సర్వేపల్లిలో ఆయుర్వేద మందు పంపిణీ ప్రారంభం

8 Jun, 2021 04:43 IST|Sakshi
ఆనందయ్య మందును పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి

సేవా కార్యక్రమాలపై కుట్రలు బాధాకరం  

సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి

వెంకటాచలం: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో ఆనందయ్య ఆయుర్వేద మందు పంపిణీ ప్రారంభమైంది. వెంకటాచలం మండలం గొలగమూడిలో భగవాన్‌ వెంకయ్యస్వామి ఆశ్రమ ప్రాంగణంలోని కల్యాణ మండపంలో సోమవారం ఈ మందు పంపిణీని ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని 1.80 లక్షల కుటుంబాల్లో 3.50 లక్షల మందికి గ్రామ సచివాలయాల ద్వారా మందు పంపిణీ చేయిస్తామన్నారు. పదిమందికి మేలు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన తనను బలహీనపరచాలని కుట్రలు చేయడం బాధాకరమన్నారు.

ఎవరెన్ని కుట్రలు చేసినా నియోజకవర్గంలో మందు పంపిణీ ఆగదని స్పష్టం చేశారు. ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాల్లోనూ పంపిణీ చేసేందుకు కృషిచేస్తామని తెలిపారు. ఈ మందు ద్వారా సంపాదించాలనే ఆలోచన చేసి ఉంటే.. తన కుటుంబం సర్వనాశనం అవుతుందని భగవాన్‌ శ్రీవెంకయ్యస్వామి ఆశ్రమ సన్నిధిలో చెబుతున్నానన్నారు. ఇచ్చిన మాట ప్రకారం నియోజకవర్గంలో మందు పంపిణీ చేసేందుకు తీవ్రంగా కృషిచేసిన ఆనందయ్య, ఆయన కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. వారి కుటుంబానికి అండగా ఉంటామన్నారు. మందు తయారీకి సంబంధించి కృష్ణపట్నంలో ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటుకు కలెక్టర్‌ ప్రత్యేక చొరవ తీసుకున్నట్టు ఎమ్మెల్యే కాకాణి వెల్లడించారు. కార్యక్రమంలో భగవాన్‌ వెంకయ్యస్వామి ఆశ్రమ ఈవో పి.బాలసుబ్రహ్మణ్యం, నెల్లూరు రూరల్‌ డీఎస్పీ హరనాథ్‌రెడ్డి, ఆనందయ్య సోదరుడు రాజా, కుమారుడు శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు