పశుసంవర్ధక సహాయకుల పోస్టుల భర్తీపై పిటిషన్‌ కొట్టివేత`

29 Dec, 2023 04:56 IST|Sakshi

ఒక్కో పిటిషనర్‌కు రూ.5 వేలు ఖర్చులు విధించిన హైకోర్టు 

ఈ మొత్తాన్ని రెడ్‌క్రాస్‌కు చెల్లించాలని ఆదేశం 

సాక్షి, అమరావతి: రైతుభరోసా కేంద్రాల్లో విధులు నిర్వర్తించేందుకు 1,896 గ్రామ పశుసంవర్ధక సహాయకుల పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గతనెలలో జారీచేసిన నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ పలువురు వెటర్నరీ మెడికల్‌ ప్రాక్టీషనర్లు దాఖలు చేసిన వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టేసింది. నోటిఫికేషన్‌ విషయంలో జోక్యానికి హైకోర్టు నిరాకరించింది. నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ పిటిషన్‌ దాఖలు చేసిన 37 మంది వెటర్నరీ వైద్యులకు రూ.5 వేల చొప్పున ఖర్చులు విధించింది.

ఈ మొత్తాన్ని రెడ్‌క్రాస్‌కు చెల్లించాలని ఆ వైద్యు­లను ఆదేశించింది. గురువారం ఈ వ్యాజ్యాన్ని విచారించిన న్యాయమూర్తి జస్టిస్‌ గన్నమనేని రామకృష్ణప్రసాద్‌ ఈ ఉత్తర్వులు జారీచేశారు. విచా­రణలో పిటిషనర్ల న్యాయవాదులు జడా శ్రవణ్‌­కుమార్, ఆర్‌.వెంకటేష్‌ వాదనలు విని­పిస్తూ.. పశుసంవర్ధక సహాయకులకు విస్తృతా­ధికారాలు, వెటర్నరీ సర్జన్లకు ఉన్న అధికారాలు కల్పిస్తున్నారని, ఇది వెటర్నరీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా నిబంధనలకు విరుద్ధమని చెప్పారు. పశుసంవర్ధక సహాయకులు నేరుగా వెటర్నరీ సర్జన్‌ల ప్రత్యక్ష పర్యవేక్షణలో పని­చేయాల్సి ఉంటుందని జాబ్‌చార్ట్‌ చెబుతు­న్న­ప్పటికీ, వాస్తవరూపంలో సహాయకులకు విస్తృత అధికారాలు కల్పించారని వివరించారు.

ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది మహేశ్వర్‌రెడ్డి, ప్రభుత్వ న్యాయవాది జి.వి.ఎస్‌.కిషోర్‌కుమార్‌ వాదనలు వినిపిస్తూ.. పోస్టుల భర్తీకి జారీచేసిన నోటిఫి­కేషన్‌కు, వెటర్నరీ చట్ట కౌన్సిల్‌ నిబంధనలకు సంబంధం లేదన్నారు. సర్వీసు సంబంధిత క్రమశిక్షణ చర్యలకే వెటర్నరీ కౌన్సిల్‌ నిబంధనలు వర్తిస్తాయని చెప్పారు. పశుసంవర్ధక సహాయకులకు విస్తృతా­ధికారులు ఇవ్వడం లేదన్నారు. రైతులకు సహాయ సహకారాలు అందించడమే వారి ప్రధాన బాధ్యతని తెలిపారు. పోస్టుల భర్తీని అడ్డుకోవడమే లక్ష్యంగా పిటిషనర్లు ఈ వ్యాజ్యం దాఖలు చేశారని చెప్పారు. ఈ పోస్టుల భర్తీలో కేవలం ఈడబ్ల్యూఎస్‌ వర్గానికి మాత్రమేగాక, అన్ని వర్గాలకు స్థానం కల్పించామని తెలిపారు. ప్రభుత్వ న్యాయవాదుల వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం వెటర్నరీ వైద్యుల పిటిషన్‌ను కొట్టేసింది.

>
మరిన్ని వార్తలు