ఏ గుడికి వెళ్లినా మూలవిరాట్టు కన్నా ముందు మొక్కాల్సింది అక్కడే! నారేప ప్రత్యేకతే వేరు!

21 Apr, 2022 12:59 IST|Sakshi
అటవీప్రాంతంలో ఉన్న నారేప వృక్షం

బుట్టాయగూడెం (పశ్చిమగోదావరి): దేవుడి దర్శనం కోసం భక్తులు ఏ ఆలయానికి వెళ్లినా ముందుగా గుడి ముందు ఉన్న ధ్వజస్తంభానికి మొక్కుకున్నాకే గుడి లోపలకు వెళ్లి మూలవిరాట్టును దర్శించుకుంటారు. ధ్వజస్తంభంలోనూ దైవశక్తి ఉంటుందని ఆగమశాస్త్రం చెబుతోంది. అంతటి ప్రాముఖ్యత కలిగిన ధ్వజస్తంభాల తయారీకి ప్రకృతిలో ఎన్ని చెట్లు ఉన్నప్పటికీ అత్యధికంగా ఉపయోగిస్తున్నది మాత్రం నారేప చెట్టునే. ఈ చెట్టు బలంగా, ఎత్తుగా పెరగటమే కాకుండా కలప ఎన్నాళ్లయినా చెక్కు చెదరకుండా ఉండడమే ఇందుకు కారణం.
(చదవండి: నిశ్చితార్ధం ఫిక్స్‌ అయింది కదా అని, వ్యక్తిగత వీడియోలు షేర్‌ చేసినందుకు..)

వీటి ప్రత్యేకతే వేరు..
దేవాలయాల ఎదుట ప్రతిష్టించే ధ్వజస్తంభం తయారీకి సోమి చెట్టు, టేకు, నారేప చెట్టుతో పాటు ఇంకొన్ని రకాల వృక్ష జాతులను కూడా వినియోగిస్తుంటారు. అయితే ఎక్కువగా వినియోగించేది మాత్రం నారేప చెట్లను, తర్వాత సోమి చెట్లనే. వృక్ష జాతుల్లో నారేపకు ఒక ప్రత్యేకత కూడా ఉంది. నారేప చెట్ల కర్రలకు చెదలు పట్టవు. ఈ చెట్టు కర్రతో తయారుచేసిన ధ్వజస్తంభం దశాబ్దాల పాటు పటిష్టంగా ఉంటుంది. ప్రకృతి విపత్తులు వచ్చినా తట్టుకునే స్వభావం నారేప సొంతం. నారేప వృక్షం 50 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. చుట్టుకొలత 40 నుంచి 50 అంగుళాలు ఉంటుంది.

ఈ చెట్లు దట్టమైన అటవీ ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తుంటాయి. గోదావరి పరీవాహక అటవీ ప్రదేశాల్లో కూడా నారేప వృక్షాలు దర్శనమిస్తుంటాయి. పాపికొండల అభయారణ్యంతో పాటు ఏలూరు జిల్లాలోని బుట్టాయగూడెం, వేలేరుపాడు, కుక్కనూరు మండలాల పరిధిలోని అటవీ ప్రాంతంలో ఎక్కువగా నారేప చెట్లు ఉన్నాయి. అరుదైన నారేప వృక్షజాతిని కాపాడేందుకు పశ్చిమ మన్యంలోని ఏపీ అటవీ శాఖ అధికారులు నర్సరీల్లో నారేప మొక్కలను పెంచుతున్నారు. గతంతో పోల్చుకుంటే ఈ ప్రాంతంలో నారేప చెట్ల సంఖ్య క్రమంగా తగ్గిపోవడంతో నర్సరీల ద్వారా వీటి పెంపకాన్ని చేపట్టినట్లు అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు.

నర్సరీల్లో నారేప మొక్కల పెంపకం

చదవండి
👉🏼ఫైబర్‌, ఐరన్‌ అధికం.. బరువు తగ్గాలనుకుంటే ఈ జ్యూస్‌ తాగితే!
👉🏼 జగన్ ప్రభుత్వాన్ని దెబ్బతీయడానికే ‘అధర్మ యుద్ధం’

మరిన్ని వార్తలు