ఆర్బీకేలకు డిజిటల్‌ దన్ను

17 Mar, 2022 05:40 IST|Sakshi

ప్రతి రైతు భరోసా కేంద్రానికి కంప్యూటర్, ప్రింటర్, యూపీఎస్‌ 

తొలి దశలో 7,859 ఆర్బీకేల్లో ఏర్పాటు 

ఇక నుంచి రైతు సేవలన్నీ కంప్యూటరీకరణ

సాక్షి, అమరావతి: వ్యవసాయ భూమిని ఏ మేరకు చదును చేయాలో లేజర్‌ గైడెడ్‌ ల్యాండ్‌ లెవలర్స్‌లో సెట్‌ చేస్తే ఆ మేరకు చదును చేసేస్తుంది. పంపుసెట్లు నిర్ణీత సమయానికి పని చేసేలా.. నిర్దేశిత సమయానికి ఆగిపోయేలా సెట్‌ చేసుకోవడం ద్వారా సమయాన్ని, విద్యుత్‌ను ఆదా చేయడమే కాకుండా పొలానికి సరిపడా నీరందించవచ్చు. పురుగు మందులు, నానో యూరియా పిచికారీలో డ్రోన్స్‌ వినియోగించడం ద్వారా పొలంలో ప్రతి మొక్కకూ తగిన మోతాదులో అవి చేరతాయి. కావాల్సిన పోషకాలు భూమిలోని వేర్లకు కూడా అందుతాయి.

ఫ్లోరీ కల్చర్, మరికొన్ని రకాల పంటలకు తేమ శాతాన్ని కూడా కంట్రోల్‌ చేయొచ్చు. హార్వెస్టర్స్‌కు జీపీఎస్‌ బిగించడం ద్వారా ఎవరి పొలంలో అది ఎన్ని గంటలు పనిచేసిందో తెలుసుకోవచ్చు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా పంట ఉత్పాదకతను, నాణ్యతను పెంచుకోవడమే కాకుండా ఖర్చును తగ్గించుకోవచ్చు. కూలీల కొరతను సైతం అధిగమించవచ్చు. ఇలా సాంకేతికతను జోడిస్తూ వ్యవసాయాన్ని డిజిటల్‌ బాట పట్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. రైతు భరోసా కేంద్రాల వేదికగా డిజిటల్‌ వ్యవసాయ విధానాలను రైతులకు అందుబాటులోకి తెస్తోంది.  

ఆర్‌బీకేల కంప్యూటరీకరణతో డిజిటల్‌ వైపు.. 
ఆర్బీకేలను కంప్యూటరీకరించడం ద్వారా వాటిని సాంకేతికంగా బలోపేతం చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. రాష్ట్రంలో 10,778 ఆర్బీకేల ద్వారా గ్రామ స్థాయిలో రైతులకు సేవలందిస్తున్నారు. వీటిలో డిజిటల్‌ కియోస్క్‌లు, స్మార్ట్‌ టీవీలు, డిజిటల్‌ లైబ్రరీలతో పాటు పెద్దఎత్తున మౌలిక సదుపాయాలు కల్పించారు. ప్రతీ ఆర్బీకేకు హై స్పీడ్‌ ఇంటర్నెట్‌ సౌకర్యం కూడా ఏర్పాటు చేశారు. ఆర్బీకే సేవలను  మరింత వేగంగా అందించడంతోపాటు డిజిటలైజ్డ్‌ వ్యవసాయ విధానాలను ప్రోత్సహించాలన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంకల్పం మేరకు ఆర్బీకేలను కంప్యూటరీకరించాలని నిర్ణయించింది.

ఇందుకోసం తొలిదశలో 7,859 ఆర్బీకేల్లో కంప్యూటర్లు, ప్రింటర్లు, యూపీఎస్‌లను ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం టెక్నికల్‌ కమిటీ ఖరారు చేసిన స్పెసిఫికేషన్‌ల ఆధారంగా ఏపీ ఈ–ప్రొక్యూర్‌మెంట్‌ పోర్టల్‌ ద్వారా గ్లోబల్‌ టెండర్‌ పిలిచారు. వీటికి రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించగా.. రూ.18.20 కోట్ల ఆదా అయ్యింది. టెండర్‌దారుకు ఇటీవలే కొనుగోలు ఆర్డర్స్‌ కూడా జారీ చేశారు. వీటిని ఈ ఏడాది మే లేదా జూన్‌ నాటికి నేరుగా ఆర్బీకేలకు నేరుగా డెలివరీ చేయాలని ఆదేశించారు. అంతకుముందే ఏపీ టెక్నాలజీస్‌ (ఏపీటీ) ద్వారా వాటి నాణ్యతను పరీక్షించాలని నిర్ణయించారు. దశలవారీగా అన్ని ఆర్బీకేలను కంప్యూటరీకరించిన తర్వాత ఆన్‌లైన్‌తో అనుసంధానిస్తారు.

సేవల్లో నాణ్యతను పెంచడమే లక్ష్యం 
డిజిటల్‌ వ్యవసాయం వైపు రైతులను ప్రోత్సహించడం, ఆర్బీకే సేవల్లో నాణ్యతను పెంచడం లక్ష్యంగా కంప్యూటరీకరిస్తున్నాం. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ప్రతి ఆర్బీకేలో కంప్యూటర్లు, ప్రింటర్లు, యూపీఎస్‌లను అందుబాటులోకి తీసుకొస్తున్నాం. రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా రూ.18.20 కోట్లు ఆదా చేశాం. 
– హెచ్‌.అరుణ్‌కుమార్, కమిషనర్, వ్యవసాయ శాఖ   

మరిన్ని వార్తలు