జియో ట్యాగింగ్‌ బాధ్యత పీడీలదే

24 Feb, 2021 04:24 IST|Sakshi

ఇళ్ల నిర్మాణంపై జిల్లాల వారీగా సమీక్షలు

కలెక్టర్లు, పీడీలతో గృహ నిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శి భేటీ

పారదర్శకంగా తక్కువ ధరకే నాణ్యమైన నిర్మాణ సామగ్రి

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాల పురోగతి, గృహాల జియో ట్యాగింగ్, ఇతర వసతులకు సంబంధించిన పురోగతిపై జిల్లాల వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌ జైన్‌ నిర్ణయించారు. ఇందులో భాగంగానే మొదట కృష్ణాజిల్లాలో గురువారం సమావేశం ఏర్పాటు చేశారు. మిగిలిన 12 జిల్లాలకు చెందిన కలెక్టర్లు, గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్లు, ఇతర అధికారులతో సమీక్షలు నిర్వహించే విషయమై ప్రణాళికను సిద్ధం చేశారు. రాష్ట్రంలో మొదటి దశలో పేదలకు 15.60 లక్షల ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఇందులో ఇప్పటికే 90 శాతానికి పైగా లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలు కూడా పంపిణీ చేశారు. వీటి నిర్మాణాలు వేగవంతం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఇప్పటికే మంజూరు చేసిన ఇళ్లకు సంబంధించిన జియో ట్యాగింగ్‌ను వెంటనే పూర్తిచేయాల్సి ఉంది. ఈ బాధ్యత ప్రాజెక్టు డైరెక్టర్లు (పీడీ) తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా కొత్తగా భారీస్థాయిలో ఏర్పాటవుతున్న వైఎస్సార్‌ జగనన్న కాలనీల్లో కల్పించాల్సిన వసతులపై కలెక్టర్లు పరిశీలించి వివరాలు పంపాలని జిల్లాస్థాయి అధికారులను అజయ్‌ జైన్‌ ఇప్పటికే కోరారు. జియో ట్యాగింగ్‌లో వెనుకబడ్డ జిల్లాల్లో ముందుగా ఈ సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నారు. ఇళ్ల నిర్మాణానికి సంబంధించి క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులు, ఇప్పటివరకు సాధించిన పురోగతి తదితర అంశాలపై క్షుణ్ణంగా చర్చించేందుకు పూర్తి వివరాలతో కూడిన నివేదిక ఇవ్వాలని ఇప్పటికే జిల్లా అధికారులకు సమాచారం పంపారు. 

తక్కువ ధరకే నిర్మాణ సామగ్రి
లబ్ధిదారులు సమ్మతిస్తే ఇంటి నిర్మాణానికి అవసరమైన నాణ్యతతో కూడిన నిర్మాణ సామగ్రిని మార్కెట్‌ ధర కంటే తక్కువ రేట్లకు పంపిణీ చేసే విషయమై ప్రతి ఒక్కరికీ తెలియజేయాలని సమావేశంలో అజయ్‌ జైన్‌ సూచించారు. ఎక్కడా అవినీతికి ఆస్కారం లేకుండా పారదర్శకతకు పెద్దపీట వేస్తూ విడతల వారీగా ఇవ్వనున్న నిర్మాణ సామగ్రి సమాచారం, ఇతర వివరాలను లబ్ధిదారులకు ప్రత్యేకంగా ఇచ్చే పాసుపుస్తకంలో నమోదు చేస్తారు. ప్రతి గ్రామంలో సచివాలయ సిబ్బంది మొబైల్‌ నంబర్లు ఇందులో పొందుపరుస్తారు. గ్రామీణ ప్రాంతాల్లోని లబ్ధిదారులందరికీ ఉపాధి హామీ జాబ్‌ కార్డులు ఇస్తారు. గృహ నిర్మాణ దశల ఆధారంగా జాబ్‌ కార్డున్న ప్రతి లబ్ధిదారునికి 90 రోజుల పని దినములకు సమానమైన వేతనాన్ని చెల్లిస్తారు.  

మరిన్ని వార్తలు