ఆగస్టు 7న ‘వైఎస్సార్‌ నేతన్న నేస్తం’ 

25 Jun, 2021 08:10 IST|Sakshi

లబ్ధిదారుల ఎంపికకు మార్గదర్శకాలు జారీచేసిన ప్రభుత్వం

అర్హతగల చేనేత కుటుంబానికి జాతీయ చేనేత దినోత్సవం నాడు రూ.24 వేల సాయం 

సాక్షి, అమరావతి:  ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ‘వైఎస్సార్‌ నేతన్న నేస్తం’ పథకం లబ్ధిదారుల ఎంపికకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ పథకం కింద అర్హతగల చేనేత కుటుంబానికి రూ.24 వేల వంతున ప్రభుత్వం సాయం చేయనుంది. ఈ సహాయాన్ని జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆగస్టు 7వ తేదీన పంపిణీ చేస్తారు. ఈ పథకానికి లబ్ధిదారులను ఎంపిక చేయాలని కలెక్టర్లు, అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఇందుకోసం గడువును నిర్దేశించింది. ఇప్పటికే వార్డు, గ్రామ సచివాలయాల్లో ఉన్న 2020–2021 ఆర్థిక సంవత్సరం లబ్ధిదారుల జాబితాను ఈ నెల 25న తీసుకోవాలి.

ఇంకా కొత్తగా అర్హులైన వారి పేర్లను వార్డు, గ్రామ సచివాలయాల్లో ఈ నెల 26 నుంచి జూలై 5వ తేదీ వరకు పరిశీలించాలి. జూలై 6 నుంచి 8వ తేదీలోపు అర్హులైన నేతన్నల జాబితాను వార్డు, గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించాలి. 9, 10 తేదీల్లో అర్హుల జాబితాను ఎంపీడీవో, మునిసిపల్‌ కార్యాలయాలకు పంపాలి. అక్కడ జాబితాను పరిశీలించి ఆమోదం, తిరస్కరణ చర్యలను 11 నుంచి 14వ తేదీలోగా పూర్తిచేయాలి. ఆ జాబితాలను 15 నుంచి 18వ తేదీలోగా జిల్లాస్థాయిలో హ్యాండ్‌లూమ్స్‌ అండ్‌ టెక్స్‌టైల్స్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్లకు పంపించాలి.

19 నాటికి వాటిని పరిశీలించి కార్పొరేషన్ల వారీగా లబ్ధిదారుల జాబితాలను తయారు చేయాలి. 20 నుంచి 22వ తేదీలోపు జిల్లా స్థాయిలో అర్హుల జాబితాను ఖరారు చేయాలి. 23న తుది జాబితాను హ్యాండ్‌లూమ్స్‌ అండ్‌ టెక్స్‌టైల్స్‌ డైరెక్టర్‌కు అందజేయాలి. అందుకు అవసరమైన నిధుల కోసం జూలై 24న ప్రభుత్వానికి ప్రతిపాదిస్తారు. ఈ ప్రక్రియకు అవసరమైన చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

చదవండి: పేదలందరికీ సొంతిళ్లు.. ఇదీ నా కల: సీఎం జగన్‌  
వైద్య విద్యార్థులకు మరో శుభవార్త..

మరిన్ని వార్తలు