గుడిలో నగలకు 'డిజిటల్‌' బందోబస్త్‌

23 Dec, 2021 04:02 IST|Sakshi

ఆభరణాలన్నిటి ఫొటోలు, పేరు, బరువు వివరాలతో డిజిటలీకరణ

ప్రతి గుడిలో జనవరి 15 కల్లా ఆల్బమ్‌ల రూపకల్పన

క్రమం తప్పకుండా నగల తనిఖీలు.. 

ఈవోలకు ఆదేశాలిచ్చిన దేవదాయ శాఖ 

సాక్షి, అమరావతి: అన్ని ఆలయాల్లోని ఆభరణాల విషయంలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా పూర్తి పారదర్శకత, మరింత భద్రత కల్పించేందుకు దేవదాయ శాఖ కసరత్తు ప్రారంభించింది. స్వామివారు, అమ్మవారి అలంకరణ కోసం ఉండే బంగారు, వెండి ఆభరణాలతోపాటు అన్ని రకాల నగల వివరాలతో జనవరి 15కల్లా ప్రతి గుడిలో డిజిటల్‌ ఆల్బమ్‌లు రూపొందించుకోవాలని ఈవోలకు ఆదేశాలు జారీ చేసింది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో పటిష్టంగా అమలు చేస్తున్న పలు అంశాలను రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో అమలుకు దేవదాయశాఖ వివిధ స్థాయి అధికారులతో ఇటీవల పునశ్చరణ కార్యక్రమం నిర్వహించింది. ఆ సమావేశంలో చర్చించిన అంశాల ఆధారంగా దేవదాయ శాఖ కమిషనర్‌ హరిజవహర్‌లాల్‌ ఇటీవల ఈవోలకు ఆదేశాలు జారీ చేశారు. అవేమిటంటే.. 

ప్రతి ఆలయంలో ఐదు రకాల రిజిస్టర్లు.. 
► ప్రతి ఆభరణాన్ని డిజిటల్‌ చేయడానికి అన్ని కోణాల నుంచి ఫొటోలు తీయాలి. 
► బంగారం, వెండికి సంబంధించిన ప్రతి ఆభరణం పేరు, దేవదాయశాఖ ఆ ఆభరణానికి కేటాయించిన నంబరు, దాని బరువు తదితర వివరాలన్నీ ఆ ఫొటోలలో కనిపించాలి. 
► ఆలయాల్లో అలంకరణలకు ఉపయోగించని బంగారాన్ని గోల్డ్‌ బాండ్‌ పథకంలో బాండ్‌గా మార్పిడి చేసుకోవాలి. 
► అభరణాలన్నింటికీ క్రమం తప్పకుండా బీమా చేయించాలి. 
► కనీసం మూడేళ్లకొకసారైనా దేవదాయ శాఖలోని జ్యుయలరీ వెరిఫికేషన్‌ అధికారి (జేవీవో)లు ఆలయాల వారీగా ఆభరణాలకు తనిఖీలు నిర్వహించాలి. 
► ఆభరణాలకు సంబంధించి ప్రతి ఆలయంలోనూ ఐదు రకాల రిజిస్టర్లను నిర్వహించాలి. అభరణాల అంచనా రిజిస్టర్, ఆభరణాల వారీగా నంబరు, వాటి బరువుకు సంబంధించి ఇన్వెంటరీ రిజిస్టర్, అర్చక కస్టడీ రిజిస్టర్, ఈవో కస్టడి రిజిస్టర్, బ్యాంకు లాకర్‌కు సంబంధించిన రిజిస్టర్‌లో ఎప్పటికప్పుడు వివరాలను నమోదు చేయాలి. 
► ఆభరణాలు, వాటి భద్రత విషయంలోనూ ఈవోలు పూర్తి పారదర్శకంగా వ్యవహరించాలి. 

ఘాట్‌ రోడ్లపై మూడు చక్రాల వాహనాలకు బ్రేక్‌.. 
► అన్ని ఆలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుతో పాటు, 24 గంటల పాటు వాటిని పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా ఒకరికి బాధ్యత అప్పగించాలి. 
► ఆలయ భద్రతకు కేటాయించిన సిబ్బందితో పాటు ఈవోలు శాశ్వత ప్రాతిపదికన వాకీటాకీలను ఏర్పాటు చేసుకోవాలి.  
► కొండ మీద ఆలయాలు ఉన్న చోట ఘాట్‌ రోడ్డుపై ఆటోలు వంటి మూడు చక్రాల వాహనాలను ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించకూడదు. 
► భక్తులు మంచి నీటి కోసం ప్లాస్టిక్‌ బాటిళ్లు ఉపయోగించాల్సిన అవసరం లేకుండా ఆలయాల్లో పూర్తి స్థాయిలో శుద్ధిచేసిన నీటి సరఫరా పాయింట్లను ఏర్పాటు చేసుకోవాలి.  

మరిన్ని వార్తలు