Kukkuta Sastram: ఇంత­కీ ఏమిటా కుక్కుట శాస్త్రం.. అది ఏం చెబుతోంది?

15 Jan, 2023 08:08 IST|Sakshi

ఇది కోడి పోరు పంచాగం

కుక్కుట శాస్త్రం.. ‘బరి’లో అస్త్రం!..

పందేల రాయుళ్లకు ఈ శాస్త్రమే ప్రామాణికం

నక్షత్ర బలంతోనే గెలుపోటములనే నమ్మకం

వారం, తిథి, దిశను బట్టి బరిలోకి రంగుల పుంజులు

సంక్రాంతి పర్వదినాన కోడి పందేలు హోరెత్తుతాయి. పుంజును బరిలో దించడానికి కూడా పలువురు పందేల రాయుళ్లు శాస్తాన్ని నమ్ముతారు. దాని ప్రకారమే నడుచుకుంటారు. ఆ శాస్త్రం  పేరే కుక్కుట శాస్త్రం. ఇది కోడి పుంజుల పోరుకు దిశా నిర్దేశం చేసే పంచాంగం వంటిది. ఏళ్ల తరబడి కోడి పందేలు నిర్వహించే పలువురికి ఇదే ప్రామాణికం.

సాక్షి, అమరావతి: నక్షత్ర బలంపైనే బరిలోకి ది­గి­­న కోళ్ల గెలుపోటములు ఆధారపడి ఉంటా­య­ని వా­రి నమ్మకం. బరిలో పోరుకు దిగిన పుంజు­కు పిక్క బలంతో పాటు దాని యజమాని పేరు బలం కూడా తోడవుతుందని వారి ప్రగాఢ విశ్వా­సం. అందుకే కోడి పందేల్లో సీనియర్లయిన వా­రంతా కుక్కుట శాస్త్రాన్ని ఔపోసన పట్టి మరీ.. వా­రం, తిథి, దిశను బట్టి అందుకు అనుగుణమైన రంగుల పుంజులను బరిలోకి దించుతారు. ఇంత­కీ ఏమిటా కుక్కుట శాస్త్రం.. అది ఏం చెబుతోందంటే..

ఈకల రంగును బట్టి పేర్లు   
నల్లని ఈకలున్న పుంజును కాకి అని, తెల్లని ఈకలుంటే సేతు అని పిలుస్తారు. మెడపై నలుపు, తెలుపు ఈకలు సమానంగా గల కోడి పుంజును పర్ల అంటారు. మెడపై నల్లని ఈకలు గలవాటిని సవలగా పిలుస్తారు. నల్లటి శరీరం, 2, 3 రంగుల ఈకలు గలవి కొక్కిరాయి(కోడి). ఎర్రటి ఈక­లుం­­టే.. డేగ, రెక్కలపై, వీపుపై పసుపు రంగు ఈక­­లుంటే.. నెమలి. నలుపు, ఎరుపు, పసుపు ఈక­లుంటే.. కౌజు. ఎరుపు, బూడిద రంగుల ఈకలున్నవాటిని మైలగా పిలుస్తారు.

ఒక్కో ఈకపై నలుపు, తెలుపు, ఎరుపు రంగులుంటే.. పూల. తెలుపు రెక్కలపై అక్కడక్కడా నలుపు రంగు, లేత గోధుమ రంగు ఈకలు గల కోడి పుంజు పింగళి. లేత బంగారు రంగు ఈకలు గలవి అబ్రా­సు. ముంగిస జూలు రంగు గల పుంజు ముంగిస. తెలుపు, లేత ఎరుపు ఈకలు గల పుంజు గేరువా. నలుపు, తెలుపు ఈకలు గలవి తెల్లగౌడు. నలుపు, ఎరుపు ఈకలున్న ఎర్రగౌడు. తెల్లని ఈకలపై నల్ల మచ్చలుంటే.. సేతు. రెక్కలపై నల్ల మచ్చలుంటే.. నల్ల సవల. వీటితో పాటు కోడి నెమలి, కాకి నెమలి, పచ్చ కాకి వంటి మిశ్రమ రకాలున్నాయి.

