ఒకటో తేదీనే 94.94% మందికి పింఛన్లు

2 Nov, 2020 01:52 IST|Sakshi
అనారోగ్యంతో తిరుపతి రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కె.లక్ష్మికి వితంతు పింఛన్‌ అందిస్తున్న వలంటీర్‌

లబ్ధిదారులకు ఇళ్ల వద్దే రూ.1,416 కోట్లు అందజేసిన వలంటీర్లు

58.80 లక్షల మందికి చేరిన పింఛన్‌ సొమ్ము

12,892 మందికి పోర్టబులిటీ విధానంలో అందజేత

సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా నవంబర్‌ నెలకు సంబంధించిన పింఛన్ల పంపిణీ తొలిరోజే 94 శాతానికి పైగా పూర్తయ్యింది. అవ్వాతాతలు ఎలాంటి ఇబ్బంది పడకుండా ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా ఒకటో తేదీనే తమ పింఛన్‌ డబ్బులు అందుకున్నారు. వలంటీర్లు లబ్దిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి వాటిని అందజేశారు. ఆదివారం సాయంత్రానికి మొత్తం 58,80,605(94.94శాతం) మందికి రూ.1,416.34 కోట్లు పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు. గత మూడు, నాలుగు నెలలుగా వివిధ కారణాలతో పింఛన్లు తీసుకోలేకపోయిన వారికి పాత బకాయిలు కూడా కలిపి అందించారు.

1,80,862 మందికి రెండు నెలల డబ్బులు, 26,385 మందికి 3 నెలల డబ్బులు, 179 మందికి నాలుగు అంతకంటే ఎక్కువ నెలలకు సంబంధించిన పాత బకాయిలను ఈనెల పింఛన్‌తో కలిపి ఇచ్చారు. 12,892 మంది పోర్టబులిటీ విధానాన్ని ఉపయోగించుకున్నారు. అందులో 6,907 మంది సొంత జిల్లాలోనే వేరొక చోట ఉండి పింఛన్‌ డబ్బులు పొందగా, 5,985 మంది వేరే జిల్లాల్లో తీసుకున్నారు.   

మరిన్ని వార్తలు