పోషకాల్లో మునగండి

15 Dec, 2022 04:10 IST|Sakshi

2 లక్షల ఉపాధి హామీ కూలీలకు మునగ మొక్కల పంపిణీ

వచ్చే ఆర్థిక ఏడాది మరో లక్ష కుటుంబాలకు అందజేత

పౌష్టికాహారం, క్యాన్సర్‌ నివారణలో మునగ ప్రాధాన్యతపై కూలీలకు అవగాహన

సాక్షి, అమరావతి: క్యాన్సర్‌ నివారణతో పాటు అత్యధిక పోషకాలుండే మునగ చెట్లను ఉపాధి హామీ పథకం కూలీల ఇళ్లు, పొలాల్లో సాగు చేసుకునేందుకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందజేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 2 లక్షల మంది ఉపాధి హామీ కూలీలకు ఐదేసి మొక్కల చొప్పున పంపిణీకి గ్రామీణాభివృద్ధి శాఖ నిర్ణయించింది.

వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరో 2 వేల ఎకరాలలో కూలీలు మునగ పంటను సాగు చేసుకోవడానికి ఆర్థిక సహాయం అందజేసేందుకు ప్రణాళికలు రూపొందించింది. మునగ చెట్లు, ఆకుల వల్ల కలిగే ప్రయో­జనాలను మొక్కల పంపిణీ సమయంలోనే కూలీలకు అవగాహన కల్పిస్తామని గ్రామీ­ణాభివృద్ధి శాఖ అధికారులు వెల్లడించారు. కాగా, కూలీలకు పంపిణీ చేసే మునగ మొక్క­లను గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలోనే ఉపాధి  నిధులతో ఏర్పాటు చేసిన నర్సరీలలో ఉత్పత్తి చేస్తున్నారు.

ఈ సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా 177 నర్సరీలలో ఇప్పటికే మునగ మొక్కల పెంపకం చేపట్టగా.. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 250 నర్సరీలలో మునగ మొక్కల్ని ఉత్పత్తి చేయనున్నారు. కూలీలు తమకు ఉండే కొద్దిపాటి వ్యవసాయ భూముల్లో మునగ పంట సాగు చేసుకోవడానికి ముందుకొస్తే రెండేళ్లలో ఎకరానికి రూ.85 వేల వరకు  చెల్లిస్తారు.  

మరిన్ని వార్తలు