సెలవైనా.. ఠంచన్‌గా పింఛన్‌!

2 Mar, 2022 03:50 IST|Sakshi
ఒంగోలు బాలాజీనగర్‌లో వెంకాయమ్మకు పింఛన్‌ అందజేస్తున్న వలంటీర్‌ రాజేంద్ర

తొలిరోజు సగం మందికి పింఛన్ల అందజేత

30.67 లక్షల మందికి రూ.779.15 కోట్లు పంపిణీ 

విజయనగరం జిల్లాలో అత్యధికంగా 78 శాతం పంపిణీ 

సాక్షి, అమరావతి/సాక్షి, నెట్‌వర్క్‌: మహాశివరాత్రి పండుగ రోజున కూడా రాష్ట్రంలో సగంమందికి ఠంచన్‌గా పింఛన్‌ డబ్బులు చేరాయి. వలంటీర్లు తమ ఇంటిలో పండుగను కూడా పక్కన పెట్టి తెల్లవారుజామునుంచే లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్‌ సొమ్మును అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా 61,25,228 మంది పింఛన్‌ లబ్ధిదారులు ఉండగా వీరికి ఫిబ్రవరి నెలకు సంబంధించి ప్రభుత్వం రూ.1,557.06 కోట్లను విడుదల చేసింది. పండుగ, సెలవు రోజైనా 30,67,436 మంది అవ్వాతాతలు, వితంతు, దివ్యాంగులతో పాటు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు వలంటీర్లు మంగళవారం పింఛన్‌ డబ్బులు అందజేశారు. దీంతో రూ.779.15 కోట్లు లబ్ధిదారుల చేతికి చేరాయి.

రాష్ట్రవ్యాప్తంగా 50.08 శాతం మంది లబ్ధిదారులకు పంపిణీ పూర్తి కాగా, మరో 4 రోజులు కూడా వలంటీర్ల ఆధ్వర్యంలో పింఛన్ల పంపిణీ కొనసాగుతుందని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) అధికారులు తెలిపారు. విజయనగరం జిల్లాలో అత్యధికంగా 78 శాతం పింఛన్‌ల పంపిణీ పూర్తి అయ్యింది. నెల్లూరు, విశాఖ, కృష్ణా, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి, చిత్తూరు జిల్లాల్లో 50 శాతానికి పైనే పంపిణీ పూర్తయినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన జిల్లాల్లో కూడా పింఛన్‌ల పంపిణీ వేగంగా సాగుతోంది.   

శభాష్‌ వలంటీర్స్‌...
పండుగ పూట కూడా విధులకు ప్రాధాన్యతనిస్తూ రాష్ట్రవ్యాప్తంగా వలంటీర్లు లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. వైఎస్సార్‌ జిల్లా చింతకొమ్మదిన్నె మండలం బుసిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీకి చెందిన గ్రామ వలంటీర్‌ డీవీ సుబ్బారెడ్డికి ఇటీవల ప్రమాదవశాత్తు కాలు విరిగింది. మంగళవారం 1వ తేదీ కావడంతో పింఛన్‌ లబ్ధిదారులు ఇబ్బందులకు గురికాకూడదనే ఉద్దేశంతో నడవలేని స్థితిలో ఉన్నప్పటికీ ఓ ఆటోను అద్దెకు తీసుకుని ప్రతి ఇంటికి వెళ్లి తెల్లవారుజామునే పింఛన్‌ అందించాడు. తిరుపతి స్విమ్స్‌లో చికిత్స పొందుతున్న శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వల్లివేడు గ్రామానికి చెందిన కోటపాటి చంద్రయ్యకు వలంటీర్‌ సుభాషిణి తన సొంత ఖర్చులతో 55 కి.మీ. దూరం వెళ్లి పింఛన్‌ అందజేసింది.

వైఎస్సార్‌ జిల్లా దువ్వూరు మండలం ఎర్రబల్లె గ్రామానికి చెందిన దివ్యాంగుడు బంకు సంధాన్‌ తిరుపతిలో మోకాళ్ల ఆపరేషన్‌ చేయించుకుని చికిత్స పొందుతున్నాడు. వలంటీర్‌ నాగూర్‌బాషా మంగళవారం తిరుపతికి వెళ్లి ఆసుపత్రిలో ఉన్న సంధాన్‌కు పింఛన్‌ అందించాడు. చిత్తూరు జిల్లాలోని చిత్తూరుకండ్రిగకు చెందిన సుబ్రహ్మణ్యం, కృష్ణవేణి, రాజమ్మలు తిరుపతి బర్డ్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వలంటీర్‌ కుసుమ తన పరిధిలో ఉన్న లబ్ధిదారులకు వైఎస్సార్‌ పెన్షన్‌ కానుకను మంగళవారం ఉదయం 7 గంటలకే అందజేసి అనంతరం తిరుపతి బర్డ్‌ ఆసుపత్రికి చేరుకొని అక్కడ కృష్ణవేణి, రాజమ్మ, సుబ్రమణ్యంలకు 10 గంటలకు పింఛను అందజేసింది.

అటు పెళ్లి వేడుక.. ఇటు పింఛన్ల పంపిణీ
వివాహమైన మర్నాడే రిసెప్షన్‌లో బిజీగా ఉండీ కూడా తన బాధ్యత మరువలేదు ఆ వలంటీర్‌. కృష్ణా జిల్లా గన్నవరం గ్రామ సచివాలయం–2లో పనిచేస్తున్న గ్రామ వలంటీర్‌ తిరివీధుల బాలగంగాధర్‌కు సోమవారం వివాహమైంది. ఇంటి నిండా బంధుమిత్రులతో సందడిగా ఉన్నప్పటికీ మంగళవారం నవ దంపతులిద్దరూ కలిసి ఇంటింటికీ వెళ్లి పింఛన్లు అందించారు.  

మరిన్ని వార్తలు