Dhulipalla Narendra Kumar: ధూళిపాళ్లపై ఈడీ కన్ను

29 May, 2021 03:14 IST|Sakshi

సంగం డెయిరీ అక్రమాలపై ఆరా

మనీలాండరింగ్‌కు పాల్పడినట్టు పక్కా ఆధారాలు

డెయిరీ ఆస్తులు సొంత ట్రస్ట్‌కు బదిలీ చేసిన నరేంద్ర

నిబంధనలకు పాతర

ఫోర్జరీ పత్రాలతో అనేక అక్రమాలు

సాక్షి, అమరావతి: గుంటూరు జిల్లాలోని సంగం డెయిరీ కుంభకోణం కేసులో టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. తాజాగా ఆయన అక్రమాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దృష్టి సారించడం ప్రాధాన్యం సంతరించుకుంది. నిర్భీతిగా నిబంధనలను ఉల్లంఘిస్తూ డెయిరీ ఆస్తులను ధూళిపాళ్ల తమ కుటుంబ ట్రస్టుకు బదిలీ చేసి భారీ అక్రమాలకు పాల్పడినట్టు ఈడీ పక్కాఆధారాలు సేకరించినట్టు తెలుస్తోంది. ఈ కేసు దర్యాప్తును ముమ్మరం చేసి అక్రమార్కులపై కఠిన చర్యలకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. మరోవైపు సొంత పార్టీలోనే ధూళిపాళ్లకు పరిస్థితులు ఎదురుతిరుగుతున్నాయి. దశాబ్దాలుగా కష్టపడ్డవారిని విస్మరించిన ఆయన తన స్వార్థం చూసుకున్నారని గుంటూరు జిల్లా టీడీపీ నేతలు ఆయనపై మండిపడుతున్నారు. ఆయనకు ఏ విధంగానూ సహకరించకూడదని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర స్థాయి నేతలు కూడా ఆయనకు అండగా నిలబడకుండా తూతూమంత్ర పరామర్శలతో సరిపెడుతున్నారు.

