డీకేడబ్ల్యూకు మహర్దశ

23 May, 2022 10:45 IST|Sakshi

నాడు – నేడులో భాగంగా  సదుపాయాల కల్పనకు చర్యలురూ.6.23 కోట్లతో ప్రతిపాదనలు

ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ కింద రూ.1.87 కోట్ల విడుదల

కొత్త భవనం, వెయిటింగ్‌ హాల్, జిమ్‌ నిర్మాణం

టెండర్లు పిలిచిన అధికారులు

నెల్లూరులోని డీకేడబ్ల్యూ కళాశాల.. దీనికి ఎంతో చరిత్ర ఉంది. ఇక్కడ చదివి ఉన్నత స్థాయిలో ఉన్న వారు ఎందరో ఉన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థినులు ఈ కళాశాలలో విద్యనభ్యసిస్తూ వసతి గృహంలో ఉంటున్నారు. నాడు – నేడు కింద డీకేడబ్ల్యూ అభివృద్ధికి వేగంగా అడుగులు పడుతున్నాయి. దీనిపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. 

నెల్లూరు(టౌన్‌): నెల్లూరులోని దొడ్ల కౌసల్యమ్మ ఉమెన్స్‌ డిగ్రీ కాలేజీ (డీకేడబ్ల్యూ) కొత్త కళ సంతరించుకోనుంది. ఈ కాలేజీ 25 ఎకరాల్లో 1,400 మందికి పైగా ఇంటర్మీడియట్, 1,200 మందికి పైగా డిగ్రీ విద్యార్థినులతో కళకళలాడుతూ ఉంటుంది. వారికి ఇక్కడే వసతి సౌకర్యాన్ని కూడా కల్పించారు.  నాడు – నేడు కింద డిగ్రీ కళాశాలను ఎంపిక చేశారు. పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలను కల్పించేందుకు రూ.6.23 కోట్లతో ప్రతిపాదనలను కాలేజీ ఎడ్యుకేషన్‌ కమిషనరేట్‌కు పంపించారు. దీంతోపాటు నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌ వర్క్‌ (ఎన్‌ఐఆర్‌ఎఫ్‌) కింద రూ.1.87 కోట్లు నిధులు విడుదలయ్యాయి. 

ఏ పనులంటే.. 
కళాశాలలో నాడు – నేడు కింద వివిధ పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు పంపారు. ఇందులో భాగంగా మరుగుదొడ్లు, రన్నింగ్‌ వాటర్‌కు రూ.55 లక్షలు, మేజర్, మైనర్‌ మరమ్మతులకు రూ.1.53 కోట్లు, కాంపౌండ్‌ వాల్‌కు రూ.29 లక్షలు, ఫర్నీచర్‌కు రూ.44 లక్షలు, ఫ్యాన్లు, లైట్లు, ఎలక్ట్రికల్‌ వర్క్స్‌కు రూ.92 లక్షలు, ఆర్వో ప్లాంట్, తాగునీటికి రూ.17 లక్షలు, పెయింటింగ్‌కు రూ.80 లక్షలు, గ్రీన్‌ చాక్‌బోర్డుకు రూ.1.50 లక్షలు, ఇంగ్లిష్‌ ల్యాబ్, కంప్యూటర్లకు రూ.11 లక్షల వ్యయం కానుందని ఇంజినీరింగ్‌ విభాగం అధికారులు అంచనా వేశారు.

ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ నిధులతో.. 
నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌ వర్క్‌ (ఎన్‌ఐఆర్‌ఎఫ్‌) నిధులతో కాలేజీలో వివిధ రకాల అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఇప్పటికే నిధులు కూడా విడుదలయ్యాయి. కళాశాలలోని 65 అంకణాల్లో కొత్త భవనం, ఉమెన్స్‌ వెయిటింగ్‌ హాల్, ఇన్‌సైడ్‌లో ఓపెన్‌ జిమ్‌ తదితర నిర్మాణాలు చేపట్టనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే టెండర్లు ఆహ్వానించారు. త్వరలో వీటి నిర్మాణాలు ప్రారంభం కానున్నాయి.

త్వరలో పనులు ప్రారంభం 
నాడు – నేడు పనులకు సంబంధించిన ప్రతిపాదనలను కాలేజీ ఎడ్యుకేషన్‌ కమిషనరేట్‌కు పంపించాం. ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ నిధులతో కూడా కొత్త భవనం నిర్మించనున్నాం. విద్యార్థినులకు అన్ని వసతులను కల్పించనున్నాం. ప్రధానంగా ఆర్వో ప్లాంట్‌ ఏర్పాటు చేసి కళాశాలలోని అన్ని ప్రాంతాలకు  తాగునీటిని అందిస్తాం. 
– గిరి, ప్రిన్సిపల్, డీకేడబ్ల్యూ కళాశాల  

ఇంకా ఏం చేస్తారంటే.. 
కళాశాలలో రూ.32 లక్షలతో డిజిటల్‌ ఎక్విప్‌మెంట్స్‌ను ఏర్పాటు చేయనున్నారు. సోషల్‌ రెస్పాన్స్‌బులిటీలో భాగంగా సెంబ్‌కార్ప్‌æ ద్వారా రూ.15 లక్షలతో పనులు చేపట్టనున్నారు. కళాశాలలో క్లీనింగ్‌తోపాటు మూడు వేల మొక్కలు నాటనున్నారు. ఇప్పటికే కొన్ని మొక్కలు నాటారు. వాటికి నీరందించేందుకు డ్రిప్‌ ఇరిగేషన్‌ను ఏర్పాటు చేశారు. ఈ మొక్కల మెయింటినెన్స్‌ను రెండేళ్లపాటు సెంబ్‌కార్ప్‌ నిర్వాహకులు చూసుకోనున్నారు. కొన్ని మొక్కల పెంపకం బాధ్యతను విద్యార్థినులకు అప్పగించారు.  

మరిన్ని వార్తలు