20 నుంచి వేరుశనగ విత్తనాల పంపిణీ

17 May, 2022 05:34 IST|Sakshi

ఆర్బీకేల ద్వారా రైతులకు 3.95 లక్షల క్వింటాళ్ల విత్తనాలు 

40 శాతం సబ్సిడీ పోను కిలో రూ.51.48కి.. 

ఖరీఫ్‌ సాగు లక్ష్యం 18.40 లక్షల ఎకరాలు

లక్ష్యానికి మించి సాగయ్యే అవకాశం

గతేడాది 3.56 లక్షల క్వింటాళ్ల విత్తనాల పంపిణీ

సాక్షి, అమరావతి: ఖరీఫ్‌ సీజన్‌ కోసం నాణ్యమైన, ధ్రువీకరించిన వేరుశనగ విత్తనాలను ఈ నెల 20వ తేదీ నుంచి రైతుభరోసా కేంద్రాల (ఆర్బీకేల) ద్వారా పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. కె–6, నారాయణి, కదిరి లేపాక్షి (కె–1812) రకాల విత్తనాలను 40 శాతం సబ్సిడీ పోను కిలో రూ.51.48కి రైతులకు ఇచ్చేందుకు సిద్ధం చేసింది. గత సీజన్‌లో మాదిరిగానే ఈ విత్తనాల్లో మూడోవంతును సొంతంగా అభివృద్ధి చేసిన వాటినే పంపిణీ చేయనుంది.

ఖరీఫ్‌లో వేరుశనగ సాధారణ సాగువిస్తీర్ణం 17.90 లక్షల ఎకరాలు కాగా గతేడాది 18.50 లక్షల ఎకరాల్లో సాగైంది. 5.40 లక్షల టన్నుల దిగుబడులొచ్చాయి. వేరుశనగ కనీస మద్దతు ధర రూ.5,550 కాగా గతేడాది రూ.6,500 వరకు పలికింది. ఈ ఏడాది రూ.6,800 నుంచి రూ.7 వేల వరకు పలుకుతోంది.

ఈ ఏడాది సాగు లక్ష్యం 18.40 లక్షల ఎకరాలు కాగా, మార్కెట్‌లో ఎమ్మెస్పీకి మించి ధర లభిస్తుండడంతో ఈసారి కూడా లక్ష్యానికి మించే సాగయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. రాయలసీమతో పాటు రాష్ట్రవ్యాప్తంగా రైతులు వరికి ప్రత్యామ్నాయంగా అపరాలు, చిరుధాన్యాలతో పాటు వేరుశనగ సాగుపై ఆసక్తి చూపిస్తున్నారు.

సర్టిఫై చేసిన సొంత విత్తనం
సబ్సిడీ విత్తనం కోసం గతంలో పూర్తిగా ప్రైవేటు కంపెనీలపైనే ఆధారపడే వాళ్లు. కంపెనీలు ఏ విత్తనం ఇస్తే దాన్నే సబ్సిడీపై పంపిణీ చేయాల్సి వచ్చేది. ఈ పరిస్థితికి చెక్‌ పెడుతూ కనీసం మూడోవంతు విత్తనమైనా సొంతంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో గత సీజన్‌ నుంచి సొంత విత్తన  తయారీకి శ్రీకారం చుట్టారు. రబీ 2020–21లో ఉత్పత్తి చేసిన విత్తనాన్ని రైతుల నుంచి కొనుగోలు చేసి, ఆ తర్వాత సర్టిఫై చేసి ఖరీఫ్‌–2021లో పంపిణీ చేశారు.

గడిచిన రబీ 2021–22లో ఉత్పత్తి చేసిన విత్తనాన్ని అగ్రి టెస్టింగ్‌ ల్యాబ్‌లలో సర్టిఫై చేసి ఖరీఫ్‌ సీజన్‌ కోసం సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం పంపిణీ చేయనున్న 3,95,761 క్వింటాళ్ల విత్తనాల్లో.. లక్ష క్వింటాళ్లు రబీలో రైతులు ఉత్పత్తి చేసినవే. టెండర్ల ద్వారా ప్రైవేటు కంపెనీల నుంచి సమీకరించే మిగిలిన విత్తనాన్ని సైతం ర్యాండమ్‌గా అగ్రి ల్యాబ్స్‌లో సర్టిఫై చేసిన తర్వాతే ఆర్బీకేల ద్వారా పంపిణీ చేయనున్నారు. ఈనెల 20వ తేదీ నుంచి ఆర్బీకేల్లో రిజిస్ట్రేషన్లు ప్రారంభిస్తారు. అదేరోజు నుంచి కిలో రూ.85.80 ధర ఉన్న విత్తనాలను 40 శాతం సబ్సిడీ పోను రూ.51.48కి రైతులకు పంపిణీ చేయనున్నారు.

రైతుకు నాణ్యమైన విత్తనం
విత్తనోత్పత్తి చేసే రైతు నుంచి నేరుగా విత్తనాలు సేకరిస్తున్నాం. ప్రతి పైసా వారి ఖాతాకే జమచేస్తున్నాం. ఈ విధానం వల్ల విత్తనోత్పత్తి చేసే రైతుకు గిట్టుబాటు ధర లభించడంతో పాటు సాగుచేసే రైతుకు నాణ్యమైన విత్తనం దొరుకుతుంది. ప్రైవేటు కంపెనీలు తక్కువ ధరకు నాణ్యమైన విత్తనం అందించేందుకు పోటీపడుతున్నాయి. సర్టిఫై చేసిన విత్తనాన్ని ఈ నెల 20వ తేదీ నుంచి ఆర్బీకేల ద్వారా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశాం.
– డాక్టర్‌ గెడ్డం శేఖర్‌బాబు, ఎండీ, ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ 

మరిన్ని వార్తలు