మహిళలకు రక్షణ కవచం ‘దిశ’ యాప్‌

27 Jun, 2021 04:09 IST|Sakshi
వేదికపై ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి, అధికారులు. (పక్క చిత్రంలో) యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్న మహిళలు

యాప్‌ వినియోగంపై ఎస్వీ మహిళా యూనివర్సిటీలో అవగాహన సదస్సు

యాప్‌ను ఎక్కువ మంది డౌన్‌లోడ్‌ చేసుకునేలా ప్రోత్సహించిన వారికి రూ.10,116 ప్రోత్సాహకం అందిస్తామన్న ఎమ్మెల్యే చెవిరెడ్డి

తిరుపతి (యూనివర్సిటీ క్యాంపస్‌): విద్యార్థినులు, యువతులు, మహిళలు ఏదైనా విపత్కర పరిస్థితి ఎదురైతే.. ఎలా బయట పడాలి. ఎవరికి ఫోన్‌ చేయాలి. ఫోన్‌ చేసినప్పుడు అవతలి వారు లిఫ్ట్‌ చేయకపోతే పరిస్థితి ఏమిటి. ఆపదలో ఉన్న మహిళ కేకలు వేసినా వినిపించని నిర్జన ప్రదేశమైతే ఏం చేయాలి. ఈ ప్రశ్నలన్నింటికీ ఒకే ఒక్క సమాధానం ‘దిశ’ యాప్‌. దీనిని ఎక్కడి నుంచి.. ఎలా డౌన్‌లోడ్‌ చేసుకోవాలి, ఆపత్కాలంలో ఎలా వినియోగించాలనే విషయాలపై శ్రీ పద్మావతీ మహిళా యూనివర్సిటీ ఆడిటోరియం వేదికగా చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని గ్రామ మహిళా పోలీసులు, సంఘ మిత్రలు, మహిళా సంఘ లీడర్లకు శనివారం అవగాహన కల్పించారు. ఆపద వేళ యువతులు, మహిళలు, విద్యార్థినులను కాపాడేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిశా నిర్దేశం మేరకు రూపొందించిన ఈ యాప్‌ మొబైల్‌ ఫోన్‌ ఉంటే చాలు యువతులు, మహిళలకు సదా ఓ అన్నయ్య తోడు ఉన్నట్టేననే విషయాన్ని వివరించారు. 

డౌన్‌ లోడ్‌.. ఉపయోగించడం ఇలా
► ఆండ్రాయిడ్, ఐవోఎస్‌ మొబైల్‌ ఫోన్లలో గూగుల్‌ ప్లే స్టోర్‌లోకి వెళ్లి దిశ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. యాప్‌లో మొబైల్‌ నంబర్‌తో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. 
► యాప్‌లోఎస్‌వోఎస్‌ బటన్‌ ఉంటుంది.  ఆపదలో ఉన్నప్పుడు యాప్‌ను ఓపెన్‌ చేసి, అందులో ఉన్న ఎస్‌వోఎస్‌ బటన్‌ నొక్కాలి. ఆ వెంటనే వారి ఫోన్‌ నంబర్, చిరునామా, వారు ఆ సమయంలో ఉన్న ప్రదేశం (లొకేషన్‌)తో సహా మొత్తం సమాచారం దిశ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌కు చేరుతుంది.
► ఆ వెంటనే కంట్రోల్‌ రూమ్‌లోని సిబ్బంది అప్రమత్తమవుతారు. తమకు సందేశం పంపిన వారు ఉన్న ప్రదేశానికి సమీపంలోని పోలీస్‌ స్టేషన్‌కు క్షణాల్లోనే సమాచారం పంపిస్తారు.   
► విపత్కర పరిస్థితుల్లో యాప్‌ను ఓపెన్‌ చేసేందుకు తగిన సమయం లేకపోతే, ఫోన్‌ను గట్టిగా అటూ ఇటూ ఊపితే చాలు. ఆ యాప్‌ వెంటనే దిశ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌కు సందేశాన్ని పంపుతుంది. 

ఎక్కువ మందికి డౌన్‌లోడ్‌ చేయించిన వారికి రూ.10,116 ప్రోత్సాహకం
ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే డాక్టర్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ.. దిశను ప్రతి ఒక్కరూ డౌన్‌ లోడ్‌ చేసుకొని వినియోగించాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. మహిళా రక్షణ గురించి సీఎం వైఎస్‌ జగనన్నకు బాగా తెలుసని, దేశంలోనే మొదటిసారిగా దిశ చట్టానికి ఆయన రూపకల్పన చేశారని తెలిపారు. నియోజకవర్గ పరిధిలో సంఘ మిత్రలు యాప్‌ను ఎక్కువ మందితో డౌన్‌లోడ్‌ చేయించి ఎక్కువ మందికి అవగాహన  కల్పించాలన్నారు. అలా ఎక్కువ మందికి డౌన్‌లోడ్‌ చేయించిన వారికి రూ.10,116 ప్రోత్సాహకం అందించనున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య జమున, తిరుపతి అర్బన్‌ జిల్లా ఎస్పీ వెంకట అప్పలనాయుడు, రిజిస్ట్రార్‌ ఆచార్య మమత, రెక్టార్‌ ఆచార్య శారద, అడిషనల్‌ ఎస్పీ సుప్రజ యాప్‌ ఆవశ్యకతను వివరించారు. సదస్సుకు హాజరైన చంద్రగిరి నియోజకవర్గంలోని మహిళా సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు, మహిళా సమాఖ్య లీడర్లు, గ్రామ మహిళా పోలీసులంతా యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. 

>
మరిన్ని వార్తలు