విపత్తు వేళా ఠంచనుగా పింఛన్‌

2 May, 2021 04:03 IST|Sakshi
ఏలూరులో మంచం పైనుంచి లేవలేని దాలమ్మకు పింఛన్‌ అందిస్తున్న వలంటీర్‌ వీఎల్‌ శ్రీదేవి

కరోనా కల్లోలంలోనూ ఒకే రోజున 54.13 లక్షల మందికి పింఛన్ల పంపిణీ

సాక్షి, అమరావతి: కరోనా విపత్తు వేళలోనూ శనివారం రాష్ట్ర వ్యాప్తంగా 54,13,004 మంది లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా పింఛన్ల పంపిణీ పూర్తి చేసింది. ఎక్కడా నలుగురైదుగురు గుమిగూడే పరిస్థితి రానివ్వకుండా కచ్చితమైన జాగ్రత్తలు చేపట్టింది. శనివారం మే డే సెలవు రోజు అయినప్పటికీ వలంటీర్లు తెల్లవారుజాము నుంచే లబ్ధిదారుల ఇళ్లకే పింఛన్‌ డబ్బులు పంపిణీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 88.07 శాతం మంది లబ్ధిదారులకు రూ.1,296.10 కోట్లను నగదు రూపంలో అందజేశారు. మొత్తం 61.45 లక్షల మందికి మే 1న పింఛన్‌ అందించేందుకు రూ.1,483.68 కోట్లను ప్రభుత్వం శుక్రవారం సాయంత్రానికి అన్ని గ్రామ, వార్డు సచివాలయాల కార్యదర్శుల ఖాతాల్లో జమ చేసింది. కృష్ణా, చిత్తూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కొన్ని బ్యాంకుల నుంచి నగదు విత్‌ డ్రా చేయడంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. మే డే సెలవు రోజు అయినా ఉన్నతాధికారుల ఆదేశం మేరకు శనివారం ఆయా బ్యాంకుల్ని తెరిచి పింఛనుదారుల డబ్బులు సచివాలయ కార్యదర్శుల ద్వారా వలంటీర్లకు చేరేందుకు సహకరించినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. కృష్ణా, చిత్తూరు జిల్లాల్లో పలుచోట్ల, పశ్చిమ గోదావరి జిల్లాలో నామమాత్రంగా కొన్నిచోట్ల పింఛన్ల పంపిణీ కార్యక్రమం కాస్త మందగించినట్టు తెలిపారు. ఆది, సోమవారాల్లో కూడా లబ్ధిదారుల ఇంటికే వెళ్లి వలంటీర్లు పింఛన్‌ పంపిణీ చేస్తారని సెర్ప్‌ అధికారులు వెల్లడించారు. 

ప్రసవించే వేళా.. మది నిండా ఆశయమే
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నగరానికి చెందిన ఈ వలంటీర్‌ పేరు ఎం.హరిణి. 9 నెలల నిండు గర్భిణి. రేపో మాపో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతోంది. బయటకొస్తే కరోనా భయం వెంటాడుతోంది. ఇలాంటి సమయంలో ఏ గర్భిణి అయినా విశ్రాంతి తీసుకోవాలి. కానీ.. హరిణికి మాత్రం మది నిండా జగనన్న ఆశయమే నిండిపోయింది. ఎట్టి పరిస్థితుల్లోనూ జగనన్న ఆశయానికి విఘాతం కలుగకూడదన్న సంకల్పంతో అవ్వా తాతలకు ఒకటో తేదీనే పింఛన్‌ అందించేందుకు వేకువజామునే విధుల్లోకి వచ్చింది. పెద్దల పైడమ్మ అనే వృద్ధురాలికి పింఛన్‌ పంపిణీ చేస్తుండగా తీసిన చిత్రమిది.

నువ్వు బంగారమయ్యా
పింఛన్‌ సొమ్ము తీసుకుంటూ మురిసిపోతున్న ఈ అవ్వ పేరు జి.వెంకట సుబ్బమ్మ. కడప వైఎస్‌ నగర్‌లో నివసిస్తోంది. ఉదయాన్నే ఆ ప్రాంత వలంటీర్‌ భారతి వెళ్లి వృద్ధాప్య పింఛన్‌ నగదు అందజేయగా.. వెంకట సుబ్బమ్మ మురిసిపోయింది. ‘ప్రతి నెలా ఒకటో తేదీనే పింఛన్‌ వస్తోంది. జగనయ్యా.. నువ్వు బంగారమయ్యా’ అంటూ చిరునవ్వులు చిందించింది.

రాదనుకుని వదిలేసినా.. పింఛనొచ్చింది
అచ్చంపేట (పెదకూరపాడు): ఎన్నోసార్లు పింఛన్‌ కోసం దరఖాస్తు చేసుకున్నా మంజూరుకాక విసిగిపోయిన 80 ఏళ్ల నిరుపేద వృద్ధురాలికి ఎట్టకేలకు గ్రామ వలంటీర్‌ చొరవతో పింఛన్‌ మంజూరైంది. గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం కొండూరు గ్రామానికి చెందిన గణపవరపు లక్ష్మమ్మకు వెనకాముందూ ఎవరూ లేరు. వృద్ధాప్య పింఛన్‌ కోసం ఏళ్ల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగినా ఆమె మొర ఎవరూ ఆలకించలేదు. ఆమె స్థితిగతుల్ని గుర్తించిన గ్రామ వలంటీర్‌ శివకుమార్‌ పింఛన్‌ మంజూరు చేయించాడు. శనివారం ఆమె ఇంటికి వెళ్లి ఈ నెల పింఛన్‌ రూ.2,250 అందించగా.. ఆమె ఆనందానికి అవధుల్లేవు. గ్రామ వలంటీర్‌ వ్యవస్థను ఏర్పాటు చేసి, తనలాంటి వారిని గుర్తించి న్యాయం చేసినందుకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి లక్ష్మమ్మ కృతజ్ఞతలు తెలిపారు. 

>
మరిన్ని వార్తలు