నేటి నుంచి రాయితీ వరి విత్తనం

1 Jun, 2021 04:34 IST|Sakshi

ఖరీఫ్‌ కోసం 2.37 లక్షల క్వింటాళ్ల విత్తనం

ఆర్బీకేల ద్వారా పంపిణీకి ఏర్పాట్లు

ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎం జిల్లాల్లో కిలోకి రూ.10 సబ్సిడీ

నాన్‌ ఎన్‌ఎఫ్‌ఎంఎస్‌ జిల్లాల్లో కిలోకి రూ.5 సబ్సిడీ

గిరిజన ప్రాంతాల్లో 90 శాతం సబ్సిడీపై పంపిణీ

డి.క్రిష్‌ యాప్‌ ద్వారా నమోదు చేసుకుంటున్న రైతులు

ఆ 13 రకాల వరి వంగడాలనే సాగు చేయాలంటున్న వ్యవసాయ శాఖ

సాక్షి, అమరావతి: అన్నదాతలకు ఖరీఫ్‌లో రాయితీ వరి విత్తనం పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకేలు) ద్వారా నేటి నుంచి 13 రకాల వరి విత్తనాల పంపిణీకి శ్రీకారం చుడుతోంది. గతేడాది రాష్ట్రంలో 39.54 లక్షల ఎకరాల్లో వరి సాగవగా, ఈ ఏడాది 41.20 లక్షల ఎకరాల్లో సాగు చేయాలని లక్ష్యంగా నిర్దేశించింది. ప్రస్తుత సీజన్‌ కోసం ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా సర్టిఫై చేసిన 2.37 లక్షల క్వింటాళ్ల రాయితీ విత్తనాన్ని సిద్ధం చేసింది. జాతీయ ఆహార భద్రత మిషన్‌ (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎం) పరిధిలోని విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, వైఎస్సార్‌ జిల్లాల్లో కిలోకి రూ.10, మిగిలిన 8 జిల్లాల్లో కిలోకు రూ.5 చొప్పున రాయితీపై పంపిణీ చేస్తారు. గిరిజన ప్రాంతాల్లో మాత్రం 90 శాతం సబ్సిడీపై పంపిణీ చేయనున్నారు.

ఆర్బీకేల్లో టెస్టింగ్‌ కిట్‌లు..
ఆర్బీకేల ద్వారా వాస్తవ సాగుదారులకు మాత్రమే వరి వంగడాలను పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేశారు. ఆర్బీకేల్లో నమోదు చేసుకున్న రోజే సబ్సిడీ పోను మిగిలిన నగదు మొత్తాన్ని తీసుకుంటారు. పంపిణీకి ముందు వాటి నాణ్యతను విలేజ్‌ అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ (వీఏఏ), మండల వ్యవసాయాధికారి (ఎంఏవో), వ్యవసాయ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ (ఏడీఏ)లు పరీక్షించనున్నారు. ఇందుకోసం ప్రతి ఆర్బీకే వద్ద మినీ సీడ్‌ టెస్టింగ్‌ కిట్‌లను అందుబాటులో ఉంచుతున్నారు. సబ్సిడీ విత్తన పంపిణీ ప్రక్రియను పర్యవేక్షించేందుకు జిల్లా స్థాయిలో ప్రత్యేకంగా పర్యవేక్షణ కమిటీలు ఏర్పాటు చేశారు. సబ్సిడీ విత్తనంతో నాటిన పంటను తప్పనిసరిగా ఈ–క్రాప్‌లో నమోదు చేసుకునేలా రైతులకు అవగాహన కల్పిస్తారు. ఏ గ్రామంలో ఏ రైతుకు ఏ రకం వంగడం.. ఎంత పరిమాణంలో సరఫరా చేశారో ఆర్బీకేల్లో ప్రదర్శించనున్నారు.

ఆ వంగడాలొద్దంటున్న ప్రభుత్వం
ఏళ్ల తరబడి సాగు చేస్తున్న కొన్ని రకాల వంగడాలు తెగుళ్లను తట్టుకోలేకపోవడం, గింజలపై మచ్చలేర్పడడం, మిల్లింగ్‌లో ముక్కలైపోవడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నాయి. దీంతో రైతులకు మద్దతు ధర లభించడం లేదు. ఈ నేపథ్యంలో వీటి సాగును పూర్తిగా ఆపేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై వ్యవసాయ సలహా మండళ్ల ద్వారా రైతులకు అవగాహన కల్పించనుంది. సాగుకు అనుకూల వంగడాలు, మేలైన సాగు, నీటి యాజమాన్య పద్ధతులపై ఆర్బీకేల ద్వారా విస్తృత ప్రచారం చేయనుంది. సాగుకు అనుకూలంగా లేని వరి విత్తనాలను డీలర్లు విక్రయించకుండా చర్యలు చేపట్టింది.

 13 రకాల వంగడాలు..
ఖరీఫ్‌–2021 సీజన్‌లో 13 రకాల వంగడాలను ప్రోత్సహించాలని నిర్ణయించాం. వాతావరణాన్ని తట్టుకోలేని, నూక శాతం ఎక్కువగా ఉన్న మార్కెట్‌లో డిమాండ్‌ లేని వంగడాలను ఈ సీజన్‌లో ఆపేయాలని నిర్ణయించాం. వీటి స్థానంలో ప్రత్యామ్నాయ వంగడాల సాగును ప్రోత్సహించేలా రైతులను చైతన్యపరుస్తున్నాం. నేటి నుంచి పంపిణీ చేయనున్న రాయితీ విత్తనం కోసం రైతులు డి.క్రిష్‌ యాప్‌ ద్వారా ఆర్బీకేల్లో వివరాలను నమోదు చేసుకుంటున్నారు.
– అరుణ్‌కుమార్, కమిషనర్, వ్యవసాయ శాఖ  

మరిన్ని వార్తలు