వెళ్లిపోతున్నాం..మా కోసం వెతకొద్దు! 

11 Jul, 2022 17:12 IST|Sakshi

కొడుకు లేని బతుకు మాకొద్దు

లెటర్‌ రాసి దంపతుల అదృశ్యం

కురబలకోట (వైఎస్సార్‌ జిల్లా): ‘మా కొడుకు లేని జీవితం మాకొద్దు..అప్ప..అమ్మ అనే పిలుపుకు దూరమయ్యాం..మా గురించి బాధపడకండి..మా చావుకు మేమే కారణం’ అంటూ నోట్‌ రాసి దంపతులు అదృశ్యమైన సంఘటన జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కురబలకోట మండలం వినాయక చేనేత నగర్‌లోని ఇంట్లో లెటర్‌ పెట్టి దంపతులు వై. కృష్ణ, రమణమ్మ బైక్‌లో ఎటో వెళ్లిపోయారు. వీరి కుమార్తె సుప్రియ తల్లి దండ్రుల అదృశ్యంపై ముదివేడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దంపతుల కోసం గాలిస్తున్నారు. పీటీఎం మండలం అంగడివారిపల్లెకు చెందిన వై.కృష్ణ (50), వై.రమణమ్మ (44)కు సురేష్, సుప్రియ పిల్లలు. వీరు 24 ఏళ్లుగా మదనపల్లె వినాయక చేనేతనగర్‌ కాలనీలో కాపురం ఉంటున్నారు. కుమార్తె సుప్రియకు అదే కాలనీవాసితో వివాహం జరిపించారు. 

కృష్ణ మదనపల్లె టమాట మార్కెట్‌లో క్రయవిక్రయాల ద్వారా జీవనం సాగించేవాడు. వీరి కుమారుడు సురేష్‌ ఎంటెక్‌ చదివాడు. బెంగళూరులో సాప్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేసేవాడు. అయితే ఆరు నెలల క్రితం అతడు అనారోగ్యంతో చనిపోయాడు. అప్పటి నుంచి దంపతులు మనోవేదనతో గడిపేవారు. స్థానికులతో కూడా పెద్దగా మాట్లాడకుండా ముభావంగా కాలం వెళ్లదీసేవారు.

ఈ నేపథ్యంలో వీరు శనివారం మధ్యాహ్నం నుంచి కన్పించకుండా పోయారు. అనుమానం వచ్చిన సుప్రియ తల్లిదండ్రులుంటున్న ఇంట్లోకి వెళ్లి చూసింది. తాము వెళ్లిపోతున్నట్లు తండ్రి, తల్లి సంతకాలతో కూడిన లెటర్‌ కంటపడింది. అందులో ‘కుమారుడు లేనప్పటి నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నాం, ఇక మేము ఎవ్వరినీ బాధపెట్టదలచుకోలేదు.. నీవు ఎప్పుడు ఏడవద్దు..మాకు ఆత్మ శాంతి ఉండదని’  రాశారు. కృష్ణ సెల్‌ఫోన్‌ కూడా అక్కడే కన్పించింది. అయినవారందరూ కలిసి పరిసర ప్రాంతాల్లో వెదికినా ఆచూకీ లేదు. దీంతో ముదివేడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రమణమ్మ తీసుకెళ్లిన సెల్‌ రింగ్‌ అవుతున్నా ఎత్తడం లేదు. కర్నాటక ప్రాంతం రాయల్పాడు ప్రాంతాన్ని లోకేషన్‌లో చూపుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. వీరి కోసం తీవ్రంగా గాలిస్తున్నా కన్పించకపోవంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఎక్కడైనా వీరి ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వాల్సిందిగా ముదివేడు పోలీసులు కోరుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సుకుమార్‌ తెలిపారు.     

మరిన్ని వార్తలు