'అన్నపూర్ణ'.. టీటీడీ 

23 Sep, 2022 04:29 IST|Sakshi
తరిగొండ వెంగమాంబ అన్నదాన కేంద్రం

తిరుమల: తిరుమల శ్రీవారి భక్తులకు ఆకలి బాధలు తెలియకుండా తిరుమల తిరుపతి దేవస్థానం అల్పాహారాలు, అన్నప్రసాద వితరణ చేస్తూ అన్నపూర్ణగా ఖ్యాతిగడించింది. ఎన్ని వేల మంది వచ్చినా ఇబ్బంది పడకుండా టీటీడీ అన్నప్రసాద వితరణ యజ్ఞాన్ని నిరాటంకంగా కొనసాగిస్తోంది. తిరుమలలో 17వ శతాబ్దంలోనే భక్తుల కోసం మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ ప్రత్యేకంగా అన్నప్రసాద వితరణ ప్రారంభించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి.

అందువల్ల ఆమె పేరుతోనే టీటీడీ మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్‌ను నిర్మించింది. ఒకేసారి నాలుగు వేల మంది భోజనం చేసేలా ఆధునిక సదుపాయాలతో నిర్మించిన ఈ భవనాన్ని 2011 జూలై 11న అప్పటి రాష్ట్రపతి  ప్రతిభాపాటిల్‌ ప్రారంభించారు. 

రూ.10 లక్షలతో అన్నప్రసాద వితరణ ప్రారంభం 
ఇక 1933లో తిరుమల తిరుపతి దేవస్థానములు ఏర్పడిన మూడు దశాబ్దాల తర్వాత అతి తక్కువ ధరలకు భక్తులకు అల్పాహారం, భోజనం అందించేందుకు పలు ప్రాంతాల్లో టీటీడీ క్యాంటీన్లు ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే పాత అన్నప్రసాద భవనాన్ని 1980 జూన్‌ 5వ తేదీన ప్రారంభించింది. ఇక్కడ కూడా ప్లేట్‌ మీల్స్‌ రూ.1.75, ఫుల్‌ మీల్స్‌ రూ.3, స్పెషల్‌ మీల్స్‌ రూ.4.50 విక్రయించేవారు.

తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతుండటంతో టీటీడీ 1985లో ఉచిత అన్నప్రసాద వితరణకు శ్రీకారం చుట్టింది. ఎల్‌వీ రామయ్య అనే భక్తుడు ఇచ్చిన రూ.పది లక్షల భూరివిరాళంతో టీటీడీ ఉచిత అన్నప్రసాద వితరణను ప్రారంభించింది. అప్పట్లో శ్రీవారి దర్శనం చేసుకున్న భక్తులకు మాత్రమే ఆలయంలో ఉచిత భోజనం టోకెన్లు అందించేవారు. తొలుత రెండు వేల మందికి భోజనం అందించగా, క్రమంగా ఈ సంఖ్య 20 వేలకు పెరిగింది. భక్తుల సంఖ్య భారీగా పెరగడంతో టీటీడీ 2008లో సర్వ¿ోజన పథకానికి శ్రీకారం చుట్టింది. నాటి నుంచి తిరుమలలో భక్తులందరికీ శ్రీవారి అన్నప్రసాద వితరణను ఉచితంగా కొనసాగిస్తూ భక్తుల సేవలో తరిస్తోంది. 

పలు ప్రాంతాల్లో అన్నప్రసాద వితరణ 
► తిరుమలలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్‌తోపాటు నాలుగు ప్రాంతాల్లో అన్నప్రసాదాలు తయారు చేస్తారు.  
► వెంగమాంబ కాంప్లెక్స్‌లో అన్నం, కూర, చట్నీ, సాంబార్, రసం, మజ్జిగ, చక్కెర పొంగలి అందిస్తారు.  
► వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌–1, 2, వెలుపలి క్యూలైన్లు, పీఏసీ–2, ఫుడ్‌ కౌంటర్లలో సాంబార్‌ బాత్, ఉప్మా, పొంగలి, పులిహోర అందిస్తారు. 
► సాధారణ రోజుల్లో రోజుకు 55వేల నుంచి 60వేల మంది భక్తులకు అన్నప్రసాదాలు అందిస్తున్నారు. పర్వదినాలు, రద్దీ రోజుల్లో ఈ సంఖ్య లక్ష వరకు చేరుతుంది.  
► సాధారణ రోజుల్లో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ఉదయం 9 నుంచి రాత్రి 11 గంటల వరకు అన్నప్రసాద వితరణ ఉంటుంది. బ్రహ్మోత్సవాల రోజుల్లో ఉదయం 8 నుంచి రాత్రి 11.30 గంటల వరకు, గరుడసేవ రోజు రాత్రి ఒంటి గంట వరకు అన్నప్రసాద వితరణ ఉంటుంది.  
► అన్నప్రసాదాల తయారీకి రోజూ దాదాపు 10 నుంచి 12 టన్నుల బియ్యం, 7 నుంచి 8 టన్నుల కూరగాయలు వినియోగిస్తున్నారు. 
► సరుకుల నాణ్యత విషయంలో టీటీడీ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటుంది. తిరుపతిలోని మార్కెటింగ్‌ గోడౌన్‌ నుంచి తెచ్చిన సరుకులను ప్రయోగశాలలో పరిశీలించిన తర్వాత అన్నప్రసాద విభాగానికి చేరవేస్తారు.  

అన్నదాన ట్రస్టులో రూ.1,502 కోట్ల నిధులు 
దాతల సహకారంతో టీటీడీ అన్నదాన ట్రస్టులో రూ.1,502 కోట్ల నిధులు సమకూరాయి. ఈ ట్రస్టు 2018వ సంవత్సరంలో స్వయంసమృద్ధి సాధించడంతో టీటీడీ గ్రాంటు నిలిపివేసింది. భక్తులకు మరింత పోషకాలతో కూడిన అన్నప్రసాదాలు అందించేందుకు భవిష్యత్తులో ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన కూరగాయలు అందించాలని దాతలను టీటీడీ కోరుతోంది.   

మరిన్ని వార్తలు