AP: రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ

4 Apr, 2023 07:42 IST|Sakshi

సోమవారం ఉదయానికే సచివాలయాల ఖాతాల్లో పింఛన్ల డబ్బు జమ

మధ్యాహ్నం నుంచి పంపిణీ ప్రారంభించిన వలంటీర్లు

రాత్రికి కూడా కొనసాగుతున్న పంపిణీ 

మరో నాలుగు రోజులు పంపిణీ

ఈ నెల మొత్తం 63.42 లక్షల మందికి పింఛన్లు

సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా సోమవారం పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది. మార్చి 31వ తేదీతో ఆర్థిక సంవత్సరం ముగింపు, ఆ తర్వాత వరుసగా రెండు రోజులు బ్యాంకులకు సెలవుల కారణంగా ఈ నెలలో పింఛన్ల పంపిణీ మూడో తేదీ నుంచి మొదలు పెట్టనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 63,42,805 మంది అవ్వాతాతలు, వితంతు, దివ్యాంగ, వివిధ చేతివృత్తిదారులు, దీర్ఘకాలిక వ్యా«ధిగ్రస్తులకు పింఛన్ల  పంపిణీ కోసం ప్రభుత్వం రూ. 1747.88 కోట్లను విడుదల చేసింది.

సోమవారం ఉదయం బ్యాంకు తెరిచే సమయానికల్లా ఈ నిధులను ఆయా గ్రామ, వార్డు సచివాలయాల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. ఈ డబ్బును గ్రామ సచివాలయాల సిబ్బంది బ్యాంకుల నుంచి డ్రా చేసి, వలంటీర్లకు అందించారు. అనంతరం మధ్యాహ్నం నుంచి పింఛన్ల పంపిణీ మొదలైనట్టు అధికారులు వెల్లడించారు. పలు చోట్ల సోమవారం రాత్రి పొద్దుపోయాక కూడా వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్‌ డబ్బులు పంపిణీ చేస్తూనే ఉన్నారని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) అధికారులు చెప్పారు. మరో నాలుగు రోజులు పింఛన్ల పంపిణీ కొనసాగుతుందని తెలిపారు. 

మరిన్ని వార్తలు