కోడి పుంజుల్లో కాకి, పచ్చ కాకి, కాకి నెమలి, డేగ ప్రసిద్ధమైనవి. సంక్రాంతి పండగ రోజుల్లో పందెం వేసే రోజున నక్షత్రాన్ని బట్టి తారా బలం చూసి కోడి రంగు, జాతిని ఎంపిక చేసి పందేలు వేస్తారు. భోగి రోజున గౌడ నెమలి, నెమలికి చెందిన పుంజులు, సంక్రాంతి రోజున యాసర కాకి డేగ, కాకి నెమలి, పసిమగల్ల కాకి, కాకి డేగ, కనుమ రోజున డేగ, ఎర్రకాకి డేగలు విజయం సాధిస్తాయని నమ్ముతారు.

నక్షత్రాన్ని బట్టి కోడి పోరు 
నక్షత్ర ప్రభావం మనుషుల మీదే కాకుండా పక్షు­లు, జంతువుల మీద కూడా ఉంటుందని నమ్ముతారు. ముఖ్యంగా కోడి పుంజుల్లో రక్త ప్రసరణపై గ్రహ ప్రభావం ఉంటుందని విశ్వసిస్తారు. దీంతో నక్షత్రాన్ని బట్టి ఆయా రంగుల కోడి పుంజులను బరిలోకి దించేందుకు దాని యజమాని పేరులోని మొదటి అక్షరాన్ని బట్టి జాతకాన్ని జోడించి లెక్క చూసి మరీ పోటీకి దిగుతారు. 27 నక్షత్రాలు, పందెం కోళ్లపై ప్రభావం చూపిస్తాయని, నక్షత్రాలను బట్టి అనుకూలమైన రంగుల కోళ్ల­ను బరిలోకి దించితే గెలుపు ఖాయమని నమ్ముతారు.

 ‘దిశ’తో దశ తిరుగుతుంది 
కుక్కుట శాస్త్రం ప్రకారం.. ఏ రోజు ఏ దిశలో కోడిపుంజును పందేనికి వదలాలనే దానిపై స్పష్టమైన అంచనా ఉంటుంది. ఆది, శుక్రవారాల్లో ఉత్తర దిశలో, సోమ, శనివారాల్లో దక్షిణ దిశలో, మంగళవారం తూర్పు దిశలో, బుధవారం, గురువారం పడమర దిశలో బరిలో దించుతుంటారు. వారాలను, పక్షాలను అనుసరించి కొన్ని జాతుల కోడి పుంజుల జీర్ణశక్తి మందగించి అవి ఓటమిపాలవుతాయని, వాటి ప్రత్యర్థులు విజయం సాధిస్తాయని అంటారు.
చదవండి: పారిశుద్ధ్య కార్మికులకు మంత్రి పాదపూజ 

ఎనిమిది దిక్కుల్లో వారాన్ని బట్టి ఏ దిశలో ఉండే బరిలో.. పోటీకి పుంజును దించితే విజయం దక్కుతుందో కూడా చూస్తారు. జ్యోతిష్య శాస్త్రంలో నవగ్రహాల సమయాన్ని అనుసరించి అవస్థా భేదాలు లెక్కిస్తుంటారు. ఇదే తరహాలో పక్షి జాతుల్లో పగటి సమయంలో గల ఐదు జాములకు ఐదు అవస్థలుగా ప్రస్తావించారు. భోజవావస్థలో కోడి పుంజును బరిలోకి దించితే విజయం దక్కుతుందని, రాజ్యావస్థలో పుంజు సులభంగా గెలుస్తుందని, గమనావస్థలో పందేనికి దించితే సామాన్య లాభం మాత్రమే వస్తుందని, నిద్రావస్థలో అపజ­యం పాలవుతుందని, జపావస్థలో బరిలోకి దించితే మృతి చెందుతుందని నమ్ముతారు. 

మరిన్ని వార్తలు