ప్రేమ మైకంలో యువతి: జీవితానికి ‘దిశ’ చూపిన పోలీసులు

27 Jul, 2021 20:32 IST|Sakshi

ప్రేమించిన యువకుడితో పెళ్లి చేయాలని పట్టు

కౌన్సెలింగ్‌ ఇచ్చిన దిశ సిబ్బంది

చదువుపై దృష్టి పెట్టాలని సూచన

వైఎస్సార్‌ కడప అర్బన్‌: ప్రేమ వ్యవహారంలో పడి ఓ యువతి చదువును నిర్లక్ష్యం చేసింది. తాను ప్రేమించిన యువకుడితోనే పెళ్లి చేయాలని పట్టుపట్టింది. మూడు రోజులుగా పస్తులుంటూ మారం చేసింది. ఈ విషయమై ఆ యువతి ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌కు వాట్సాప్‌ ద్వారా ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదుతో ‘దిశ’ డీఎస్పీ కె. రవికుమార్, మహిళా ఎస్‌ఐ లక్ష్మీదేవి, సిబ్బంది వెంటనే స్పందించారు. ఆ యువతికి నచ్చచెప్పి ఇప్పట్లో పెళ్లి ఆలోచన చేయకుండా విరమింపజేశారు.

ఫిర్యాదు అందుకున్న వెంటనే దిశ సిబ్బంది నేరుగా యువతి నివాసానికి వెళ్లారు. ఆమెతో ఆత్మీయంగా మాట్లాడి కౌన్సెలింగ్‌ నిర్వహించారు. ఈ వయసులో చదువుపై శ్రద్ద పెట్టాలని సూచించారు. ఉద్యోగం వచ్చిన తరువాత పెళ్లికి తామే చొరవ తీసుకుంటామని ఆ యువతికి పోలీసు సిబ్బంది హామీ ఇచ్చారు. పోలీసుల కౌన్సెలింగ్‌తో ఆమెలో మార్పు వచ్చింది. ‘పెళ్లి ఇప్పుడు చేసుకోను.. బాగా చదివి మంచి ఉద్యోగం తెచ్చుకుంటా’ అని పోలీసులకు ఆ యువతి చెప్పింది. తనలో మార్పునకు దోహదం చేసిన ‘దిశ’ సిబ్బందికి, భవిష్యత్తుపై భరోసా కల్పించిన ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌కు ఫోన్‌లో ఆ యువతి కృతజ్ఞతలు తెలిపింది. తల్లిదండ్రుల ఆశలను వమ్ము చేసేలా ఎవరూ ప్రవర్తించరాదని ఈ సందర్భంగా యువతకు ఎస్పీ సూచించారు. ఏమన్న సమస్యలుంటే దిశ పోలీస్‌స్టేషన్‌ అండగా ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని మహిళలకు తెలిపారు. ఎలాంటి సమస్య వచ్చినా తన (94407 96900)కు ఫిర్యాదు చేయాలని సూచించారు.

మరిన్ని వార్తలు