ఏపీ: కరోనాకు నేటినుంచి ఆయుర్వేద మందు పంపిణీ

21 May, 2021 10:09 IST|Sakshi
మందు తయారీకి సిద్ధం చేస్తున్న దృశ్యం

భౌతిక దూరం పాటించేలా క్యూ లైన్ల ఏర్పాటు

పంపిణీ ప్రారంభమయ్యేలా చొరవ చూపిన ఎమ్మెల్యే కాకాణి

సాక్షి అమరావతి/ముత్తుకూరు: కరోనాను నివారించే ఆయుర్వేద మందు పంపిణీకి రంగం సిద్ధమైంది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నంలో మూడు రోజులపాటు నిలిపివేసిన మందు తయారీ తిరిగి మొదలైంది. శుక్రవారం నుంచి పంపిణీ చేసేందుకు నిర్వాహకుడు బొనిగి ఆనందయ్య ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా నివారణకు మందు బాగా పనిచేస్తుందని తెలియడంతో వేలాది మంది దీని కోసం తరలివచ్చారు. అక్కడ కోవిడ్‌ నిబంధనలు పాటించడం లేదని, ప్రజలు గుంపులు గుంపులుగా ఉండటం వల్ల వైరస్‌ వ్యాప్తి పెరుగుతుందని అధికారులు మందు పంపిణీని సోమవారం నిలిపివేశారు. పత్రికల్లో వచ్చిన వార్తను లోకాయుక్త సుమోటాగా స్వీకరించి.. నివేదిక పంపాల్సిందిగా కలెక్టర్‌ కేవీఎన్‌ చక్రధరబాబును ఆదేశించింది.

ఈ క్రమంలో జిల్లా వైద్యారోగ్య శాఖ, నెల్లూరు ఆర్డీవో, జిల్లా పంచాయతీ అధికారి, ఆయుర్వేద వైద్య నిపుణులతో కూడిన బృందం సోమవారం మందు ఇస్తున్న ప్రాంతాన్ని పరిశీలించి.. తయారీ విధానం, వినియోగించే దినుసుల వివరాలు తెలుసుకుని కొంత మందును పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపారు. ఇదిలావుండగా.. మందు పంపిణీ నిలిపివేతపై సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి అధికారులతో మాట్లాడారు. లోకాయుక్త ఆ మందుకు పరీక్షలు నిర్వహించి, ల్యాబ్‌ రిపోర్టులు పంపాలని మాత్రమే ఆదేశించిందని, పంపిణీ నిలిపివేయాలని ఉత్తర్వులు ఇవ్వలేదని స్పష్టం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. శుక్రవారం నుంచి కోవిడ్‌ నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ మందు పంపిణీ చేయిస్తామని ఎమ్మెల్యే కాకాణి ప్రకటించారు.

మందులో వినియోగించే దినుసులివీ..
అల్లం, తాటి బెల్లం, తేనె, నల్ల జీలకర్ర, తోక మిరియాలు, పట్టా, లవంగాలు, వేప ఆకులు, నేరేడు చిగుర్లు, మామిడి చిగుర్లు, నేల ఉసిరి, కొండ పల్లేరు, బుడ్డ బుడస ఆకులు, పిప్పింట ఆకులు, తెల్ల జిల్లేడు పూల మొగ్గలు, ముళ్ల వంకాయలు.

అన్నీ మోతాదుకు లోబడే ఉన్నాయి
కృష్ణపట్నంలో కరోనా నియంత్రణకు ఆనందయ్య ఇస్తున్న మందు నమూనాలను సేకరించి హైదరాబాద్‌లో గుర్తింపు పొందిన ల్యాబొరేటరీలో పరీక్ష చేయించినట్టు ఆయుష్‌ కమిషనర్‌ కల్నల్‌ రాములు ఓ ప్రకటనలో తెలిపారు. ప్రాథమిక నివేదిక ప్రకారం.. ఆ మందులో ఉన్న పదార్థాలు మోతాదుకు లోబడే ఉన్నాయని పేర్కొన్నారు. పూర్తిస్థాయి ల్యాబ్‌ ఫలితాలు రావడానికి వారం రోజులు పడుతుందన్నారు.  

మరిన్ని వార్తలు