ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త

22 Mar, 2021 04:12 IST|Sakshi

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు డిస్కౌంట్‌ సేల్‌

జీకార్ట్‌ పేరుతో ప్రత్యేక పోర్టల్‌ అభివృద్ధి చేస్తున్న ఏపీటీఎస్‌

నేరుగా తయారీ సంస్థలతో ఒప్పందం

తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చేలా బ్యాంకులతో ఒప్పందం

వస్తువులు డెలివరీ చేయడానికి లాజిస్టిక్‌ సంస్థల సహకారం

త్వరలో సీఎం చేతుల మీదుగా ప్రారంభానికి ఏర్పాట్లు

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒక శుభవార్త. బహిరంగ మార్కెట్‌ కంటే తక్కువ ధరకే గృహోపకరణాలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక పోర్టల్‌ను అభివృద్ధి చేస్తోంది. కంప్యూటర్లు, ట్యాబ్‌లు, మొబైల్‌ ఫోన్లతో పాటు ఇతర ఎలక్ట్రానిక్‌ గృహోపకరణాలను డిస్కౌంట్‌ ధరలకే అందించే విధంగా ఆంధ్రప్రదేశ్‌ టెక్నాలజీ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (ఏపీటీఎస్‌).. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ తరహాలో ‘జీ–కార్ట్‌’ పేరుతో ఒక పోర్టల్‌ను అభివృద్ధి చేస్తోంది. ఉద్యోగులు ఐడీ నంబర్‌ను నమోదు చేయడం ద్వారా లాగిన్‌ అయ్యి, వస్తువులను కొనుగోలు చేసే విధంగా పోర్టల్‌ను అభివృద్ధి చేస్తున్నారు.

ప్రస్తుతం ఈ పోర్టల్‌ను ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నారు. ఇప్పటికే సెక్యూరిటీ ఆడిటింగ్‌ కూడా పూర్తయ్యింది. త్వరలోనే ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ పోర్టల్‌ను ప్రారంభిస్తామని ఏపీటీఎస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ నంద కిషోర్‌ ‘సాక్షి’కి వెల్లడించారు.  దీనివల్ల సుమారు 10.36 లక్షల మంది ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన వారికి ప్రయోజనం లభిస్తుందని ఏపీటీఎస్‌ అంచనా వేస్తోంది. వివిధ కార్పొరేషన్లతో కలుపుకొని రాష్ట్రంలో 7,76,492 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉండగా, 2.60 లక్షల మంది వలంటీర్లు ఉన్నారు.

ఓఈఎంలతో ఒప్పందం
ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఈకామర్స్‌ పోర్టల్స్‌ కంటే తక్కువ రేటుకు వస్తువులను అందించే విధంగా నేరుగా తయారీ సంస్థల (ఓఈఎం–ఒరిజనల్‌ ఎక్విప్‌మెంట్‌ మాన్యుఫ్యాక్చరర్‌)తో మాట్లాడి ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్లు నందకిషోర్‌ తెలిపారు. పది లక్షల మందికిపైగా ఉద్యోగులు ఉండటంతో ఓఈఎం సంస్థలు కూడా ఒప్పందం చేసుకోవడానికి ఆసక్తి వ్యక్తం చేస్తున్నాయి. కొంత మంది ఉద్యోగులు గ్రూపులుగా ఏర్పడి ఒకేసారి అధిక మొత్తంలో కొనుగోలు ఆర్డరుఇస్తే, మరింత డిస్కౌంట్‌ ఇచ్చేలా గ్రూపు బయ్యింగ్‌ పాలసీని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ పోర్టల్‌ ద్వారా కొనుగోలు చేసిన వస్తువులను నేరుగా ఇంటికి చేర్చడం కోసం లాజిస్టిక్‌ సంస్థలతో ఒప్పందం చేసుకున్నారు.

‘చేయూత’ కోసం హోల్‌సేల్‌ రిటైలర్స్‌తో ఒప్పందాలు
ఇదే సమయంలో రాష్ట్రంలో వైఎస్సార్‌ చేయూత కింద షాపులను ఏర్పాటు చేసుకున్న మహిళలకు తక్కువ రేటుకే వస్తువులను అందించే విధంగా హోల్‌సేల్‌ రిటైల్‌ సంస్థలతో చర్చలు జరుపుతున్నారు. వాల్‌మార్ట్, డీమార్ట్, రిలయన్స్‌ వంటి సంస్థలతో ఒప్పందాలు చేసుకోనున్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతం కృష్ణా జిల్లాలో ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నట్లు ఏపీటీఎస్‌ ఎండీ నందకిషోర్‌ తెలిపారు. రాష్ట్రంలో సుమారు 75,000 మంది వైఎస్సార్‌ చేయూత కింద షాపులు ఏర్పాటు చేసుకున్నారని, వీరికి సరుకులు కొనుగోళ్లు ఇబ్బందిగా ఉండటంతో నేరుగా షాపులకే డెలివరీ చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. 

మరిన్ని వార్తలు