెమ్మ, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, కాంచనమాల కేబుల్‌ టీవీ, చిలకపచ్చ కాపురం సినిమాల షూటింగ్‌ పోడూరు గ్రామంలోని మండువా లోగిళ్లలో చిత్రీకరించారు. పోడూరులో ఇప్పటికీ వంద, 120 ఏళ్ల నాటి మండువా లోగిళ్లను చూడవచ్చు. కాలక్రమేణా ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోవడం, ఉద్యోగరీత్యా, వ్యాపారరీత్యా కుటుంబాలు విదేశాలకు, నగరాలకు తరలిపోవడం కారణంగా మండువాలోగిళ్లు కనుమరుగవుతున్నాయి. 

ఉమ్మడి కుటుంబాలకు నెలవు 
పూర్వం రోజుల్లో దాదాపుగా అన్నీ ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. వారంతా మండువాలోగిళ్లలో ఉండేవారు. ఇంట్లో పనులు కూడా అందరూ కలసికట్టుగా చేసుకునేవారు. అందరూ కలసి భోజనాలు చేసేవారు. కుటుంబ పెద్దలు, కొడుకులు, కోడళ్లు, మనుమలు, మనవరాళ్ల సందడితో ప్రతీరోజూ పండుగ వాతావరణం ఉండేది. కష్టం వచ్చినా, సమస్య వచ్చినా అందరూ కలసి సమాలోచనలు చేసి నిర్ణయాలు తీసుకునేవారు.  

నిర్మాణం ఇలా 
మండువాలోగిళ్లను గట్టి పునాదులపై నిర్మించేవారు. దాదాపు 4 అడుగుల వెడల్పు, 5 అడుగుల వరకు లోతులో పునాదులు నిర్మించేవారు. పునాదుల గోతులను నీళ్లు పోసి పశువులతో తొక్కించేవారు. తరువాత ఇసుక వేసి బేస్‌మెంట్‌ లెవెల్‌ వరకు వరద తాకిడిని తట్టుకునేలా రాతితో లేదా కాల్చిన ఇటుక (పండు ఇటుక)తో కట్టేవారు. ఆపై పచ్చి ఇటుక లేదా పండు ఇటుకతో నిర్మించేవారు. అప్పట్లో మండువాలోగిళ్లు, ఇతర ఇంటి నిర్మాణాలకు గానుగ సున్నం వాడేవారు. ఇసుక, సున్నం, బెల్లం, కోడిగుడ్లు కలిపి గానుగ తిప్పి గానుగ సున్నం తయారు చేసేవారు.

దీని తయారీకి ప్రత్యేకంగా నిపుణులు ఉండేవారు. నాలుగువైపులా గదుల నిర్మాణం, మధ్యలో గాలి, వెలుతురు వచ్చేలా పైకప్పు ఖాళీ ఉండడం మండువాలోగిళ్ల ప్రత్యేకత. పైనుంచి కురిసిన వర్షం నీరు బయటకు వెళ్లేలా ప్రత్యేకంగా అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ ఏర్పాటు ఉంటుంది. పైకప్పు పెంకులతో ఉంటుంది. గుమ్మాలు, కిటికీలకు బర్మా టేకు, రంగూన్‌ టేకు ఎక్కువగా వాడేవారు. అందమైన నగిషీ చెక్కుడుతో తయారు చేసిన గుమ్మాలు, తలుపులు వాడేవారు. ఇంటి నిర్మాణానికి దాదాపుగా 8 నెలల నుంచి ఏడాదిన్నర కాలం పట్టేది.  

ఇల్లును పదిలంగా చూసుకుంటున్నాం 
మా తాతలు పూర్వం ఎంతో వ్యయ ప్రయాసలతో కట్టి ఇచ్చిన ఇల్లు కావడంతో ఎంతో పదిలంగా చూసుకుంటున్నాం. కోతుల సంచారంతో అప్పుడప్పుడు పైకప్పు దెబ్బతింటుంది. పెంకు నేసే వాళ్లు ఇప్పుడు అంతగా దొరకడం లేదు. ఇళ్లు కూడా పెద్దవి కావడంతో మెయింటెనెన్స్‌ ఖర్చు కూడా ఎక్కువగా ఉంటుంది. 130 ఏళ్ల కిందట నిర్మించిన ఇంట్లో మేము నివసిస్తున్నాం. 
- ఆర్‌వీఎస్‌ సూర్యనారాయణరాజు, పోడూరు 

వేసవిలో చల్లగా ఉంటుంది 
మండువాలోగిళ్లలో వేసవిలో చాలా చల్లగా ఉంటుంది. పెంకుల పైకప్పుతో పాటు గాలి, వెలుతురు బాగా ఉండడం వల్ల వేసవిలో ఉక్కబోత ఉండదు.  కాంక్రీటు బిల్డింగ్‌ల కంటే మండువాలోగిళ్లలో నివాసం ఎంతో ఆరోగ్యకరంగా, ఆహ్లాదంగా ఉంటుంది.
- రుద్రరాజు సుజాత, పోడూరు 

చదవండి: ఐదు రోజుల పెళ్లి, అక్కడ వరుడు తాళి కట్టడు!

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు