కనీసం 6 నెలలు బదిలీలు ఆపండి

15 Feb, 2022 05:34 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఇది సమయం కాదు

సీఎంకు డాక్టర్‌ పి.శ్యామ్‌సుందర్‌ విజ్ఞప్తి

డాబాగార్డెన్స్‌(విశాఖ దక్షిణ): వైద్యుల బదిలీల సమయం ఇది కాదని, కనీసం ఆరు నెలలు బదిలీలు అపాలని ఏపీ ప్రభుత్వ డాక్టర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ పి.శ్యామ్‌సుందర్‌ ప్రభుత్వాన్ని కోరారు. నగరంలోని ఓ హోటల్లో సోమవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. బదిలీల విషయమై పక్షం రోజులుగా ఎటువంటి ఆందోళనలు చేపట్టకుండా, రోడ్లెక్కి నిరసనలు చేయకుండా, శాంతియుతంగా ప్రజా ప్రతినిధులను కలిసి మొర పెట్టుకున్నా స్పందన రాలేదన్నారు.

బదిలీల విషయమై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైద్య సంఘాలతో చర్చించిన తర్వాతే బదిలీల విషయమై నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఆరోగ్యశాఖ అధికారులు సీఎంను తప్పుదోవ పట్టిస్తున్నారని శ్యామ్‌సుందర్‌ ఆరోపించారు. కేజీహెచ్‌లో ఉన్న 300 మందికి పైగా వైద్యులు ఐదేళ్లు పైబడి ఉన్నారని, వారందరినీ ఒకేసారి బదిలీ చేస్తే వ్యవస్థ తీవ్రంగా నష్టపోతుందన్నారు. ఫలితంగా ప్రజల ప్రాణాలు పోవడమే గాక, ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే ప్రమాదం ఉందని వివరించారు. అసోసియేషన్‌ విశాఖ అధ్యక్షుడు డాక్టర్‌ సుందరరాజు, కార్యదర్శి డాక్టర్‌ బి.రమేష్‌కుమార్‌ పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు