పీఆర్సీపై దుష్ప్రచారాలు నమ్మొద్దు

4 Jan, 2022 05:00 IST|Sakshi

విద్యుత్‌ ఉద్యోగుల సంక్షేమాన్ని ప్రభుత్వం విస్మరించదు

ఏపీసీపీడీసీఎల్‌ సీఎండీ పద్మజనార్దనరెడ్డి

సాక్షి, అమరావతి: పీఆర్సీపై కొన్ని పత్రికలు, సోషల్‌ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని విద్యుత్‌ ఉద్యోగులకు ఏపీసీపీడీసీఎల్‌ సీఎండీ పద్మజనార్దనరెడ్డి సూచించారు. విద్యుత్‌ ఉద్యోగుల జీతభత్యాలు, ఇతర సదుపాయాలపై పే రివిజన్‌ కమిటీ(పీఆర్సీ) అందరితో చర్చించిన తర్వాత ప్రభుత్వానికి నివేదిక ఇస్తుందని.. ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిన తర్వాత విద్యుత్‌ సంస్థలు ఆ నివేదికను ఆమోదిస్తాయని ఆయన తెలిపారు. ఈ మేరకు సోమవారం  పద్మజనార్దనరెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విద్యుత్‌ ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని తగిన నిర్ణయాలు తీసుకుంటుందని పేర్కొన్నారు.

కరోనా సమయంలో సంస్థ ఉద్యోగుల వైద్య బిల్లుల కోసం ప్రభుత్వం సకాలంలో రూ.3.02 కోట్లు చెల్లించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు. విద్యుత్‌ సంస్థలకు సబ్సిడీ బకాయిలు ఎప్పటికప్పుడు విడుదల చేసే విధంగా ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారని వివరించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం ఇప్పటివరకు రూ.25 వేల కోట్లకు పైగా సబ్సిడీ బకాయిలు విడుదల చేసిందని తెలిపారు. ఇటీవల ప్రతిపాదించిన సర్వీసు నిబంధనలు కొత్తగా చేరిన వారికే వర్తిస్తాయని పేర్కొన్నారు. ఇప్పటికే భర్తీ చేసిన ఎనర్జీ అసిస్టెంట్‌(జేఎల్‌ఎం గ్రేడ్‌–2) పోస్టులను నూతన రెగ్యులేషన్స్‌ ద్వారా గతేడాది అక్టోబర్‌ రెండో తేదీ నుంచి రెగ్యులరైజ్‌ చేయాల్సి ఉంటుందన్నారు. ఎవరికైనా సర్వీసు సమస్యలు, అనుమానాలుంటే సంబంధిత విద్యుత్‌ పంపిణీ సంస్థల సీఎండీలను సంప్రదించాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. వినియోగదారులకు మరింత మెరుగైన సేవలందించడంపై ఉద్యోగులు దృష్టి సారించాలని.. ఉద్యోగుల సంక్షేమాన్ని ప్రభుత్వం చూసుకుంటుందని       ఏపీసీపీడీసీఎల్‌  సీఎండీ పద్మజనార్దనరెడ్డి తెలిపారు.   

మరిన్ని వార్తలు