93.24 శాతం మందికి పింఛన్ల పంపిణీ

2 Sep, 2020 04:32 IST|Sakshi
ఏలూరు బీడీ కాలనీలో శ్రవణం పార్వతమ్మకు ఫింఛన్‌ అందజేస్తున్న వలంటీర్‌ సమరున్నీసా

ఐదారు నెలలుగా తీసుకోని వారికీ బకాయిలతో సహా అందజేత 

లబ్ధిదారుల చేతికి మొత్తం రూ.1,379.81 కోట్లు

తొలిరోజు అందుకున్న వారు 57,51,413 మంది

సాక్షి, అమరావతి/సాక్షి, నెట్‌వర్క్‌: రాష్ట్రవ్యాప్తంగా సెప్టెంబర్‌ నెలకు సంబంధించిన పెన్షన్లను మంగళవారం 57,51,413 మందికి పంపిణీ చేశారు. కరోనా, లాక్‌డౌన్‌ తదితర కారణాలతో గత ఐదారు నెలలుగా పింఛన్లు తీసుకోలేకపోయిన అవ్వాతాతలకు బకాయిలను కూడా ఈ నెల పింఛన్లతో కలిపి ప్రభుత్వం పంపిణీ చేసింది. ఇలా మొత్తం రూ.1,379.81 కోట్లను వలంటీర్లు లబ్ధిదారుల వద్దకే వెళ్లి అందజేశారు. తొలిరోజు సెప్టెంబర్‌ ఒకటవ తేదీనే 93.24 శాతం పంపిణీ జరిగినట్లు అధికారులు వెల్లడించారు. కాగా, ఈనెల పెద్ద సంఖ్యలో కొత్త పింఛన్లు మంజూరు.. ఐదారు నెలల పాటు పింఛన్లు తీసుకోని వారికి  బకాయిలన్నింటినీ కలిపి ఇవ్వాల్సి రావడంతో పారదర్శకత కోసం మళ్లీ బయో మెట్రిక్‌ విధానంలో పింఛన్ల పంపిణీ చేపట్టారు. కరోనా వైరస్‌ సోకకుండా ఉండేందుకు వలంటీర్లు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక చిత్తూరు, విజయనగరం, వైఎస్సార్‌ జిల్లాల్లో 94 శాతానికి పైగా పంపిణీ పూర్తవగా, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో దాదాపు 85 శాతం పంపిణీ జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఇక జిల్లాల్లో పలుచోట్ల ప్రభుత్వ చిత్తశుద్ధికి అద్దంపట్టే పలు సంఘటనలు చోటుచేసుకున్నాయి. అవి..

► విశాఖ జిల్లా తామరబ్బ పంచాయతీ పరిధిలోని గిరిజన ప్రాంతాల్లో సెల్‌సిగ్నల్స్‌ సరిగ్గా లేకపోవడంతో వలంటీర్‌ సింహాచలం, పంచాయతీ వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ రాజా ఒకటో తారీఖునే పింఛన్లు ఇవ్వాలన్న లక్ష్యంతో బండరాళ్లపై సిగ్నళ్ల కోసం నిరీక్షించి మరీ పెన్షన్లను అందజేశారు.
► చిత్తూరు జిల్లా పిచ్చాటూరు గాంధీనగర్‌కు చెందిన వలంటీర్‌ వాణిశ్రీ సోమవారమే పెళ్లి చేసుకున్నప్పటికీ మంగళవారం తనే పెన్షన్లు పంపిణీ చేస్తానంటూ ముందుకు వచ్చి వేకువజాము నుంచే పింఛన్లు అందజేసి అందరి మన్ననలు అందుకున్నారు.
► కర్నూలు జిల్లా మడుతూరు మండల కేంద్రంలో వలంటీర్‌గా పనిచేస్తున్న సులోచనమ్మ.. తన తల్లి మాణిక్యమ్మ (55) సోమవారం సాయంత్రం మరణించినప్పటికీ తన పరిధిలోని లబ్ధిదారులకు ఠంచన్‌గా పింఛన్‌ పంపిణీ చేసి ఆ తర్వాత అంత్యక్రియలకు వెళ్లారు.

ఇంతకన్నా పేదోళ్లకి ఇంకేం కావాలి
60ఏళ్లు నిండిన నాకు అర్హత పొందిన 15 రోజుల్లోనే వృద్ధాప్య పెన్షన్‌ పొందగలగడం జగనన్న దయగా భావిస్తున్నాను. జగన్‌ సీఎం అయ్యాక పేదలకు ఎటువంటి కష్టం లేకుండానే నేరుగా ఇంటికి వచ్చి పెన్షన్‌ అందజేశారు. ఇంతకంటే పేదవాడికి ఏం కావాలి. పెన్షన్‌ మంజూరు చేసిన జగనన్నకు కృతజ్ఞతలు.
– రేకాడి వీరభద్రరావు, జగన్నాథపురం, కాకినాడ

నాకిక పింఛను రాదేమో అనుకున్నా 
90ఏళ్ల వయస్సున్న నేను గత ఆరేళ్లుగా వృద్ధాప్య పించను కోసం అర్జీలిస్తూనే ఉన్నా. కానీ, మంజూరు కాలే. ఇప్పుడు వలంటీరు రాసుకొనిపోయిన నెలకే పింఛను అందింది. చాలా ఆనందంగా ఉంది. సీఎం జగన్, స్థానిక ఎమ్మెల్యే వెంకటేగౌడ చల్లగా ఉండాలయ్యా. 
– జులేఖాబీ, పలమనేరు, చిత్తూరు జిల్లా

మరిన్ని వార్తలు