పాత పద్ధతిలోనే కృష్ణా నీటి పంపిణీ

7 May, 2022 08:09 IST|Sakshi

చెరి సగం ఇవ్వాలన్న తెలంగాణ ప్రతిపాదనను తోసిపుచ్చిన కృష్ణా బోర్డు

శ్రీశైలం, సాగర్‌లలో విద్యుదుత్పత్తి చేసి నీటిని వృథా చేయడంపై అసహనం

ఆరుగురు సభ్యుల కమిటీ నివేదిక ఆధారంగా 2022–23లో విద్యుదుత్పత్తి

మళ్లించిన వరద జలాలను కోటాలో కలపడంపైనా కమిటీతో అధ్యయనం

రూల్‌ కర్వ్‌ ఖరారయ్యాక.. శ్రీశైలం, నాగార్జునసాగర్‌లు బోర్డు అధీనంలోకి

రూ.200 కోట్లు సీడ్‌ మనీ జమ చేసేందుకు తెలుగు రాష్ట్రాల అంగీకారం

సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌ నివేదిక ఆధారంగా ఆర్డీఎస్‌ వివాదం పరిష్కారం

సాక్షి, అమరావతి: కృష్ణా జలాలను వచ్చే నీటి సంవత్సరంలో పాత పద్ధతిలోనే ఏపీకి 66, తెలంగాణకు 34 శాతం చొప్పున పంపిణీ చేస్తామని కృష్ణా బోర్డు తేల్చిచెప్పింది. చెరి సగం పంపిణీ చేయాలని తెలంగాణ సర్కార్‌ చేసిన ప్రతిపాదనను తోసిపుచ్చింది. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, సాగర్‌లకు మరమ్మతులు, బోర్డు నిర్వహణకు వీలుగా సీడ్‌ మనీ కింద రూ.200 కోట్లు చొప్పున బోర్డు ఖాతాలో జమ చేసేందుకు రెండు తెలుగు రాష్ట్రాలు అంగీకరించాయి.

శుక్రవారం హైదరాబాద్‌ జలసౌధలో కృష్ణా బోర్డు ఛైర్మన్‌ ఎంపీ సింగ్‌ అధ్యక్షతన 16వ సర్వ సభ్య సమావేశం జరిగింది. ఆంధ్రప్రదేశ్‌ తరఫున జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి హాజరు కాగా తెలంగాణ తరఫున నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్, ఈఎన్‌సీ మురళీధర్‌ తదితరులు హాజరయ్యారు. 

వాటాలు తేల్చే అధికారం ట్రిబ్యునల్‌దే
వచ్చే నీటి సంవత్సరంలో కృష్ణా జలాలను చెరి సగం పంపిణీ చేయాలని తెలంగాణ కోరడంపై ఏపీ అధికారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బచావత్‌ ట్రిబ్యునల్‌ ప్రాజెక్టుల వారీగా చేసిన కేటాయింపుల ఆధారంగానే ఏపీకి 512.04, తెలంగాణకు 298.96 టీఎంసీలను కేంద్రం పంపిణీ చేసిందని స్పష్టం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణా డెల్టా ఆధునికీకరణ వల్ల మిగిలిన జలాల్లో 20 టీఎంసీలు తెలంగాణలో బీమాకు కేటాయించామని, వాటిని వెనక్కి తీసుకుంటే.. కృష్ణా జలాల్లో ఏపీ వాటా 80 శాతమవుతుందని వివరించారు. దీనిపై కృష్ణా బోర్డు ఛైర్మన్‌ ఎంపీ సింగ్‌ స్పందిస్తూ.. నీటి వాటాలు తేల్చడం తమ పరిధిలో లేదని, ఆ అధికారం ట్రిబ్యునల్‌కే ఉంటుందని తేల్చిచెప్పారు. పాత పద్ధతిలోనే 2022–23లోనూ నీటిని పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు.

