58 లక్షల మందికి పింఛన్ల పంపిణీ పూర్తి

3 Jun, 2021 04:59 IST|Sakshi
వృద్ధురాలికి పింఛను అందిస్తున్న మహేశ్వరరావు

 94.38 శాతం మంది లబ్ధిదారులకు చేరిన డబ్బులు 

సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా రెండో రోజు వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. ఈ నెలలో రాష్ట్ర వ్యాప్తంగా 61.46 లక్షల మంది పింఛనుదారులకు ప్రభుత్వం రూ.1,497.62 కోట్ల నిధులను విడుదల చేయగా.. బుధవారం రాత్రి వరకు 58,01,978 మందికి రూ.1,398.77 కోట్ల మొత్తాన్ని వలంటీర్లు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. 94.38 శాతం మందికి పంపిణీ పూర్తి అయింది. గురువారం కూడా వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పింఛన్లు అందించే కార్యక్రమం కొనసాగుతుందని సెర్ప్‌ సీఈవో రాజాబాబు తెలిపారు. 

నగరం నుంచి మన్యం వెళ్లి పింఛను..
సాక్షి, విశాఖపట్నం: నగరంలో అందుబాటులో లేక మూడు నెలలుగా పింఛన్‌ తీసుకోలేకపోయిన వృద్ధురాలికి సచివాలయ ఉద్యోగి వెళ్లి పింఛను అందించాడు. జీవీఎంసీ పరిధిలోని జోన్‌–8లోని పాపయ్యరాజపాలెం–3 సచివాలయంలో వార్డు వెల్ఫేర్‌ డెవలప్‌మెంట్‌ సెక్రటరీగా బొడ్డు కనక మహేశ్వరరావు విధులు నిర్వర్తిస్తున్నాడు. తన సచివాలయ పరిధిలోని చినముషిడివాడలో తంగుల బుల్లమ్మ (84) మూడు నెలలుగా పింఛను తీసుకోవడం లేదు. ప్రతి నెలా ఆమెకు ఫోన్‌ చేసి పింఛన్‌ తీసుకోవాలని చెప్పేవాడు. అయితే, లాక్‌డౌన్‌ కారణంగా సొంతూరైన విశాఖ జిల్లా మన్యంలోని డుంబ్రిగుడ మండలం లైగొండ గ్రామానికి వెళ్లిపోయామని, పింఛన్‌ తీసుకోవడానికి రాలేకపోతున్నానని వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేసింది. రెండు నెలల పాటు వేచి చూసిన వార్డు వెల్ఫేర్‌ డెవలప్‌మెంట్‌ సెక్రటరీ.. బుధవారం ఉదయం 5 గంటలకు విశాఖ నుంచి బైక్‌పై 140 కిలోమీటర్ల దూరంలో ఉన్న లైగొండ గ్రామానికి వెళ్లి బుల్లమ్మకు మూడు నెలల పింఛన్‌ డబ్బులు రూ.6,750 అందించాడు. దీంతో ఆమె భావోద్వేగానికి గురైంది. కూలిపనులు లేక.. ఇబ్బందులు పడుతున్న తమ కుటుంబానికి పింఛన్‌ డబ్బులు అందించినందుకు మహేశ్వరరావును ఆశీర్వదించి అభినందించింది. 

మరిన్ని వార్తలు