ఇప్పటికే ప్రాథమిక ఆధారాల సేకరణ
వందల కోట్ల విలువైన సంగం డెయిరీ ఆస్తులను ధూళిపాళ్ల నరేంద్ర కుటుంబం కొల్లగొట్టిన ఉదంతంపై ఈడీ తీవ్రంగా స్పందించినట్టు తెలుస్తోంది. ఫోర్జరీ పత్రాలతో భారీ మొత్తాల్లో రుణం తీసుకోవడం, వాటికి లెక్కాపత్రం లేకపోవడంపై ఈడీ దృష్టి సారించినట్లు సమాచారం. అందుకే తక్షణం రంగంలోకి దిగి ఈ కేసులో కీలక ఆధారాలు సేకరిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ట్రస్టుకు వచ్చిన నిధులను నరేంద్ర దారి మళ్లించి ‘బ్లాక్‌’ చేసినట్లు ఇప్పటికే ప్రాథమిక ఆధారాలు లభించాయి. 
► సంగం డెయిరీకి ప్రభుత్వం ఇచ్చిన భూముల్లో 10 ఎకరాలను ధూళిపాళ్ల తన తండ్రి పేరిట ఏర్పాటు చేసిన ట్రస్ట్‌కు బదిలీ చేశారు. ప్రభుత్వ అనుమతి లేకుండా ఇలా బదిలీ చేయడం సహకార చట్టంలోని 439 నిబంధనకు విరుద్ధమని ఈడీ గుర్తించింది. ఆ భూముల్లో తమ కుటుంబ ట్రస్ట్‌ పేరిట ఓ కార్పొరేట్‌ ఆస్పత్రి, రీసెర్చ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయడం నిబంధనలకు విరుద్ధమని కూడా తేల్చింది. ధూళిపాళ్ల భార్య జ్యోతిర్మయి ఆ ఆస్పత్రికి ఎండీగా ఉన్న విషయం గమనార్హం. 
► సహకార సొసైటీని కంపెనీగా మార్చాలంటే ముందు ప్రభుత్వానికి బకాయిలు చెల్లించడంతోపాటు ప్రభుత్వ భూములను వెనక్కి ఇచ్చేసి నిరభ్యంతర పత్రం పొందాలి. ఈ నిబంధనలను కూడా ధూళిపాళ్ల పట్టించుకోలేదు. 
► ఫోర్జరీ పత్రాలతో ధూళిపాళ్ల జాతీయ డెయిరీ డెవలప్‌మెంట్‌ బోర్డు (ఎన్‌డీడీబీ) నుంచి రూ.115.58 కోట్లు రుణం తీసుకున్నారు. ఆ నిధులను తమ కుటుంబ ట్రస్ట్‌కు బదిలీ చేసినట్టు కూడా ఈడీ గుర్తించింది. 
► సంగం డెయిరీ నిధులతో కొనుగోలు చేసిన 72.54 ఎకరాలను ధూళిపాళ్ల హస్తగతం చేసుకున్న విషయంపై ఈడీ కూపీ లాగుతోంది. 
► సంగం డెయిరీ చైర్మన్‌గా ఉంటూనే సహకార చట్టాలకు విరుద్ధంగా ధూళిపాళ్ల సొంతంగా మిల్క్‌లైన్‌ అనే డెయిరీని నెలకొల్పడం, అనంతరం దానికి తన భార్య జ్యోతిర్మయిని ఎండీని చేయడంపై కూడా దృష్టి సారించింది. 
► తాజాగా డెయిరీ నిధులు రూ.50 కోట్లను ధూళిపాళ్ల తమ సొంత ట్రస్ట్‌కు బదిలీ చేసిన విషయాన్నీ ఈడీ గుర్తించింది. నిబంధనలకు విరుద్ధంగా మనీలాండరింగ్‌ పాల్పడి అక్రమాలకు పాల్పడ్డ ధూళిపాళ్ల నరేంద్రపై కఠిన చర్యలు తీసుకునే దిశగా ఈడీ సమాయత్తమవుతోందని కేంద్ర అధికార వర్గాలు తెలిపాయి. 
► సుదీర్ఘకాలంగా డెయిరీలో పనిచేస్తున్న ముఖ్యులను కాదని.. నిబంధనలకు విరుద్ధంగా నిధులను దారి మళ్లించడంతో వారంతా నరేంద్ర పట్ల వ్యతిరేకతతో ఉన్నారు. ఈడీ జోక్యం చేసుకోనున్న నేపథ్యంలో వారంతా మౌనాన్ని ఆశ్రయించడం మేలనే భావనలో ఉన్నారు.

ధూళిపాళ్లపై సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత
మరోవైపు ధూళిపాళ్లకు సొంత పార్టీ టీడీపీలోనే ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఆయన సొంత నియోజకవర్గం పొన్నూరుతో సహా గుంటూరు జిల్లాలో టీడీపీ నేతలెవరూ ఆయనకు అండగా నిలిచేందుకు ఏమాత్రం సుముఖత చూపించడం లేదు. భారీ అవినీతికి పాల్పడి ఆధారాలతో సహా దొరికిన ఆయనకు ఈ కేసులో శిక్ష పడటం ఖాయమని టీడీపీ వర్గాలు విశ్వసిస్తున్నాయి. ఇక ఆయన అక్రమాలపై తాజాగా ఈడీ కూడా దృష్టి సారించడంతో టీడీపీలో కలకలం రేగుతోంది. ఈ నేపథ్యంలో ధూళిపాళ్లకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని టీడీపీ నేతలు భావిస్తున్నారు.
చదవండి: ఇనోదయ ఆస్పత్రిపై జాయింట్ కలెక్టర్ చర్యలు

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు