పూర్తి స్థాయిలో వెంటిలేటర్లను వినియోగించండి

21 Apr, 2021 03:30 IST|Sakshi

అవసరం మేరకు పడకలు పెంచండి

హోం ఐసొలేషన్‌లో ఉన్నవారిపై నిరంతర పర్యవేక్షణ

కోవిడ్‌ కేర్‌ సెంటర్లను త్వరితగతిన పునరుద్ధరించండి

కలెక్టర్లకు కోవిడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ చైర్మన్‌ డా.జవహర్‌రెడ్డి ఆదేశాలు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రస్తుతం నాలుగు వేల వెంటిలేటర్లు ఉన్నాయని, వీటిని కరోనా బాధితుల అవసరం మేరకు పూర్తి స్థాయిలో వినియోగించాలని కోవిడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ చైర్మన్‌ డా.కె.ఎస్‌.జవహర్‌రెడ్డి ఆదేశించారు. మంగళవారం రాత్రి ఆయన జిల్లా కలెక్టర్లతో జూమ్‌ ద్వారా సమావేశం నిర్వహించారు. పడకలను పెంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కోవిడ్‌ కేర్‌ సెంటర్లను త్వరితగతిన పునరుద్ధరించి, వాటికి నోడల్‌ అధికారులను నియమించాలని సూచించారు. ఆస్పత్రుల్లో ఏవైనా అవసరాలుంటే వెంటనే మౌలిక వసతులను కల్పించాలని ఆదేశించారు.

హోం ఐసొలేషన్‌లో ఉన్నవారిని ఆశా వర్కర్లు, హెల్త్‌ వర్కర్లతో నిత్యం పర్యవేక్షించాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంకా 70 వేల మంది ప్రైమరీ కాంటాక్ట్‌ ఉన్నవారిని పరీక్షించాల్సి ఉందన్నారు. 104 కాల్‌ సెంటర్‌ను 24 గంటలూ పర్యవేక్షించాలని చెప్పారు. ఆక్సిజన్‌ సరఫరాను జాగ్రత్తగా చూడాలని సూచించారు. కోవిడ్‌ నియంత్రణకు నియమించిన ప్రత్యేక అధికారులు నిరంతరం అందుబాటులో ఉండాలన్నారు. సమావేశంలో ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శులు అనిల్‌కుమార్‌ సింఘాల్, ముద్దాడ రవిచంద్ర, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్‌ పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు