భూమా కుటుంబంలో ‘డెయిరీ’ చిచ్చు

3 Nov, 2020 10:48 IST|Sakshi

చైర్మన్‌ పదవి ఇవ్వాలని జగత్‌ విఖ్యాత్‌రెడ్డి ఒత్తిడి

కుదరదు అంటున్న నారాయణరెడ్డి

పోలీస్‌ బందోబస్తు మధ్య కొనసాగిన పాలక మండలి సమావేశం 

నంద్యాల: భూమా కుటుంబంలో విభేదాలు రచ్చ కెక్కాయి. విజయ డెయిరీ చైర్మన్‌ పదవి కోసం మాజీ ఎంపీ, దివంగత నేత భూమా నాగిరెడ్డి కుమారుడు జగత్‌ విఖ్యాత్‌ రెడ్డి పట్టుబడుతున్నారు. చైర్మన్‌గా ఉన్న భూమా నారాయణరెడ్డి ఇందుకు అంగీకరించడం లేదు. ఈ పదవి గత 25 సంవత్సరాలుగా భూమా కుటుంబం చేతిలోనే ఉంది. ఐదురోజుల క్రితం విజయ డెయిరీ సమావేశం జరగాల్సి ఉండగా కోరం లేక వాయిదా పడింది. ముగ్గురు డైరెక్టర్లను భూమా జగత్‌ విఖ్యాత్‌రెడ్డి, ఆయన బావ(మాజీ మంత్రి అఖిల ప్రియ భర్త)భార్గవర్ధన్‌ ఆళ్లగడ్డలో బలవంతంగా ఉంచారు. దీంతో వారు రాకపోవడంతో కోరం లేక సమావేశం వాయిదా పడినట్లు తెలుస్తోంది. తిరిగి ఈనెల 2వ తేదీ సోమవారం పాలక మండలి సమావేశం నిర్వహించాల్సి ఉంది. (చదవండి: రాజధాని పేరిట చంద్రబాబు బినామీ ఉద్యమం)

ఈ నేపథ్యంలో సమావేశం వాయిదా పడకూడదని, విజయ డెయిరీ చైర్మన్‌ భూమా నారాయణరెడ్డి కొంత మంది డైరెక్టర్లను నంద్యాల శివారులోని రైతునగరంలో ఉంచారు. ఈ విషయం తెలుసుకున్న భూమా జగత్‌ విఖ్యాత్‌రెడ్డి, భార్గవర్ధన్‌ నాయుడు ఆదివారం రాత్రి డైరెక్టర్లు ఉన్న రైతునగరానికి వెళ్లి భూమా నారాయణరెడ్డితో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న నంద్యాల తాలూకా సీఐ దివాకర్‌రెడ్డి తన సిబ్బందితో రైతునగరానికి ఆదివారం రాత్రి చేరుకొని ఇరువర్గాలకు సర్దిచెప్పారు. ఈ క్రమంలో విజయ డెయిరీ పాలక మండలి సమావేశం సోమవారం పోలీస్‌ బందోబస్తు మధ్య కొనసాగింది. ఆరుగురు సీఐలు, పది మంది ఎస్‌ఐలు, 50 మంది పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సమావేశానికి 11 మంది డైరెక్టర్లు హాజరయ్యారు. (చదవండి: బీసీలంతా వైఎస్‌ జగన్‌కు రుణపడ్డాం: జయరాం)

మనవడి పోస్టు పోయింది
భూమా జగత్‌ విఖ్యాత్‌రెడ్డి నా మనవడు. నిన్న భార్గవర్ధన్‌తో కలిసి నా ఇంటి వద్దకు వచ్చినప్పుడే మనవడి పోస్టు పోయింది. చైర్మన్‌ పదవి అందరితో కూర్చొని మాట్లాడి తీసుకోవాలే కాని, నేను రాజీనామా చేస్తే వారికి వస్తాదనేది వారి భ్రమ.
– భూమా నారాయణరెడ్డి, విజయ డెయిరీ చైర్మన్‌  

మరిన్ని వార్తలు