పండుగ సందర్భంగా తిరుమలలో ‘దీపావళి ఆస్థానం’

23 Oct, 2022 08:31 IST|Sakshi

తిరుమల:  తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి పండుగ సందర్భంగా ఈ నెల 24వ తేదీన ‘దీపావళి ఆస్థానం’ టీటీడీ నిర్వహించనుంది. శ్రీమలయప్పస్వామి దేవేరులతో కలిసి ఘంటా మండపంలోని సర్వభూపాల వాహనంలో ప్రత్యేక పూజలు అందుకోనున్నారు. సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు సహస్ర దీపాలంకరణ సేవలో పాల్గొని, మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమివ్వనున్నారు. దీపావళి ఆస్థానం కారణంగా  24న కల్యాణోత్సవం, ఊంజల్‌ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలను టీటీడీ రద్దు చేసింది. తోమాల, అర్చన సేవలు ఏకాంతంగా నిర్వహిస్తారు. 

శ్రీవారి సేవకు లండన్‌ భక్తులు 
లండన్‌లో స్థిరపడిన నీతు అనే భక్తురాలు కేరళలోని తమ కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి శ్రీవారి సేవకు వచ్చారు. నీతు లండన్‌లోని ఒక ప్రముఖ సంస్థలో అధికారిణిగా పనిచేస్తున్నారు. 11 మంది సభ్యుల బృందం నాలుగు రోజులపాటు సేవలు అందించారు. 

శ్రీవారి దర్శనానికి 10 గంటలు 
తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూ కంపార్ట్‌మెంట్లు 28 నిండాయి. శుక్రవారం అర్ధరాత్రి వరకు 62,203 మంది స్వామి వారిని దర్శించుకోగా, 29,100 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీలో కానుకల రూపంలో రూ. 3.91కోట్లు వేశారు. శ్రీవారి దర్శనానికి 10 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి మూడు గంటల సమయం పడుతుంది. 

మరిన్ని వార్తలు