54.96 లక్షల మందికి పింఛన్ల పంపిణీ

2 Jul, 2021 03:28 IST|Sakshi
కడప రవీంద్రనగర్‌లో డయాలసిస్‌ పేషెంట్‌ డోర్కాకు రూ.10వేలు పింఛన్‌ అందిస్తున్న వలంటీర్‌ రీతు

తొలిరోజే రూ.1,325.72 కోట్లు లబ్ధిదారులకు అందజేత

లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లి పంపిణీ చేసిన వలంటీర్లు 

రాత్రి 7 గంటలకు 90.17% మందికి పెన్షన్లు.. నేడు, రేపు కొనసాగనున్న పంపిణీ

మొత్తం 60.96 లక్షల మందికి పింఛన్ల కోసం రూ.1,485.12 కోట్లు విడుదల

సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక కింద గురువారం పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. గ్రామ, వార్డు వలంటీర్లు కరోనా జాగ్రత్తలను పాటిస్తూ తెల్లవారుజాము నుంచే లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛను సొమ్ము అందించారు. మొత్తం 60,96,369 మంది పెన్షనర్లకుగాను గురువారం రాత్రి 7 గంటల సమయానికి 54,96,924 మందికి (90.17 శాతం) పింఛన్లు అందించారు. జూన్‌ నెలకు సంబంధించి జూలైలో చెల్లించాల్సిన పింఛన్ల కోసం ప్రభుత్వం రూ.1,485.12 కోట్లు విడుదల చేయగా తొలిరోజు దాదాపు రూ.1,325.72 కోట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం శుక్ర, శనివారాల్లో కూడా కొనసాగనుంది.

సామాజిక పెన్షన్లు, వైద్య పెన్షన్లను ప్రతినెల 1వ తేదీనే లబ్ధిదారుల ఇంటికి వెళ్లి వారిచేతికే అందించాలన్న సీఎం జగన్‌ సంకల్పంతో సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ ద్వారా పెన్షన్ల పంపిణీ కొనసాగుతోంది. 2.66 లక్షలమంది వలంటీర్లు, 15 వేలమంది వెల్ఫేర్, ఎడ్యుకేషన్‌ అసిస్టెంట్లు, వార్డు వెల్ఫేర్‌ డెవలప్‌మెంట్‌ సెక్రటరీలు పెన్షన్ల పంపిణీలో భాగస్వాములయ్యారు. లబ్ధిదారులకు పెన్షన్‌ అందచేసే సమయంలో గుర్తింపు కోసం బయోమెట్రిక్, ఐరిస్‌ విధానాలతో పాటు ఆర్‌బీఐఎస్‌ విధానాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ రెండు విధానాల్లో పెన్షనర్ల గుర్తింపు సాధ్యం కాకపోతే అంతకుముందే వారి కుటుంబసభ్యులు నమోదు చేయించుకున్న ఆథరైజ్డ్‌ బయోమెట్రిక్‌ను కూడా పరిగణనలోకి తీసుకుని పెన్షన్లను పంపిణీ చేశారు. తొలిరోజే 90.17 శాతం పెన్షన్లను పంపిణీ చేసిన వలంటీర్లను రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అభినందించారు. 

పెళ్ళైన 48 గంటల్లోనే విధుల్లో వలంటీర్‌
వైఎస్సార్‌ జిల్లా కేంద్రం కడపలోని 27వ డివిజన్‌ గౌస్‌నగర్‌–2 సచివాలయానికి చెందిన వలంటీర్‌ షేక్‌ సబ్జావలీకి జూన్‌ 29న వివాహం జరిగింది. పెళ్ళైన రెండోరోజే గురువారం ఆయన పింఛన్లు పంపిణీ చేశారు. పెళ్లయిన రెండోరోజే వచ్చి తమకు పింఛను ఇచ్చిన ఆయన్ని వృద్ధులు, వితంతువులు, వికలాంగులు అభినందించారు.
– కడప కార్పొరేషన్‌

కోవిడ్‌ రోగికి పింఛను
శ్రీకాళహస్తి 29వ వార్డు వలంటీరు దివ్య.. స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో కరోనాతో చికిత్స పొందుతున్న దొరస్వామి కృష్ణమూర్తి (72)కి పింఛను అందజేశారు. సంబంధీకులే దగ్గరకు వెళ్లడానికి సంకోచిస్తున్న సమయంలో వలంటీరు కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ తనకు పింఛను సొమ్ము ఇవ్వడంతో కృష్ణమూర్తి భావోద్వేగానికి గురయ్యారు. ఆమెకు ధన్యవాదాలు తెలిపారు.
– శ్రీకాళహస్తి

>
మరిన్ని వార్తలు