రైతులకు పట్టా పండుగ.. సంక్రాంతిలోగా సాగు భూమికి పట్టా!

25 Dec, 2022 17:28 IST|Sakshi

చకచకా ఏర్పాట్లు చేస్తున్న రెవెన్యూ యంత్రాంగం

2,090 మంది సాగు రైతులు అర్హులుగా గురింపు

అనంతపురం అర్బన్‌: సంక్రాంతి ప్రత్యేకంగా రైతుల పండుగ. ఈ పండుగకు మరింత శోభ తీసుకువచ్చి రైతుల కుటుంబాల్లో సంతోషం   నింపే దిశగా జగన్‌ సర్కార్‌ అడుగులు వేస్తోంది. జీవనాధారంగా ప్రభుత్వభూమిని ఏళ్లుగా సాగు చేసుకుంటున్న పేద రైతులకు డీ పట్టాలు పంపిణీ చేసి అండగా నిలిచేందుకు సిద్ధమయ్యింది. ప్రభుత్వ భూమిని సాగు చేసుకుంటున్న పేద రైతులకు తరి రెండున్నర ఎకరాలు, మెట్ట ఐదు ఎకరాలకు మించకుండా డీ– పట్టా ఇవ్వనున్నారు. ఇప్పటికే అర్హులైన 2,090 మంది సాగు రైతులు 2,897 ఎకరాలు ప్రభుత్వ భూమిలో సాగు చేస్తున్నట్లు గుర్తించారు. వీరందరికీ సంక్రాంతి పండుగలోగా పట్టాలు పంపిణీ చేసేందుకు అవసరమైన చర్యలు వేగవంతం చేసింది. 

అసైన్‌మెంట్‌ కమిటీ ఆమోదానికి.. 
సాగుభూమికి సంబంధించి రైతులకు పట్టా ఇచ్చేందుకు ప్రత్యేకంగా అసైన్‌మెంట్‌ కమిటీని (ఏసీ) ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి చైర్మన్‌గా జిలా ఇన్‌చార్జి మంత్రి వ్యవహరిస్తారు. మెంబర్‌  కన్వీనర్‌గా జాయింట్‌ కలెక్టర్, ప్రత్యేక ఆహ్వానితులుగా ఎమ్మెల్సీ ఉంటారు. మెంబర్లుగా జిల్లా మంత్రి, ఎమ్మెల్యే, ఆర్డీఓ ఉంటారు. 2023 జనవరిలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి అధ్యక్షతన అసైన్‌మెంట్‌ కమిటీ సమావేశం జరగనున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. కమిటీ ఆమోదం తీసుకుని సంక్రాంతి పండుగలోగా రైతులకు పట్టాలు పంపిణీ చేస్తారు. 

అర్హతలివీ.. 
సాగు చేసుకుంటున్న ప్రభుత్వ భూమి తప్ప రైతుకు ఇతరత్రా పట్టా భూమి ఉండకూడదు.  
సాగు చేసుకుంటున్న భూమిని ఇంతకు ముందుకు ఎవరికీ డీ –పట్టా ఇచ్చి ఉండకూడదు. 
దరఖాస్తులో పొందుపరచిన భూమిలో సదరు రైతు తప్పనిసరిగా సాగు చేసుకుంటూ ఉండాలి. 
అర్హత ఉన్న రైతుకు తరి 2.50 ఎకరాలు లేదా మెట్ట 5 ఎకరాల మించకుండా డీ–పట్టా మంజూరు చేస్తారు. 

ఏ భూములకు పట్టా ఇవ్వరంటే... 
ప్రభుత్వ నిబంధనల ప్రకారం పొరంబోకు భూములు, వాగులు, వంకలు, కొండలు, గుట్టలకు పట్టాలు ఇవ్వరు. వ్యవసాయ యోగ్యమైన భూమిని మాత్రమే అసైన్డ్‌ చేస్తూ డీ – పట్టా ఇస్తారు. ఈ విషయాన్ని రైతులు గమనించాలని రెవెన్యూ  అధికారులు స్పష్టం చేస్తున్నారు.  

సంక్రాంతిలోగా పంపిణీకి చర్యలు 
జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ భూమిని సాగు చేసుకుంటూ నిబంధనల ప్రకారం పట్టా పొందేందుకు అర్హులైన పేద రైతుల గుర్తింపు ప్రక్రియ పూర్తయ్యింది. వచ్చే నెలలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి అధ్యక్షతన అసైన్‌మెంట్‌ కమిటీ సమావేశం ఉంటుంది. కమిటీ ఆమోదం తీసుకుని సంక్రాంతి పండుగలోగా పట్టాల పంపిణీకి  అవసరమైన చర్యలు చేపట్టాం.  
– కేతన్‌గార్గ్, జాయింట్‌ కలెక్టర్‌

మరిన్ని వార్తలు