తెలంగాణ కొత్త ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వొద్దు 

14 May, 2023 05:31 IST|Sakshi

కేంద్రానికి మరోసారి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి 

కేంద్ర జల్‌ శక్తి శాఖకు జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి లేఖ 

సాక్షి, అమరావతి: గోదావరి నదీ జలాల్లో రెండు రా ష్ట్రాలకు వాటాలు తేల్చే వరకు తెలంగాణ ప్రభు త్వం చేపట్టిన సీతారామ ఎత్తిపోతల, కాళేశ్వరం ద్వారా మూడో టీఎంసీ తరలింపు సహా కొత్త ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వకూడదని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం మరో మారు విజ్ఞప్తి చేసింది. విభజన చట్టం ప్రకారం ట్రిబ్యునల్‌ ద్వారా నీటి వాటాలు తేలాలని లేదా నీటి వినియోగంపై రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరాకే కొత్త ప్రాజెక్టులకు అను మతివ్వాలని గుర్తు చేసింది. కానీ.. నిబంధనలను తుంగలో తొక్కి రోజుకు రెండు టీఎంసీల గోదావరి జలాలు తరలించేలా కాళేశ్వరం ఎత్తిపోతలకు 2018 జూన్‌ 6న కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) సాంకేతిక సలహా కమిటీ (టీఏసీ) అనుమతి ఇచ్చిందని ఎత్తిచూపింది.

ఆ అనుమతిని పునఃసమీక్షించాలని, తెలంగాణ చేపట్టిన కొత్త ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వకూడదని కేంద్రాన్ని కోరింది. వాటాలు తేల కుండానే ఎగువ రాష్ట్రాల ప్రాజెక్టులకు అనుమతి ఇస్తే దిగువ రాష్ట్రమైన ఏపీ హక్కులను హరించినట్లేనని తేల్చి చెప్పింది. ఏపీ హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని తెలిపింది. ఈ మేరకు కేంద్ర జల్‌ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్‌కు రాష్ట్ర జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ లేఖ రాశారు.

దమ్ముగూడెం ఆనకట్టకు 200 మీటర్లు దిగువన 36.57 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో సీతమ్మసాగర్‌ బ్యారేజీ, దానికి అనుబంధంగా 320 మె.వా జలవిద్యుత్‌ కేంద్రం నిరి్మంచి.. రోజుకు 9 వేల క్యూసెక్కుల చొప్పున 70 టీఎంసీలను తరలించి 6.74 లక్షల ఎకరాలకు నీళ్లందించేలా సీతారామ ఎత్తిపోతలను తెలంగాణ చేపట్టింది. ఈ ప్రాజెక్టుకు అనుమతి కోరుతూ  డీపీఆర్‌  ను గోదావరి బోర్డుకు అందజేసింది.

నీటి కేటాయింపుల్లేకుండా ప్రాజెక్టు ఎలా చేపడతారని తెలంగాణ సర్కార్‌ను బోర్డు నిలదీసింది. ఈ పథకం చేపడితే పోలవరం ప్రాజెక్టు ఆయకట్టుపై ఎలాంటి ప్రభావం చూపుతుందో అధ్యయనం చేసి, నివేదిక ఇవ్వాలని సీడబ్ల్యూసీని బోర్డు కోరింది. ఈ నేపథ్యంలో తెలంగాణ కొత్త ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వొద్దని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరో సారి కోరింది.  

రాష్ట్ర అవసరాలు 1238.436 టీఎంసీలు  
గోదావరి బేసిన్‌లో ఇప్పటికే పూర్తయినవి, నిర్మాణంలో ఉన్నవి, భవిష్యత్తులో చేపట్టే ప్రాజెక్టులకు 1,238.436 టీఎంసీలు అవసరమని కేంద్రానికి రా ష్ట్ర ప్రభుత్వం గతంలోనే స్పష్టం చేసింది. ఇందు లో  ఇప్పటికే పూర్తయి, వినియోగంలో ఉన్న ప్రాజె క్టులతోపాటు పోలవరానికి 737.156 టీఎంసీలను బచావత్‌ ట్రిబ్యునల్‌ కేటాయించింది. ఉమ్మడి రా ష్ట్రం లో చేపట్టి, ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టు లకు 165.280 టీఎంసీలు అవసరం.

మొత్తం 902.436 టీఎంసీలు అవసరం. బచావత్‌ ట్రిబ్యునల్‌ వరద జలాలను వినియోగించుకునే పూర్తి స్వేచ్ఛను, ఎగు వ రాష్ట్రాలకు కేటాయించగా మిగిలిన నికర జలాలను వాడుకునే హక్కును దిగువ రాష్ట్రమైన ఉమ్మడి ఏపీకి కల్పించింది. విభజన నేపథ్యంలో బేసిన్‌లో దిగువ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ అవుతుందని సీడబ్ల్యూసీ తేల్చింది. 336 టీఎంసీల వరద జలాలను వాడుకోవడానికి ప్రాజెక్టులు చేపడతామని ఇప్పటికే కేంద్రానికి ఏపీ స్పష్టం చేసింది. గోదావరి జలాలను 2 రాష్ట్రాలకు పంపిణీ చేయాలంటే కొత్త ట్రిబ్యునల్‌ ఏర్పాటుచేయాలని లేదంటే రాష్ట్రాల మధ్య నీటి వినియోగంపై ఒప్పందం జరగాలని పేర్కొంది.  

మరిన్ని వార్తలు