విద్యుదుత్పత్తిపై అసహనం..
గతేడాది శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో విద్యుదుత్పత్తి చేస్తూ నీటిని తెలంగాణ వృథా చేయడంపై కృష్ణా బోర్డు ఛైర్మన్‌ ఎంపీ సింగ్‌ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. శ్రీశైలం, సాగర్‌లలో సాగునీటికే ప్రథమ ప్రాధాన్యమని, జలవిద్యుదుత్పత్తికి కాదని స్పష్టం చేశారు. గ్రిడ్‌ను కాపాడుకోవడం కోసమే విద్యుదుత్పత్తి చేశామని తెలంగాణ అధికారులు సమర్థించుకోవడాన్ని తప్పుబట్టారు. రెండు ప్రాజెక్టుల్లో విద్యుదుత్పత్తిపై అధ్యయనం చేయడానికి ఆరుగురు సభ్యులతో (బోర్డు నుంచి ఇద్దరితోపాటు ఏపీ ఈఎన్‌సీ, జెన్‌కో సీఈ, తెలంగాణ ఈఎన్‌సీ, జెన్‌కో సీఈ) కమిటీని ఏర్పాటు చేశారు. 15 రోజుల్లోగా నివేదిక ఆధారంగా రెండు ప్రాజెక్టుల్లో విద్యుదుత్పత్తిపై నిర్ణయం తీసుకుంటామన్నారు.

వరద జలాలపై రెండు రాష్ట్రాలకు హక్కు..
జూరాల, శ్రీశైలం, సాగర్, పులిచింతల ప్రాజెక్టుల గేట్లు ఎత్తేసి ప్రకాశం బ్యారేజీ ద్వారా జలాలు సముద్రంలో కలుస్తున్నప్పుడు వరద నీటిని రెండు రాష్ట్రాల్లో ఎవరు మళ్లించినా కోటా కింద లెక్కించకూడదని ఏపీ అధికారులు కోరారు. దీనిపై తెలంగాణ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దిగువ రాష్ట్రమైన ఏపీకి వరద జలాలను వినియోగించుకునే స్వేచ్ఛను బచావత్‌ ట్రిబ్యునల్‌ ఇచ్చిందని.. నర్మదా, కావేరి బోర్డులు కూడా వరద జలాలను కోటా కింద లెక్కించడం లేదని ఏపీ అధికారులు ప్రస్తావించారు. దీనిపై కూడా ఆరుగురు సభ్యులతో ఏర్పాటైన కమిటీ నెల రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని బోర్డు ఛైర్మన్‌ ఎంపీ సింగ్‌ ఆదేశించారు. దాని ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు.

రూల్‌ కర్వ్‌ ఖరారయ్యాక ప్రాజెక్టుల అప్పగింత..
శ్రీశైలం, నాగార్జునసాగర్‌లను బోర్డుకు తక్షణమే అప్పగించాలని ఛైర్మన్‌ ఎంపీ సింగ్‌ కోరారు. ఇప్పటికే శ్రీశైలం, సాగర్‌పై తమ భూభాగంలోని అవుట్‌లెట్లను ఏపీ సర్కార్‌ అప్పగిస్తూ జీవోలు ఇచ్చిందని గుర్తు చేశారు. దీనిపై తెలంగాణ అధికారులు స్పందిస్తూ  రూల్‌ కర్వ్‌ (శ్రీశైలం, సాగర్‌ల నుంచి ఏ ప్రాజెక్టుకు ఎప్పుడు ఎంత పరిమాణంలో నీటిని విడుదల చేయాలి) ఖరారయ్యాక  తమ అవుట్‌లెట్లను బోర్డుకు అప్పగిస్తామని స్పష్టం చేశారు. 2 ప్రాజెక్టులపై సీడబ్ల్యూసీతో అధ్యయనం చేయించి బచావత్‌ ట్రిబ్యునల్‌ కేటాయింపుల ఆధారంగా రూపొందించిన రూల్‌ కర్వ్‌పై అధ్యయనం చేసి నెలలోగా నివేదిక ఇవ్వాలని ఆరుగురు సభ్యుల కమిటీని బోర్డు ఛైర్మన్‌ ఆదేశించారు. ఆ నివేదిక ఆధారంగా రూల్‌ కర్వ్‌ను ఖరారు చేస్తామన్నారు.

ఆర్డీఎస్‌పై సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌తో అధ్యయనం..
అజెండా అంశాలు ముగిశాక కృష్ణా, తుంగభద్ర బోర్డులు ఉమ్మడిగా సమావేశమయ్యాయి. ఆర్డీఎస్‌ వివాదం పరిష్కారానికి జాయింట్‌ కమిటీ ఇచ్చిన నివేదికపై చర్చించాయి. పుణేలోని సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌ (సెంట్రల్‌ వాటర్‌ అండ్‌ పవర్‌ రీసెర్చ్‌ స్టేషన్‌)తో అధ్యయనం నిర్వహించి నివేదిక ఆధారంగా ఆర్డీఎస్‌ వివాదం పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని 2 బోర్డులు నిర్ణయించాయి. 

మరిన్ని వార్తలు