ఐఏఎల్‌ను స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించుకోవద్దు

22 Oct, 2020 04:49 IST|Sakshi

ఇండియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ లాయర్స్‌ తీర్మానాన్ని ఖండించిన గౌరవాధ్యక్షుడు రామజోగేశ్వరరావు

సాక్షి, అమరావతి/విశాఖపట్నం: సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)కి రాష్ట్ర సీఎం వైఎస్‌ జగన్‌ ఫిర్యాదు చేయడాన్ని ఖండిస్తూ ఇండియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ లాయర్స్‌ (ఐఏఎల్‌) చేసిన తీర్మానాన్ని ఆ సంఘం గౌరవాధ్యక్షుడు కె.రామజోగేశ్వరరావు ఖండించారు. బుధవారం ఆయనొక ప్రకటన చేస్తూ.. సీజేఐ ఎదుట పెండింగ్‌లో ఉన్న ఓ అంశాన్ని ఖండిస్తూ ప్రకటనలు జారీ చేయడం సమంజసం కాదన్నారు.

ఐఏఎల్‌ లెటర్‌ హెడ్‌పై ఖండన తీర్మానాన్ని పంపారని, ఆ లెటర్‌ హెడ్‌పై తన పేరు కూడా ఉందని పేర్కొన్నారు. అయితే, ఆ తీర్మానానికి తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఐఏఎల్‌ చేసిన తీర్మానం గురించి సంఘం ప్రతినిధులు తనకు సమాచారం ఇవ్వలేదన్నారు. ఐఏఎల్‌ను కొందరు తమ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జస్టిస్‌ కృష్ణయ్యర్‌ మహోన్నత ఉద్దేశంతో ప్రారంభించిన ఈ సంస్థకు న్యాయకోవిదుడు సి.పద్మనాభరెడ్డి రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరించారని, అలాంటి సంస్థ స్థాయిని దిగజార్చేశారని వాపోయారు. ప్రజలు, న్యాయవాదుల హక్కుల కోసం పోరాడాల్సిన సంస్థను కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆక్షేపించారు. స్వప్రయోజనాలను ఆశించి కొందరు సంస్థ పేరిట అలాంటి తీర్మానాలు చేస్తున్నారన్నారు.  

మరిన్ని వార్తలు