రెండో రోజూ పింఛన్ల పంపిణీ

3 May, 2021 04:39 IST|Sakshi
శివరామకృష్ణకు పింఛన్‌ సొమ్ము అందజేస్తున్న వలంటీర్‌ హేమలత

రాష్ట్రవ్యాప్తంగా 91.72 శాతం మందికి పెన్షన్ల అందజేత

సాక్షి, అమరావతి: సెలవు రోజైన ఆదివారం కూడా రాష్ట్రంలో పింఛన్ల పంపిణీ కొనసాగింది. రెండు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 56,36,746 మంది లబ్ధిదారులకు రూ.1,350 కోట్ల నగదును వలంటీర్ల ద్వారా ప్రభుత్వం పంపిణీ చేసింది. 91.72 శాతం మందికి పంపిణీ పూర్తయిందని, సోమవారం కూడా పంపిణీ కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. 

వలంటీర్‌ కాదు.. వారియర్‌
మంగళగిరి: కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తున్న వేళ గ్రామ/వార్డు వలంటీర్లు వారియర్లుగా మారి ప్రభుత్వ పథకాలను పేదల చెంతకు చేరుస్తున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి పట్టణ పరిధిలోని చినకాకానికి చెందిన చాగర్లమూడి శివరామకృష్ణయ్య అనే వృద్ధుడు కరోనా బారినపడి మంగళగిరిలోని ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రెండు నెలలుగా అతడు వృద్ధాప్య పింఛన్‌ తీసుకోవడం లేదు. ఈ నెల కూడా తీసుకోకపోతే నిబంధనల ప్రకారం ఆయనకు పింఛన్‌ నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ ప్రమాదాన్ని గుర్తించిన ఆ ప్రాంత వలంటీర్‌ ఆర్‌.హేమలత ప్రాణాలకు తెగించి మరీ ఆస్పత్రిలోని కోవిడ్‌ వార్డులోకి నేరుగా వెళ్లి శివరామకృష్ణయ్య పింఛన్‌ అందజేసింది. ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకం తనకు చికిత్స చేయించడంతోపాటు ప్రస్తుత విపత్కర పరిస్థితిలో నేరుగా తన వద్దకు వలంటీర్‌ను పంపించి పింఛను నగదు అందజేసిందని శివరామకృష్ణయ్య చెప్పారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వలంటీర్‌ వ్యవస్థ ప్రజలకు ఈ స్థాయిలో సేవలందించడం అభినందనీయమని కొనియాడారు.

కోవిడ్‌ బాధితుడికి పింఛన్‌ అందజేత
కడియం:  కోవిడ్‌ బారినపడి ఇంటివద్ద చికిత్స పొందుతున్న వృద్ధుడికి ఆదివారం పెన్షన్‌ అందజేశారు తూర్పు గోదావరి జిల్లా కడియం–1 సచివాలయం వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ సూర్యశ్రీనివాస్‌. కోవిడ్‌ రోగులంటే దూరం జరుగుతున్న నేపథ్యంలో వృద్ధుడి అవసరాన్ని, ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని శ్రీనివాస్‌ ఐరిస్‌ విధానం ద్వారా పెన్షన్‌ అందజేశారు. గత నెలలో కూడా ఐసొలేషన్‌లో ఉన్న ఒక వృద్ధురాలికి పెన్షన్‌ అందజేసినట్టు శ్రీనివాస్‌ చెప్పారు. 

మరిన్ని వార్తలు