వివాహ వయసు పెంపుపై చర్చ

2 Jun, 2022 05:30 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

రాష్ట్రాల స్థానిక ప్రజా ప్రతినిధులతో ఆన్‌లైన్‌ సమావేశం 

సాక్షి, అమరావతి: పేదింటి బాలికలు సైతం ఉన్నత విద్యనభ్యసించేలా రాష్ట్ర ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తోందని.. దీనికి అదనంగా యువతుల కనీస వివాహ వయసు పెంపు వంటి చర్యలు మహిళలు తమ లక్ష్యాలను సులువుగా సాధించేందుకు  దోహదపడతాయని కృష్ణా జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ ఉప్పాల హారిక అన్నారు. కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ‘బాల్య  వివాహాల నిషేధ చట్టం (సవరణ)–బిల్లు 2021’పై అన్ని రాష్ట్రాల్లోని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో బుధవారం ఆన్‌లైన్‌  సదస్సు జరిగింది. మన రాష్ట్రం నుంచి కృష్ణా జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌తో పాటు వినుకొండ ఎంపీపీ, పలువురు మహిళా సర్పంచ్‌లు విజయవాడ ఏపీఎస్‌ఐఆర్‌డీ కార్యాలయం నుంచి పాల్గొన్నారు. మహిళల వివాహ వయసును 18 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు పెంచడం వల్ల కలిగే మంచి, చెడులపై ఎవరేమన్నారంటే..  

వివాహ వయసు పెంపును స్వాగతిస్తున్నా.. 
21 ఏళ్లు వచ్చిన తర్వాత వివాహాలు జరగడం వల్ల మహిళలకు బిడ్డను కనడానికి అనువుగా శారీరక పరిపుష్టత ఉంటుంది. బాలికల వివాహ వయసు పెంచడం ద్వారా బాలికలు విద్య, సామాజిక, ఆర్థిక, రాజకీయంగా వృద్ధిలోకి వస్తారు. 
– ఉప్పాల హారిక, జెడ్పీ చైర్‌పర్సన్, కృష్ణా జిల్లా 

విద్య, వృత్తి నైపుణ్యాలపై దృష్టి పెట్టాలి 
18 ఏళ్ల లోపే వివాహం చేయడాన్ని గ్రామాల్లోను, బలహీన వర్గాల్లోను నిషేధించడం కష్టంగా ఉంది. కాబట్టి మనం వివాహ వయసుపై కాకుండా బాలికా విద్య, వృత్తి నైపుణ్యాల పై దృష్టిసారించాలి. 
– జయశ్రీ, ఎంపీపీ, వినుకొండ.

విద్య, ఆరోగ్యం, పౌష్టికాహారానికి ప్రాధాన్యత 
వివాహ వయసు పెంపుదల గ్రామ స్థాయిలో పెద్దగా ప్రయోజనకరంగా ఉండకపోవచ్చు. మనం విద్య, ఆరోగ్యం, కౌమార బాలికలకు పౌష్టికాహారం, సాంకేతిక, వృత్తి విద్యపై పని చేయాల్సిన అవసరం ఉంది. 
– డాక్టర్‌ జగబంధు, సర్పంచ్, శ్రీకాకుళం జిల్లా  

మరిన్ని వార్తలు